1. మీరు ప్రభువునకు పూర్తిగా విధేయులు కండు. ఈనాడు నేను మీకు విధించు ప్రభునాజ్ఞలను తు.చ. తప్పక పాటింపుడు. అప్పుడు యావే మిమ్ము ఈ భూమిమీది జాతులన్నిటికంటె అధికులను చేయును.
2. మీరు ప్రభువు మాటవిందురేని ఈ క్రింది దీవెనలెల్ల మీమీదికి వచ్చి మీకు ప్రాప్తించును.
3. ప్రభువు మీ నగరములను, మీ పొలములను దీవించును.
4. ఆయన మిమ్ము దీవించి మీకు చాలమంది బిడ్డలను, చాలపంటలను, చాలమంద లను దయచేయును.
5. మీ ధాన్యపు నిల్వను, మీ వంటపాత్రలు దీవెనలతో నిండిపోవును.
6. నీవు లోనికివచ్చునపుడును, వెలుపలికి వెళ్ళునపుడును దీవెనలు బడయుదవు.
7. మీమీదికి దండెత్తివచ్చు శత్రువులను ఓడించును. వారు మీమీదికి ఒక మార్గము వెంట దాడిచేసినచో ఏడుమార్గముల వెంటబడి పారి పోవుదురు.
8. ప్రభువు మీ గిడ్డంగులను దీవించి ధాన్యముతో నింపును. మీ సేద్యమును చల్లనిచూపు చూచును. తాను మీకీయనున్న నేలమీద మిమ్ము ఆశీర్వదించును.
9. మీరు ప్రభువు కట్టడలను, ఆజ్ఞలను పాటించి ఆయన మార్గమున నడతురేని ఆయన తాను మాటి చ్చినట్లే మిమ్ము తన సొంత ప్రజలుగా చేసికొనును.
10. భూమిమీది జాతులెల్ల మీరు ప్రభువు సొంత ప్రజలని గ్రహించి మీ యెదుట గడగడలాడుదురు.
11. ప్రభువు పితరులకు వాగ్దానము చేసిన నేలమీద మీకు చాలమంది పిల్లలను, చాలమందలను, చాల సమృద్ధిగా పంటలను దయచేయును.
12. ఆయన తన కోశాగారమువంటిదైన ఆకాశమునుండి మీ పొలముమీద సకాలమున వర్షములు కురియించును. మీ సేద్యమును దీవించును. మీరు చాలజాతులకు అప్పిత్తురు కాని ఏ జాతికిని మీరు అప్పుపడరు.
13. ఈనాడు నేను మీకు విధించు ప్రభువాజ్ఞలను పాటింతురేని మీరు ఇతర జాతులకు నాయకులు అయ్యేదరు కాని వారికి అనుచరులు కారు. మీరు ఇతరులకు తలగా నుందురుగాని, ఇతరులకు తోకగానుండరు.
14. మీరు ఈ ఆజ్ఞలను ఏమాత్రము ఉల్లంఘింపకయు, ఇతర దైవములనెంత మాత్రమును పూజింపకయు యుండిన యెడల మీరు ఇతరులకు పైచేయిగా నుందురేగాని, ఇతరుల మోచేతి క్రింది నీళ్ళు త్రాగరు.
15. కాని మీరు ప్రభువునకు అవిధేయులై నేనీనాడు మీకు విధించు ఆజ్ఞలను పాటింపరేని, ఈ క్రింది శాపములెల్ల మీ మెడకు చుట్టుకొనును.
16. ప్రభువు మీ నగరములను మీ పొలములను శపించును.
17. మీ ధాన్యపునిల్వను, మీ వంట పాత్రలను లేమితో శపించును.
18. ఆయన మిమ్ము శపించి మీకు బిడ్డలను, పంటలను, మందలను దయచేయడు.
19. మీరు లోనికి వచ్చునపుడును, వెలుపలికి వెళ్ళునపుడును శపింపబడుదురు.
20. మీరు ప్రభువును విడనాడి దుష్కార్యములు చేయుదురేని మీరు చేయుపనులన్నింటను ఆయన మీకు శాపము, నిరుత్సాహము, భంగపాటు కలుగు నట్లు చేయును. మిమ్ము శీఘ్రముగ, సమూలముగ నాశనము చేయును.
21. మీరు స్వాధీనము చేసి కొనబోవు నేలమీద మీరెల్లరు అంటువ్యాధులతో అణగారి పోవునట్లు చేయును.
22. మిమ్ము క్షయతో, జ్వరముతో, వాపులతో, మంటపుట్టించు బొబ్బలతో పీడించును. అనావృష్టితో, వడగాలులతో మిమ్ము బాధించును. మీరు చచ్చువరకు వానిబాధను తప్పించు కోజాలరు.
23. మీ మీది ఆకాశము ఇత్తడివలె పేరుకొనిపోగా వాన చినుకుపడదు. మీ క్రింది నేల ఇనుమువలె గట్టిపడిపోవును.
24. ప్రభువు మీ దేశముమీద వానజల్లులకు మారుగా, గాలి దుమార ములు పంపును. అవి మీ ప్రాణములు తీయును.
25. ప్రభువు మీ శత్రువులు మిమ్ము ఓడించునట్లు చేయును. మీరు మీశత్రువులమీద ఒకమార్గము వెంట దాడిచేసి, ఏడుమార్గముల వెంట మీరు పారిపోవు దురు. లోకములోని జాతులెల్ల మీ దుర్గతిని చూచి భయపడును.
26. ఆకాశమున పక్షులకును, భూమి మీది మృగములకును మీ శవములు ఆహారమగును. వానిని అదలించు వారెవ్వరును ఉండరు.
27. ప్రభువు మిమ్ము ఐగుప్తు బొబ్బలతో, గజ్జలలో లేచు గడ్డలతో, మచ్చలతో, గజ్జితో వేధించును. ఆ రోగములు నయముగావు.
28. ఆయన మిమ్ము పిచ్చి వారిని, గ్రుడ్డివారిని చేయును. మిమ్ము భయపెట్టును.
29. మీరు మిట్టమధ్యాహ్నము కూడ రేచీకటి వానివలె త్రోవగానక దేవురింతురు. మీరు ఏ కార్యము చేపట్టి నను అపజయము కలుగును. పరులు మిమ్ము నిరంతరము పీడింతురు. ఎవ్వడును మీకు సహాయము చేయడు.
30. నీకు ప్రధానము చేయబడిన పిల్లను మరి యొకడు కూడును. మీరు కట్టిన ఇంట వసింపజాలరు. మీరు నాటిన ద్రాక్షతోటనుండి పండ్లు సేకరింపజాలరు.
31. మీ ఎద్దును మీ ఎదుటనే కోయుదురు. కాని మీరు దాని మాంసమును భుజింపజాలరు. మీరు చూచుచుండగనే మీ గాడిదను తోలుకొని పోవుదురు. మరల దానిని మీ ఇంటికి కొనిరారు. మీ శత్రువులు మీ గొఱ్ఱెలను, మేకలను తోలుకొనిపోవుదురు. ఎవరును మీకు సహాయము చేయుటకురారు.
32. అన్యజాతిజనులు మీ కుమారులను, కుమార్తెలను, బానిసలనుగా కొనిపోవుదురు. వారి రాకకై మీరు కన్నులులో ఒత్తులు వేసికొని చూతురు. కాని మీరు ఏమియు చేయజాలరు.
33. అన్యజాతి ప్రజలు దండెత్తి వచ్చి మీరు మీ పొలమున చెమటోడ్చి పండించిన పంటను అపహరింతురు. వారు మిమ్ము నిరంతరము పీడించి అణగదొక్కుదురు.
34. మీరు అనుభవించు బాధలనుచూచి మీరు పిచ్చివారై పోవు దురు.
35. ప్రభువు మీ కాళ్ళమీద కుదరని చెడ్డ బొబ్బలు పొక్కించును. తల నుండి కాళ్ళ వరకు మీ శరీరమంత కురుపులతో నిండిపోవును.
36. ప్రభువు మిమ్మును, మీరెన్నుకొనిన రాజును మీకుగాని, మీ పితరులకుగాని తెలియని అన్యదేశము నకు పంపివేయును. అచట మీరు రాతితో, కొయ్యతో చేసిన విగ్రహములను కొలుతురు.
37. అటుల ప్రభువు మిమ్ము చెల్లాచెదరు చేయగా ఆ విదేశములోని ప్రజలు మిమ్ముచూచి విస్మయము చెందెదరు.
38. మీరు చాల విత్తనములను వెదజల్లుదురు. కాని కొద్దిపాటి పంటను మాత్రము సేకరింతురు. ఏలయనగా మిడుతలు మీ పైరును తినివేయును.
39. మీరు ద్రాక్షలునాటి సాగుచేయుదురుగాని, పండ్లనుగాని, ద్రాక్ష సారాయమునుగాని అనుభవింప జాలరు. ఏలయన పురుగులు ఆపండ్లను తినివేయును.
40. మీ పొలమంతట ఓలివుచెట్లను పెంచుదురు. కాని వాని నూనెను వాడుకొనజాలరు. వాని కాయలు రాలిపోవును.
41. మీకు కుమారులు, కుమార్తెలు కలుగుదురు. కాని వారిని మీ చెంత నుండి బందీలుగా కొనిపోయెదరు.
42. మీ చెట్లను, పైరుపంటలను కీటకములు ధ్వంసముచేయును.
43. మీ దేశమున వసించు అన్యదేశీయులు క్రమముగా వృద్ధి చెందుదురు. మీరు మాత్రము క్రమముగా సన్నగిల్లిపోవుదురు.
44. వారు మీకు అరువు ఇత్తురుగాని మీరు వారికి అరువు ఈయ జాలరు. వారు తలలుకాగా, మీరు తోకలవుదురు.
45. ప్రభువునకు అవిధేయులై ఆయన శాసించిన ఆజ్ఞలు పాటింపనందులకు పై కీడులెల్ల మీమీదికి దిగివచ్చి, మీ మెడకు చుట్టుకొని, మిమ్ము నశింప జేయును.
46. మిమ్మును, మీ సంతానమును ప్రభువు శిక్షించుచున్నాడనుటకు ఆ కీడులు శాశ్వత నిదర్శనములుగా నుండును.
47. ప్రభువు మిమ్ము సమృద్ధిగా దీవించినందులకు మీరు ఆయనను సంతోషముతోను, హృదయానందముతోను సేవించి యుండవలసినది. కాని మీరు అటుల చేయరైరి.
48. కనుక మీరు ప్రభువు పంపు శత్రువులకు బానిసలగుదురు. ఆకలి, దప్పిక, బట్టలు లేమియను సకలదారిద్య్రములను అనుభవింతురు. శత్రువులు మిమ్ము దారుణముగ పీడింపగా మీరు నశింతురు.
49. ప్రభువు సుదూరమగు భూదిగంతముల నుండి, ఒక శత్రుజాతి ప్రజను మీమీదికి కొనివచ్చును. వారిభాష మీకు తెలియదు. వారు గరుడపక్షివలె మీ మీద వ్రాలుదురు.
50. ఆ శత్రువులు భయంకరాకారులు, వృద్ధులమీద, యవ్వనస్తులమీద గూడ దయ చూపనివారు.
51. వారు మీమందలను, మీ పొలమున పండిన పంటను తినివేయగా మీరు ఆకలితో చత్తురు. వారు మీ ధాన్యము, ద్రాక్ష సారాయము, ఓలివునూనె, మందలను మిగులనీయరు. కనుక మీరెల్లరు చావ వలసినదే.
52. ఆ శత్రువులు ప్రభువు మీకు ఈయనున్న నేలమీది ప్రతి పట్టణమును ముట్టడింతురు. ఎత్తయి అభేద్యముగా ఉన్న మీ ప్రాకారములు, మీరు వాని నెంతగా నమ్ముకొనియున్నను నేలమట్టమగును. మీ దేశమునందలి గ్రామములన్నింటిని ముట్టడి చేయుదురు.
53. ఆ ముట్టడిలో మీరు ఆకలిబాధ భరింప జాలక ప్రభువు మీకు దయచేసిన బిడ్డలనే తిందురు.
54. శత్రువులు వచ్చి మీ పట్టణములను ముట్టడించి మిమ్ము బాధించుకాలమున, కలవారియింట పుట్టి మృదు స్వభావముతో అతి సుకుమారముగా పెరిగిన మనుష్యుడు కూడ తిండి దొరకక తన పిల్లలను కొందరిని తినివేయును.
55. తన సోదరునికిగాని, ప్రియభార్యకుగాని, చంపక మిగిలియున్న తన పిల్లలకు గాని తాను తిను మాంసములో భాగమీయడు.
56-57. శత్రువులు వచ్చి మీ పట్టణములను ముట్టడించి మీకు ఏమియు దొరకనీయకుండ బాధ పెట్టు కాలమున కలవారింట పుట్టి, చాల సుకుమారముగా పెరిగి, తన అరికాలు నేలపై మోపుటకు అంగీకరించని స్త్రీ సైతము తిండి దొరకక తన కాళ్ళ మధ్య తాను కనబోవు బిడ్డతోపాటు తన గర్భమునుండి వెలువడిన మావిని కూడ తాను రహస్యముగా భక్షింప తన ప్రియభర్తకు గాని, బిడ్డలకుగాని ఆమె జాలినొందనిదై ఆ తిండిలో భాగమీయదు.
58. మీరు ఈ గ్రంథమున వ్రాయబడిన దైవ శాసనములన్నిటిని పాటింపరేని, భయంకరమును, మహిమాన్వితమునైన ఆ ప్రభువు దివ్యనామమునకు భయపడరేని,
59. ప్రభువు మిమ్మును, మీ సంతానమును అంటురోగములతో పీడించును. ఆ రోగములు తిరుగులేనివి, ఘోరమైనవి, శాశ్వతమైనవి.
60. పైగా మీరు ఐగుప్తున చూచిన భయంకర వ్యాధులనుగూడ ప్రభువు మీకు సోకించును. అవి మిమ్ము వదలవు.
61. ఇంకను ప్రభువు ఈ ధర్మశాస్త్ర గ్రంథమున పేర్కొనని రోగములకును, అంటువ్యాధులకును మిమ్ము బలిచేయును. వానివలన మీరెల్లరును చత్తురు.
62. మీరు ఆకాశ నక్షత్రములవలె అసంఖ్యాకులుగా నున్నను, చివరకు కొద్దిమందిమాత్రమే మిగులుదురు. మీ ప్రభువునకు విధేయులు కానందులకు ఇట్టి శిక్ష పొందుదురు.
63. ఇంతవరకు ప్రభువు సంతోషముతో మీకు మేలుచేసి మీ సంఖ్యను హెచ్చించెను. కాని ఇక మీదట ఆయన సంతోషముతో మిమ్ము నాశనముచేసి నిర్మూలనము చేయును. మీరు ఆక్రమించుకొనబోవు దేశమునుండి మిమ్ము ఆయన వ్రేళ్ళతో పెరికివేయును.
64. ప్రభువు మిమ్ము నేల నాలుగు చెరగులందలి నానాజాతుల మధ్య చెల్లాచెదరుచేయును. అచట మీరు గాని, మీ పితరులుగాని ఎరుగని కొయ్యబొమ్మలను, రాతిబొమ్మలను కొలిచెదరు.
65. ఆ దేశమున మీకు కుదురుపాటుగాని, శాంతిగాని లభింపదు. మీ గుండె దడదడలాడును. మీ కళ్ళు మూతలుపడును. నిరాశ మిమ్మావరించును.
66. మీరు నిరంతరము అపాయ ముతో జీవింతురు. రేయింబవళ్ళు మీకు భయము పుట్టును. మీ జీవితము సురక్షితముగానుండదు.
67. మీరు ఉదయకాలమున సాయంకాలము కొరకును, సాయంకాలమున ఉదయముకొరకును కనిపెట్టుకొని యుందురు. మీ హృదయములు అంతటి భయముతో నిండిపోవును. మీరంతటి భయంకరదృశ్యములను చూచెదరు.
68. ప్రభువు మీరు మరల ఐగుప్తునకు వెళ్ళరని చెప్పినను, ఓడలమీద మిమ్ము అచటికి పంపును. అచట మీరు శత్రువులకు బానిసలుగా అమ్ముడు పోవగోరుదురు. కాని మిమ్ముకొనుటకు యిష్టపడు ఒకడైనను ఉండడు.”
69. ప్రభువు మోవాబు దేశమున మోషేను యిస్రాయేలీయులతో చేసికొనుమనిన నిబంధనపు షరతులివి. ప్రభువు హోరేబు చెంత యిస్రాయేలీయు లతో చేసికొనిన నిబంధనము ఉండనేయున్నది.