1. మోషే పెద్దలతో కూడి యిస్రాయేలు ప్రజలనిట్లు ఆజ్ఞాపించెను: “నేడు నేను మీకు విధించిన ఆజ్ఞలన్నిటిని చేకొనుడు.
2. మీరు యోర్దాను దాటి యావే మీకీయనున్న నేలను చేరుకొనినపిదప అచట పెద్దరాళ్ళు పాతి, సున్నము పూయుడు.
3. వాని మీద ఈ ధర్మశాస్త్రనియమములన్నిటిని వ్రాయుడు. ప్రభువు మీ పితరులకు వాగ్దానము చేసిన ఆ పాలు తేనెలు జాలువారునేలను చేరుకొనగనే ఈ కార్యము నిర్వహింపుడు,
4. మీరు యోర్ధాను దాటగనే నేను ఆజ్ఞాపించినట్లు ఏబాలు కొండపైన ఈ రాళ్ళుపాతి వానికి సున్నము పూయుడు.
5. తరువాత అక్కడ ఇనుప పనిముట్లు తాకని కరకురాళ్ళతో, యావేకు బలిపీఠమును నిర్మింపుడు.
6. చెక్కని ఆ కరకురాళ్ళతో యావేకు బలిపీఠము నిర్మించి దానిమీద దహన బలులను అర్పింపుడు.
7. అచటనే సమాధానబలులుకూడ సమర్పించి ఆ నైవేద్యములను ప్రభువు ఎదుట సంతోషముతో ఆరగింపుడు.
8. సున్నముకొట్టిన ఆ రాళ్ళమీద మాత్రము ఈ దైవశాసనములన్నిటిని స్పష్టముగా లిఖింపుడు”.
9. అటుతరువాత మోషే లేవీయ యాజకులతో కలసి ప్రజలతో ఇట్లనెను: “యిస్రాయేలీయులారా! మీరు నా పలుకులెల్ల సావధానముగా వినుడు. నేడు మీరు మీ ప్రభువైన యావేకు చెందిన ప్రజలైతిరి.
10. నేడు నేను మీకు విధించిన కట్టడలను ఆజ్ఞలన్నిటిని పాటించి ఆ ప్రభువునకు విధేయులు కండు.”
11-12. ఆ దినమందే మోషే ప్రజలకు ఇట్లు ఆజ్ఞాపించెను: “మీరు యోర్దాను దాటిన తరువాత షిమ్యోను, లేవి, యూదా, యిస్సాఖారు, యోసేపు, బెన్యామీను తెగలవారు గెరిసీము కొండమీద నిలు చుండియుండగా యిస్రాయేలుప్రజ దీవింపబడును.
13. మరియు రూబేను, గాదు, ఆ షేరు, సెబూలూను, దాను, నఫ్తాలి తెగలవారు ఏబాలు కొండమీద నిలుచుండియుండగా యిస్రాయేలు ప్రజ శపింపబడును.
14. లేవీయులు ఈ క్రింది శాపవచనములు పెద్దగా ఉచ్చరింతురు:
15. 'కొయ్యతోగాని, రాతితోగాని, లోహముతో గాని విగ్రహమునుచేసి దానిని రహస్యముగా ఆరాధించు వాడు శాపగ్రస్తుడు. ప్రభువు విగ్రహారాధనను అసహ్యించు కొనును. అప్పుడు ప్రజలందరు 'ఆమెన్' అని జవాబు చెప్పవలయును.
16. 'తల్లిదండ్రులను గౌరవింపనివాడు శాప గ్రస్తుడు. ప్రజలందరు 'ఆమెన్' అని జవాబు చెప్ప వలయును.
17. 'పొరుగువాని పొలమునందలి సరిహద్దు గట్టురాతిని తొలగించువాడు శాపగ్రస్తుడు.' ప్రజలందరు 'ఆమెన్' అని జవాబు చెప్పవలయును.
18. 'గ్రుడ్డివానిని అపమార్గము పట్టించువాడు శాపగ్రస్తుడు.' ప్రజలందరు 'ఆమెన్' అని జవాబు చెప్పవలయును.
19. 'పరదేశుల, అనాధల, వితంతువుల హక్కులను భంగపరచువాడు శాపగ్రస్తుడు.' ప్రజలందరు 'ఆమెన్' అని బదులు చెప్పవలయును.
20. తండ్రి భార్యను కూడినవాడు శాపగ్రస్తుడు. ఏలయన అతడు తండ్రి హక్కును భంగపరిచినవాడు. ప్రజలందరు 'ఆమెన్' అని జవాబు చెప్పవలయును.
21. 'జంతువులను కూడువాడు శాపగ్రస్తుడు.' ప్రజలందరు 'ఆమెన్' అని బదులు చెప్పవలయును.
22. 'తన సహోదరితో అనగ, తన తండ్రి కుమార్తెతోగాని, తల్లికుమార్తెతోగాని కూడువాడు శాపగ్రస్తుడు.' ప్రజలందరు 'ఆమెన్' అని బదులు చెప్పవలయును.
23. 'అత్తను కూడువాడు శాపగ్రస్తుడు.' ప్రజలందరు 'ఆమెన్' అని బదులు చెప్పవలయును.
24. 'చాటుగా పొరుగువానిని దెబ్బతీయువాడు శాపగ్రస్తుడు.' ప్రజలందరు 'ఆమెన్' అని బదులు చెప్పవలయును.
25. 'నిరపరాధికి ప్రాణహాని చేయుటకు లంచము తీసికొనువాడు శాపగ్రస్తుడు. ' ప్రజలందరు 'ఆమెన్' అని చెప్పవలయును.
26. 'ఈ విధికి సంబంధించిన నియమములను గైకొని పాటింపనివాడు శాపగ్రస్తుడు.' ప్రజలెల్లరు 'ఆమెన్' అని బదులు చెప్పవలయును.”