1. మీరు ప్రభువు మీకు ఈయనున్న నేల నాక్రమించుకొని అచట స్థిరపడినపిదప,
2. మీ పొలమున పండినపంటలో ప్రథమ ఫలములను గంపలో పెట్టుకొని ప్రభువు తన నామమునకు మందిరముగా ఎంచుకొనిన ఏకైక ఆరాధనస్థలమునకు కొనిపొండు.
3. అప్పుడు అచట సేవచేయుచున్న యాజకుని వద్దకు పోయి 'నేను ప్రభువు మన పితరులకు వాగ్దానము చేసిన నేలను చేరుకొంటినని నేడు దేవుని ముందు ప్రమాణముచేసి చెప్పుచున్నాను' అని చెప్పుడు.
4. అంతట యాజకుడు నీ గంపను తీసికొని ప్రభువు బలిపీఠము ముందుంచును.
5. అప్పుడు నీవు ప్రభువు సమక్షమున ఇట్లు ఉచ్చరింపవలయును: “ 'మా వంశకర్త దేశ సంచారియగు అరామీయుడు. అతడు కొద్దిమందితో ఐగుప్తునకు వెళ్ళి అచట పరదేశిగా బ్రతికెను. కాని ఆ కొద్దిమంది బలమైన మహాజాతిగా వృద్ధిచెందెను.
6. ఐగుప్తీయులు మనకు కీడు తలపెట్టి మనలను బాధించిరి. మనచేత వెట్టిచాకిరి చేయించుకొనిరి.
7. మనము మన పితరుల దేవుడైన యావేకు మొరపెట్టగా, యావే దేవుడు మనగోడు వినెను. ఆయన మన కష్టములను, చాకిరిని, మన అణచివేతను కన్నులార చూచెను.
8. దేవుడైన యావే తన హస్త బలమువలనను, చాపిన బాహువులవలనను, సూచకక్రియలవలనను, భయంకర కార్యములతోను, అద్బుతములతోను మనలను ఐగుప్తునుండి తోడ్కొనివచ్చెను.
9. మనలను ఇచటికి కొనివచ్చి పాలుతేనెలు జాలువారు ఈ నేలను మనకు ప్రసాదించెను.'
10. కనుక ఇప్పుడు ప్రభువు నాకు దయచేసిన పంటనుండి ఈ ప్రథమఫలములను ఆయనకు కానుకగా కొనివచ్చితిని" అని ప్రభువు సన్నిధిన చెప్పి, నీ గంపను ప్రభువు నెదుట పెట్టి ఆయనకు మ్రొక్కుము.
11. తదనంతరము నీ కుటుంబముతో, నీ నగరమున వసించు లేవీయులతో, పరదేశులతో కలసి ఉత్సవము చేసికొని ప్రభువు దయచేసిన మేలైన పదార్ధములన్నింటిని అనుభవింపుము.
12. ప్రతి మూడవయేడు మీకు పండిన పంటలో పదియవ వంతును లేవీయులకు, పరదేశులకు, అనాధలకు, వితంతువులకు చెల్లింపవలయును. వారు ఆ పంటను మీ నగరములలో సంతృప్తికరముగా భుజింతురు.
13. అటుల నీవు పదియవ వంతు చెల్లించిన పిమ్మట ప్రభువు సమక్షమున ఇట్లు ఉచ్చరింపుము. 'ప్రభూ! నేను నీకర్పింపవలసిన పదియవవంతు చెల్లించితిని. నీవాజ్ఞాపించినట్లే లేవీయులకు, పరదేశులకు, అనాధలకు, వితంతువులకు దానినొసగితిని. దశమభాగములను గూర్చిన నీ నియమములను నేను మీరలేదు, విస్మరింపలేదు.
14. నేను దుఃఖముగానున్నప్పుడు దానిని భుజింపలేదు. శుద్ధిచేసికొనకయే అంటుకొనలేదు. దానిని మృతపూజలో అర్పణముగా నీయలేదు. ప్రభూ! ఈ పదియవ వంతును గూర్చి నీవు విధించిన ఆజ్ఞలన్నిటిని పాటించితిని.
15. పవిత్రమైన నీ పరమపదము నుండి ఈ యిస్రాయేలు ప్రజలను దీవింపుము. నీవు పితరులకు వాగ్దానము చేసినట్లే మాకు ప్రసాదించిన ఈ పాలుతేనెలుజాలువారు నేలను దీవింపుము.'
16. నేడు ప్రభువు మీరు ఈ కట్టడలను ఆజ్ఞ లన్నిటిని పాటింపగోరుచున్నాడు. మీరు పూర్ణహృదయముతోను, పూర్ణాత్మతోను వీనిని అనుసరింపుడు.
17. నేడు మీరు ప్రభువును మీదేవునిగా ఎన్నుకొంటిరి. ఆ ప్రభువు మార్గములందు నడచుచు, ఆయన కట్టడలను, విధులను, ఆజ్ఞలన్నిటిని పాటించి, ఆయనకు విధేయులై యుండుటకు సమ్మతించితిరి.
18. ప్రభువు కూడ తాను మాట ఇచ్చినట్లే నేడు మిమ్ము తన సొంత ప్రజలనుగా చేసికొనెను. కాని మీరు తన ఆజ్ఞలన్నిటిని చేకొనవలయునని ఆ ప్రభువు కోరిక.
19. ఆయన తాను కలిగించిన జాతులన్నిటికంటె మిమ్ము అధికులను చేయును. దానివలన మీకు కీరి ప్రతిష్ఠలు కలుగును. ప్రభువు చెప్పినట్లే మీరు ఆయన పవిత్ర ప్రజలగుదురు.