1. ఇరువురు యిస్రాయేలీయులు తగాదా పడి న్యాయస్థానమునకు వెళ్ళినపుడు అచటి అధిపతులు దోషిని దోషిగా, నిర్దోషిని నిర్దోషిగా నిర్ణయింపవలయును.
2. దోషికి శిక్ష విధింపవలసివచ్చినచో న్యాయాధిపతి అతనిని నేలమీద బోరగిల పరుండ బెట్టించును. అతని అపరాధమునకు తగినన్ని కొరడా దెబ్బలు విధించి కొట్టించును.
3. దోషికి నలుబది దెబ్బలు విధించిన చాలు. అంతకంటె ఎక్కువ దెబ్బలు విధించినచో తన సహోదరుని బహిరంగముగా అవమానపరచినట్లగును.
4. కళ్ళము తొక్కించునపుడు ఎద్దు మూతికి చిక్కము పెట్టరాదు.
5. ఇరువురు సోదరులు కలసి నివసించుచుండగా ఒకడు సంతానములేక చనిపోయినచో, అతని వితంతువు అన్యకుటుంబపు పురుషుని వివాహమాడరాదు. ఆమె పెనిమిటి సోదరుడు ఆమెను దేవర న్యాయము ప్రకారము పెండ్లి చేసుకొని తన సోదరునికి మారుగా భర్త ధర్మము నెరవేర్చవలెను.
6. ఆమెకు పుట్టిన మొదటి కుమారుడు చనిపోయిన తన సోదరుని కుమారుడుగా గణింపబడును. ఆ రీతిగా యిస్రాయేలీయులలో అతని కుటుంబము తుడిచి పెట్టుకొని పోకుండా, వర్దిల్లును.
7. కాని ఆమె పెనిమిటి సోదరుడు ఆమెను చేపట్టనిచో ఆ వితంతువు పుర ద్వారము చెంతప్రోగైన పెద్దలయొద్దకుపోయి 'నా పెనిమిటి సోదరుడు నాకు దేవరన్యాయము జరిగించుటకు ఒప్పుకొనుటలేదు. అతడు తన సోదరుని సంతానము యిస్రాయేలీయులలో వర్ధిల్లుటకు ఇష్ట పడుటలేదు” అని చెప్పవలయును.
8. అప్పుడు పెద్దలతనిని పిలిపించి మాట్లాడవలయును. అతడు అంగీకరింపడేని,
9. ఆ వితంతువు పెద్దలు చూచుచుండగా అతని చెంతకు వెళ్ళి అతని కాలి చెప్పును ఊడబెరుకవలయును. అతని ముఖమున ఉమ్మివేసి 'సోదరునికి సంతానము కలిగింపని వానికట్లే జరుగును' అని పలుకవలయును.
10. ఆ మీదట యిస్రాయేలీయులలో అతని కుటుంబము 'చెప్పు ఊడదీయబడిన వాని కుటుంబము' అని నిందకెక్కును.
11-12. ఇరువురు పురుషులు పోట్లాడుకొనునపుడు వారిలో ఒకని భార్య, శత్రువు దెబ్బల నుండి పెనిమిటిని కాపాడుకొనుటకు ముందుకు వెళ్ళి ఆ శత్రువు జననేంద్రియమును పట్టుకొనెనేని ఆమె చేతిని నిర్దయతో నరికివేయవలయును.
13. మీరు ఒకటి పెద్దది ఒకటి చిన్నదిగా ఉండునట్లు రెండుతూకపురాళ్ళు వాడరాదు.
14. ఒకటి పెద్దది ఒకటి చిన్నదిగా రెండు కొలమానములను ఉపయోగించరాదు.
15. సరియైన తూకపురాయి ఒక్కదానినే, సరియైన కొలమానమునొక్కదానినే మీచెంతన ఉంచుకొనుడు. అప్పుడు యావే మీకు ఈయనున్న ఆ నేలమీద మీరు చిరకాలము జీవింతురు.
16. ఇట్టి మోసములు చేయువానిని దేవుడైన ప్రభువు అసహ్యించుకొనును. అమాలెకీయులను మట్టుపెట్టవలయును
17. మీరు ఐగుప్తునుండి వెడలివచ్చునపుడు అమాలేకీయులు మీకేమి చేసిరో జ్ఞప్తికి తెచ్చుకొనుడు.
18. వారు మీ వెనువెంటవచ్చి మీలో వెనుకబడి నడువలేని దుర్బలులను వధించిరి. ఆ రీతిగా వారు దైవభయము ఏమాత్రము లేక అలసిసొలసియున్న వారిని చంపిరి.
19. యావే మీకు ఆ నేలనిచ్చి మీ చుట్టుపట్లనున్న శత్రువులనుండి మీకు భద్రతను దయచేసినపుడు మీరు ఈ నేలమీద అమాలేకీయుల అడపొడ కానరాకుండచేయుడు. ఈ సంగతి మరచి పోవలదు.