ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

యెహోషువ 24

1. యెహోషువ యిస్రాయేలు తెగలన్నిటిని షెకెము వద్ద సమావేశపరచెను. వారి పెద్దలు, నాయకులు, న్యాయాధిపతులు, ముఖ్యులు యావే సమక్షమున పోగైరి.

2. యెహోషువ వారితో ఇట్లనెను: “యావే పలుకులివి. 'పూర్వము అబ్రహాము, నాహోరు, వారి తండ్రియగు తెరా యూఫ్రటీసు నదికి ఆవల నివసించుచు అన్యదైవములను కొలిచిరి.

3. అంతట నేను మీ పితరుడైన అబ్రహామును నదికి ఆవలినుండి తోడ్కొని వచ్చి ఈ కనాను మండలమునందంతట సంచరించునట్లు చేసితిని. అతని సంతానమును వృద్ది చేయగోరి ఈసాకును కలుగజేసితిని.

4. ఈసాకునకు యాకోబు, ఏసావులను కలుగజేసితిని. ఏసావునకు సేయీరు పర్వతసీమను వారసత్వభూమిగా కలుగ జేసితిని. తరువాత యాకోబు అతని కుమారులు ఐగుప్తునకు వలసపోయిరి.

5. అటుతరువాత మోషే అహరోనులను పంపితిని. ఐగుప్తున అద్భుతకార్యములు చేసి, ఉత్పాతములు పుట్టించి మిమ్ము ఈవలకు నడిపించుకొనివచ్చితిని.

6. నేను మీ పితరులను ఐగుప్తునుండి తోడ్కొని వచ్చితిని. వారు రెల్లుసముద్రమును చేరిరి.

7. అచట వారు యావేకు మొరపెట్టగా ప్రభువు వారికిని, ఐగుప్తీయులకు మధ్య దట్టమైన చీకటిని నిలిపి, సముద్రము ఐగుప్తీయుల మీదికి పొర్లివచ్చి వారిని ముంచివేయునట్లు చేసెను. నేను ఐగుప్తున చేసిన అద్భుతకార్యములన్నిటిని మీరు కన్నులార చూచితిరి. అటుపిమ్మట మీరు చాలకాలము వరకు అరణ్యముననే వసించితిరి.

8. తరువాత మిమ్ము యోర్దానునకు ఆవల వసించు అమోరీయుల మండలమునకు కొనివచ్చితిని. వారు మీమీదికి యుద్ధమునకు రాగా నేను వారిని మీ వశముచేసితిని. నేను వారిని నాశనముచేసితిని గనుక మీరు వారి దేశమును స్వాధీనముచేసికొంటిరి.

9. పిమ్మట మోవాబు రాజైన సిప్పోరు కుమారుడు బాలాకు యిస్రాయేలీయుల మీదికి దండెత్తివచ్చి బెయోరు కుమారుడగు బిలామును మిమ్ము శపింపపురికొల్పెను.

10. కాని నేను బిలాము పన్నుగడను సాగనీయలేదు. కనుక మిమ్ము శపింపవచ్చినవాడు దీవించి పోవలసివచ్చెను. ఈ విధముగా మిమ్ము అతని బారినుండి కాపాడితిని.

11. అంతట మీరు యోర్దానునది దాటి యెరికో పట్టణమునకు రాగా ఆ నగర పౌరులు మిమ్మెదిరించి పోరాడిరి. అట్లే అమోరీయులు, పెరిస్సీయులు, కనానీయులు, హిత్తీయులు, గిర్గాషీయులు, హివ్వీయులు, యెబూసీయులు మీతో పోరాడిరిగాని నేను వారి నందరిని మీ చేతికి అప్పగించితిని.

12. నేను మీకు ముందుగా కందిరీగలను పంపగా అవి అమోరీయుల రాజులు ఇద్దరిని మీ ఎదుటినుండి తరిమివేసెను. ఆ విజయము మీరు కత్తివలన గాని, వింటివలన గాని సాధించినది కాదు.

13. మీరు సేద్యముచేయని సాగునేలను నేను మీకిచ్చితిని. మీరు కట్టుకొనని పట్టణములను మీకు నివాసములు గావించితిని. మీరు నాటని ద్రాక్షతోటలనుండి, ఓలివు తోటలనుండి నేడు మీరు పండ్లను భుజించుచున్నారు.' "

14. “కనుక ఇకమీదట యావేకు భయపడి ఆ ప్రభువును చిత్తశుద్ధితో కొలువుడు. యూఫ్రటీసు నదికి ఆవలివైపునను, ఐగుప్తులోను మీ పితరులు కొలిచిన అన్యదైవములను విడనాడి యావేను మాత్రమే పూజింపుడు.

15. కాని మీరు యావేను సేవింపనొల్ల నిచో మరియెవరిని సేవింపగోరుదురో, యూఫ్రటీసు నదికి ఆవల మీ పితరులు కొలచిన దేవతలను కొలిచెదరో, మీరిపుడు నివసించుచున్న అమోరీయుల దేశమున వారు పూజించు దైవములను కొలిచెదరో నేడే నిర్ణయించుకొనుడు. నేను, నా కుటుంబము మాత్రము యావేను ఆరాధింతుము” అనెను.

16. ఆ మాటలువిని యిస్రాయేలీయులు “ఎంత మాట! మేము యావేను విడనాడి అన్యదైవములను కొలుతుమా?

17. మమ్ము మా పితరులను దాస్య గృహమైన ఐగుప్తునుండి ఈవలకు కొనివచ్చినది యావే కాదా? మాకొరకై అద్భుతకార్యములను చేసినది ఆయనకాదా? మేము నడచిన త్రోవలందు, మేము ప్రయాణముచేసిన వివిధ జాతుల మండలములందు మమ్ము కాపాడినది ఆయనకాదా?

18. పైగా ప్రభువు ఆ జాతులనన్నిటిని, ఈదేశమును ఏలుచున్న అమోరీయులనుగూడ మా యెదుటి నుండి వెడల గొట్టెను. కనుక మేమును యావేను సేవింతుము. ఆయనయే మాకును దేవుడు" అని ప్రత్యుత్తరమిచ్చిరి.

19. యెహోషువ వారితో “మీరు యావేను సేవింప జాలరేమో! యావే పరమపవిత్రుడైన దేవుడు. ఆయన అసూయాపరుడైన దేవుడు. గనుక మీ తిరుగుబాటులను, మీ పాపములను సహింపజాలడు.

20. మీరు అన్యదైవములను ఆరాధింపగోరి యావేను పరిత్యజింతురేని, ఆయన మీమీద విరుచుకొనిపడి, మిమ్ము బాధించి తీరును. మీకింతవరకు ఉపకారము చేసినను ఇక మీదట మిమ్ము సర్వనాశనము చేయును” అని చెప్పెను.

21. వారు అతనితో “మేము యావేనే సేవింతుము, సందేహము వలదు” అనిరి.

22. అందుకు యెహోషువ "యావేనెన్నుకొని, ఆయననే పూజింతుమని మాట యిచ్చితిరనుటకు మీకు మీరే సాక్షులు” అనెను. వారు “అవును, మాకు మేమే సాక్షులము" అనిరి.

23. యెహోషువ అటులయినచో “మీరు అన్యదైవములను విడనాడుడు. యిస్రాయేలు దేవుడైన యావేకు మీ హృదయములు అర్పించు కొనుడు” అనెను.

24. వారతనితో "మేము మా దేవుడైన యావేనే నేవింపగోరితిమి. ఆయన ఆజ్ఞలను తప్పక పాటించెదము" అనిరి.

25. యెహోషువ నాడు ప్రజలతో నిబంధనచేసి షెకెమునొద్ద వారికొక శాసనము చేసెను.

26. అతడు తన అనుశాసనములను దేవుని ధర్మశాస్త్ర గ్రంథములో వ్రాయించి, పెద్దరాతిని తెప్పించి యావే పవిత్రస్థలములో ఉన్న సింధూరవృక్షము క్రింద దానిని నిలువ బెట్టి ప్రజలందరితో ఇట్లనెను.

27. “ఈ శిల మనకు సాక్ష్యముగా నుండును. యావే మనతో చెప్పిన మాటలన్నియు ఈ రాయి విన్నది. అది మీ మీద సాక్షిగా నుండును. మీరు యావేను నిరాకరింతురేని, ఇది మీకు వ్యతిరేకముగా సాక్ష్యము పలుకును" అని చెప్పెను.

28. అంతట యెహోషువ ప్రజలను వీడ్కొనగా, వారు తమతమ నివాసములకు వెడలిపోయిరి.

29. ఈ సన్నివేశములు జరిగిన తరువాత నూను కుమారుడును యావే సేవకుడైన యెహోషువ కన్నుమూసెను. అతడు నూటపది ఏండ్లు జీవించెను.

30. యెహోషువ వారసత్వముగా పొందిన తిమ్నాత్-సెరా యందే అతనిని ఖననము చేసిరి. ఆ పట్టణము గాషు కొండలకు ఉత్తరముగానున్న ఎప్రాయీము అరణ్యనీమయందున్నది.

31. యెహోషువ కాలమునను, అతని సమకాలికులు అయిఉండి యావే యిస్రాయేలీయులకు చేసిన అద్భుతకార్యములను కన్నులార చూచిన పెద్దల కాలమంతయు, యిస్రాయేలీయులు యావేను సేవించుచూ వచ్చిరి.

32. యిస్రాయేలీయులు ఐగుప్తునుండి కొని వచ్చిన యోసేపు అస్థికలను షెకెమునొద్ద ఒక పొలమున పాతిపెట్టిరి. షెకెము తండ్రియైన హామోరుని కుమారులనుండి యాకోబు ఆ పొలమును నూరు కాసులకు కొనెను. కనుక ఈ నేల యోసేపు కుమారులకు వారసత్వ భూమి అయ్యెను.

33. అంతట అహరోను కుమారుడైన ఎలియెజెరు కూడ చనిపోయెను. అతనిని అతని కుమారుడగు ఫీనెహాసుని పట్టణమైన గిబియా నందు పాతిపెట్టిరి. ఎఫ్రాయీము అరణ్యసీమయందు ఫీనెహాసునకు ఈ పట్టణము వారసత్వముగా లభించెను.