ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

ద్వితియోపదేశకాండము 24

1. ఒకడు ఒక స్త్రీని పెండ్లియాడెననుకొందము. అటు తరువాత ఆమె ఏదో అనుచితకార్యమునకు పూనుకొనినందున అతనికి నచ్చలేదు. కనుక అతడు ఆమెకు విడాకులపత్రము వ్రాసి, ఆమె చేతికిచ్చి ఇంటి నుండి పంపివేసెననుకొందము,

2. ఆమె అతనిని విడనాడి మరియొకనిని పెండ్లి చేసుకొనవచ్చును.

3. ఈ రెండవవానికి కూడ ఆమెమీద ఇష్టము పుట్టని యెడల అతడు కూడ విడాకుల పత్రమువ్రాసి, ఆమె చేతికిచ్చి ఆమెను పంపివేసెననుకొందము. లేదా అతడు గతించెననుకొందము.

4. అప్పుడు మొదట పెండ్లియాడినవాడు ఆమెను మరల స్వీకరింపరాదు. ఆమె అపవిత్రురాలైనది. అట్టి వివాహమును ప్రభువు అసహ్యించుకొనును. దానిద్వారా మీరు ప్రభువు మీకీయనున్న దేశమునకు పాపము సోకునట్లు చేయుదురు.

5. క్రొత్తగా పెండ్లియాడిన వానిని యుద్ధమునకు పిలువరాదు. అతనికి ఎట్టికార్యభారమును ఒప్పజెప్ప రాదు. తాను పెండ్లియాడిన వధువును సంతోషపెట్టుటకు ఒక ఏడాదిపాటు అతనిని ఇంటిపట్టునే ఉండనీయవలయును.

6. ఎవడును ఇతరుని తిరుగలిని కుదువ పెట్టించుకోరాదు. అటులచేసినచో అతని జీవనాధారమునే తాకట్టు పెట్టించుకొన్నట్లు.

7. ఎవడైన తోటి యిస్రాయేలీయుని అపహరించి బానిసగా వాడుకొనిన లేక బానిసగా అమ్మివేసిన ఆ దొంగను పట్టి చంపవలయును. అటులచేసి, ఆ చెడును మీ మధ్యనుండి పరిహరించుడు.

8. కుష్ఠరోగము విషయమున మీరు లేవీయ యాజకుల ఆదేశములన్నిటిని జాగ్రత్తగా పాటింపవలయును. నేను వారికి ఆదేశించిన విధులన్నిటిని అనుసరింపుడు.

9. మీరు ఐగుప్తునుండి వెడలివచ్చునపుడు ప్రభువు మిర్యామునకు ఏమిచేసెనో గుర్తుంచుకొనుడు.

10. నీవు ఇతరునిచేత ఏదైన తాకట్టు పెట్టించుకొని వానికి అప్పిచ్చినయెడల ఆ తాకట్టు పెట్టిన వస్తువును గుంజుకొని వచ్చుటకై వాని ఇంటిలోనికి వెళ్ళకూడదు.

11. నీవు వెలుపలనేయుండుము. అతడు ఆ వస్తువును నీ యొద్దకు కొనివచ్చును.

12. బాకీదారుడు పేదవాడైనచో అతడు నీకు తాకట్టుగా ఇచ్చిన అంగీని రాత్రి నీ ఇంట ఉంచుకోవలదు.

13. ప్రొద్దు గ్రుంకగానే వాని అంగీని వానికి ఇచ్చివేయుము. అతడు దానిని తొడుగుకొని నిద్రించును. నీకు కృతజ్ఞుడై యుండును. అది ప్రభువు దృష్టికి నీకు నీతియగును.

14. నిరుపేదయైన కూలివానిని, అతడు యిస్రాయేలీయుడైనను లేక మీ నగరములలో వసించు పరదేశీయుడైనను అణచివేయరాదు.

15. ప్రతిరోజు ప్రొద్దుగ్రుంకక మునుపే అతని కూలి అతనికి ఇచ్చి వేయుము. అతడు లేనివాడు కనుక ఆ కూలికొరకు కనిపెట్టుకొని యుండును. ఇట్లు చేయవేని అతడు ప్రభువునకు నీమీద మొర పెట్టుకొనును. అప్పుడు నీకు పాపము చుట్టుకొనును.

16. తండ్రులు చేసిన దోషములకు కుమారులకును, కుమారులు చేసిన దోషములకు తండ్రులకును మరణశిక్ష విధింపరాదు. ఎవరి దోషములకు వారినే చంపవలయును.

17. పరదేశులకును, అనాధలకును అన్యాయపు తీర్పు చెప్పరాదు. వితంతువు కట్టుబట్టను తాకట్టు పెట్టించుకోరాదు.

18. మీరు ఐగుప్తున బానిసలె యుండగా ప్రభువు మీకు దాస్యవిముక్తి కలిగించెనని గుర్తుంచుకొనుడు. కనుకనే మిమ్ము ఈ రీతిగ ఆఙ్ఞాపించుచున్నాను.

19. నీవు పొలమున కోతకోయించునపుడు ఒక పనను జారవిడుతువేని దాని కొరకు తిరిగివెళ్ళవలదు. పరదేశులు, అనాధలు, వితంతువులకొరకు దానిని వదలివేయుము. అప్పుడు ప్రభువు నీ కార్యములన్నిటిని దీవించును.

20. నీవు ఓలివుపండ్లను కోయునపుడు మరల రెండవసారికూడ కొమ్మలను గాలింపకుము. జారిపోయినపండ్లను పరదేశులకు, అనాధలకు, వితంతువులకు వదలివేయుము.

21. నీవు ద్రాక్షపండ్లు సేకరించునపుడు మరల రెండవమారు తోటను గాలింపవలదు. జారిపోయిన పండ్లను పరదేశులకు, అనాధలకు, వితంతువులకు వదలివేయుము.

22. మీరు ఐగుప్తులో బానిసలుగా ఉంటిరని మరువకుడు. కనుకనే మీకీయాజ్ఞ విధించితిని.

Copyright © 2025 Telugu Catholic Bible All Rights Reserved | Website Designed by HyderHub Web Services