ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

యెహోషువ 23

1. ప్రభువు చుట్టుపట్లనున్న శత్రువుల వలన యిస్రాయేలీయులకు ఏ బాధ లేకుండ చేసిన పిదప చాలకాలమునకు యెహోషువ యేండ్లు గడచి వృద్దుడయ్యెను.

2. అతడు యిస్రాయేలు ప్రజలను, వారి పెద్దలను, నాయకులను, న్యాయాధిపతులను, ముఖ్యులను పిలిపించి “నేను యేండ్లుచెల్లిన ముదుసలిని.

3. ఈ శత్రుజాతులన్నిటిని యావే ఎట్లు అణగదొక్కెనో మీరు కన్నులార చూచిరి. మీ దేవుడైన యావే స్వయముగా మీ పక్షమున యుద్ధము చేసెను.

4. నేను ఈ జాతులనన్నిటిని రూపుమాపి వారి భూములను మీ తెగలకు వారసత్వభూములుగా పంచియిచ్చితిని. అటు యోర్దానునకు, ఇటు పడమటి మహాసముద్రమునకు మధ్యనున్న జాతులనన్నిటిని రూపుమాపితిని.

5. మీ దేవుడైన యావే స్వయముగా వారిని తరిమివేసెను. ఆ ప్రభువు వారిని తరిమివేయగా మీరు వారి భూములను ఆక్రమించుకొంటిరి.

6. అందుకని మోషే ధర్మశాస్త్రమున వ్రాయబడిన నియమములన్నిటిని శ్రద్ధతో పాటింపుడు. మీరు ఆ నియమముల నుండి కుడికిగాని, ఎడమకుగాని తొలగిపోకుండ వాటిని దృఢసంకల్పముతో పాటింపుడు.

7. మీ చెంత జీవించుచున్న అన్యజాతులతో కలసి పోవలదు. వారిదేవతల పేరులను ఉచ్చరింపకుడు. వారి పేరు మీదుగా ప్రమాణము చేయకుడు. వారిని సేవింపకుడు. పూజింపకుడు.

8. ఇప్పటివరకు వలెనే ఇకమీదట గూడ మీ దేవుడైన యావేను అంటి పెట్టు కొనియుండుడు.

9. కనుకనే ప్రభువు మహాబలముగల పెద్దజాతులను మీ ఎదుటినుండి వెడలగొట్టెను. నేటివరకు మిమ్మెవడైన ఎదిరించి నిలిచెనా?

10. మీలో ఒక్కొక్కడు వారిలో వేయిమందిని పారద్రోలగలడు. ఏలయనగా, ప్రభువు వాగ్దానము చేసినట్లు స్వయముగా తానే మన పక్షమున పోరాడెను.

11. కనుక ప్రభువును పరిపూర్ణహృదయముతో సేవింపుడు.

12-13. కాని మీరు ఈ నియమములను పాటింపరేని, మీతో వసించు ఈ అన్యజాతీయులతో కలసిపోయెదరేని, వారితో వియ్యములు అందుకొని సఖ్యతసంబంధములు పెంపొందించుకొందురేని, ప్రభువు వారిని మీ చెంతనుండి వెడలగొట్టడు. పైగా వారు, మీరు చిక్కుకొను వలలుగాను, కూలిపోవు గోతులుగాను పరిణమింతురు. యావే మీకు ప్రసా దించిన ఈ మంచినేలనుండి మీరందరు అడపొడకాన రాకుండ పోవువరకు మిమ్ము మోదు కొరడాలుగాను, మీ కన్నులను బాధించు ముండ్లుగాను పరిణమింతురు.

14. నా మట్టుకు నేను జీవితయాత్ర చాలించుటకు సిద్ధముగానున్నాను. యావే మీకు మంచిని చేకూర్చెదనని చేసిన వాగ్దానములలో ఒక్కటియు తప్పిపోలేదని పూర్ణాత్మతోను, పూర్ణహృదయముతోను విశ్వసింపుడు, ఆ వాగ్దానములన్నియు నెరవేరినవి.

15. కాని యావే మీకు మంచిని చేకూర్చెదనని చేసిన వాగ్దానములన్నియు నెరవేరినట్లే, అతడు మీకు కీడు చేయుదునని పలికిన పలుకులును నెరవేరును. దేవుడు మీకిచ్చిన ఈ మంచినేల మీదినుండి మిమ్ము గెంటి వేయుటయు నిక్కము.

16. ప్రభువు మీతో చేసికొనిన నిబంధనను మీరు మీరెదరేని, అన్యదైవములను పూజింతురేని, అతని కోపము మీపై రగుల్కొనును. అపుడు ప్రభువు మీకిచ్చిన ఈ మంచినేల నుండి మీరును అడపొడ కానరాకుండ నాశనమైపోవుదురు.