ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

ద్వితియోపదేశకాండము 23

1. వృషణములు నలుగగొట్టబడిన వానిని లేక జననేంద్రియము కోయబడిన వానిని ప్రభువు ప్రజలలో చేరనీయరాదు.
2. అక్రమ కూడికవలన పుట్టినవానిని, వాని వంశమును ప్రభువు ప్రజలలో పది తరముల వరకుకూడ చేరనీయరాదు.
3. అమ్మోనీయులను, మోవాబీయులను వారి వంశజులను పదియవ తరమువరకు గూడ ప్రభువు ప్రజలలో చేరనీయరాదు.
4. మీరు ఐగుప్తునుండి వెడలివచ్చి నపుడు వారు మీకు అన్నపానీయములను ఇవ్వలేదు. ఇంకను వారు ఆరాముయందలి పేతోరు పట్టణ వాసియును బెయోరు కుమారుడునైన బిలామునకు సొమ్మిచ్చి మిమ్ము శపింపజూచిరి.
5. కాని ప్రభువు బిలాము మనవిని త్రోసిపుచ్చెను. అతడు మిమ్ము ప్రేమించెను గనుక బిలాము శాపమును దీవెనగా మార్చెను.
6. కనుక మీరు జీవించినంతకాలము పై జాతుల శ్రేయస్సును కాని అభివృద్ధినికాని కాంక్షింపవలదు.
7. మీరు ఎదోమీయులను ద్వేషింపరాదు. వారు మీకు బంధువులు. ఐగుప్తీయులనుకూడ ద్వేషింపరాదు. మీరు వారి దేశమున పరదేశులుగా బ్రతికిరి.
8. ఈ ప్రజల సంతానమును మూడవ తరమునుండి ప్రభువు ప్రజలలో చేరనీయవచ్చును.
9. మీరు యుద్ధ కాలమున శిబిరములలో వసించినపుడు ఆచారశుద్దిని పాటింపుడు.
10. మీలో ఎవనికైన రాత్రి సమయమున అప్రయత్నముగ రేతఃస్థలనము కలిగెనేని అతడు శిబిరమునుండి వెలు పలికి వెళ్ళిపోయి బయటనే ఉండవలయును.
11. సాయంకాలమున స్నానము చేసి సంధ్యాసమయమున మరల పాళెమునకు రావలయును. .
12. మీరు పాళెమువెలుపల మరుగుదొడ్డిని ఏర్పాటు చేసికోవలెను.
13. మీ పనిముట్టులలో ఒక కొయ్యనుగూడ ఉంచుకొనుడు. మీరు బహిర్భూమికి వెళ్ళునపుడు ఆ కొయ్యగూడ కొనిపొండు. దానితో గోతిని త్రవ్వి వెనుకకు తిరిగి మలమును పూడ్చి వేయుడు.
14. మీ ప్రభువైన దేవుడు మిమ్ము కాపాడు టకును శత్రువులను మీకు పట్టియిచ్చుటకును శిబిరమున సంచరించుచుండును. కనుక మీ శిబిరము శుద్ధముగా నుండవలయును. మీ విడిదిపట్టు అశుభ్ర ముగా నుండెనేని ఆయన మిమ్ము విడనాడి వెడలి పోవును.
15. ఎవడైన దాసుడు తన యజమానుని నుండి పారిపోయివచ్చి మీ చెంత తలదాచుకొనినచో మీరు అతనిని యజమానునికి పట్టి ఇవ్వరాదు.
16. అతడు మిమధ్య తనకిష్టము వచ్చిన నగరమున వసించును. మీరు అతనిని బాధింపరాదు.
17. యిస్రాయేలు స్త్రీలు పడుపుకత్తెలుగా వ్యవహరింపకూడదు. అట్లే యిస్రాయేలు పురుషులను గూడ వ్యభిచారమునకు వినియోగింపరాదు.
18. ఇట్టి స్త్రీ పురుషులు తాము ఆర్జించిన సొమ్మును దేవాలయమున మ్రొక్కుబడి తీర్చుకొనునపుడు కానుకగా సమ ర్పింపరాదు. ఇట్టి వృత్తిని అవలంబించువారిని ప్రభువు అసహ్యించుకొనును.
19. మీరు తోటి యిస్రాయేలీయులకు డబ్బుగాని, ఆహారపదార్ధములుగాని మరియేదైన వస్తువును గాని అరువిచ్చినచో వారినుండి వడ్డీ పుచ్చుకొనరాదు.
20. మీరు అన్యులకు అప్పులిచ్చినచో వడ్డీ తీసికొనవచ్చును గాని, స్వజాతీయులకు ఇచ్చినపుడు అటుల చేయరాదు. ఈ నియమమును పాటింతురేని మీరు స్వాధీనము చేసికొనబోవు నేలమీద ప్రభువు మీ కార్యములన్నిటిని దీవించును.
21. మీరు దేవునికి ఏదైన సమర్పింతుమని మ్రొక్కుకొన్నచో ఆ బాధ్యతను వెంటనే తీర్చుకొనుడు. ప్రభువు మీరు ఆ సొమ్మును చెల్లింపవలయుననియే కోరుకొనును. కనుక మ్రొక్కుబడులను తీర్చకుండుట పాపము.
22. అసలు మ్రొక్కుబడియే చేసికొననిచో దోషమేమియులేదు.
23. కాని నోటితో పలికిన మాటను చెల్లించుకోవలయునుగదా! కనుక మీరు స్వేచ్ఛాపూర్వకముగా ప్రభువుకిత్తుమనిన దానిని ఈయక తప్పదు.
24. మీరు మీ పొరుగువాని ద్రాక్షతోటలోని బాటన నడుచునపుడు మీ ఇష్టము వచ్చినన్ని ద్రాక్షపండ్లు కోసికొని తినవచ్చును. కాని వానిని బుట్టలో నింపుకొని వెళ్ళరాదు.
25. మీరు మీ పొరుగు వాని పొలమున నడుచునపుడు వెన్నులు త్రెంచుకొని తినవచ్చును. కాని కొడవలితో పైరు కోసికొనిపోరాదు.