ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

యెహోషువ 22

1-2. అంతట యెహోషువ రూబేనీయులను, గాదీయులను, మనష్షే అర్ధతెగవారిని పిలిపించి "యావే సేవకుడు మోషే మిమ్మాజ్ఞాపించినదెల్ల పాటించితిరి.

3. మనము ఈ నేలను ఆక్రమించుకొనుటకు ఇంతకాలము పట్టినను, ఇన్నాళ్ళు మీరు మీ సోదరులను విడనాడి వెళ్ళిపోలేదు. మీ దేవుడైన యావే ఆజ్ఞలను తు.చ. తప్పకుండ అనుసరించిరి.

4. యావే మాట యిచ్చినట్లే మీ సోదరులకిపుడు విశ్రాంతి లభించినది. కనుక ఇక మీరు మీ నివాసములకు వెడలిపోవచ్చును. యావే సేవకుడగు మోషే యోర్దానునకు ఆవలివైపున మీకిచ్చిన భూమికి వెడలిపొండు.

5. కాని యావే సేవకుడగు మోషే యిచ్చిన ఆజ్ఞలను మాత్రము శ్రద్ధతో పాటింపుడు. ప్రభువు మార్గములలో నడువుడు. ఆయన ఆజ్ఞలు పాటింపుడు. ఆయనకు అంటిపెట్టుకొని యుండుడు. నిండుమనసుతో, పూర్ణాత్మతో ఆ ప్రభువును సేవింపుడు” అని చెప్పెను.

6. అట్లు యెహోషువ తూర్పు తెగల వారిని దీవించి పంపివేయగా, వారు తమతమ నివాసములకు వెడలిపోయిరి.

7. మోషే మనష్షే అర్ధతెగవారికి, బాషాను మండలమున ఒక భాగమునిచ్చెను. మిగిలిన అర్ధ తెగ వారికి యోర్దానునకు పడమట, ఇతర యిస్రాయేలీయుల భూములదగ్గరే భాగమునిచ్చెను.

8. ఆ ప్రజలు తమతమ నివాసములకు వెడలి పోవు చుండగా యెహోషువ వారిని దీవించి “మీరు సిరి సంపదలతో తిరిగిపోవుచున్నారు. గొడ్డుగోదలతో, వెండిబంగారములతో, ఇనుము, కంచులతో, చాల దుస్తులతో మరలిపోవుచున్నారు. ఈ కొల్లసొమ్మును మీరును, మీ సహోదరులును కలసి పంచుకొనుడు” అని చెప్పెను.

9. రూబేనీయులు, గాదీయులు, మనష్షే అర్ధ తెగవారు వారివారి నివాసములకు వెడలిపోయిరి. వారు యిస్రాయేలీయులను కనాను మండలము నందలి షిలో వద్ద వదలివేసి గిలాదు మండలమునకు వెడలిపోయిరి. యావే మోషే ద్వారా ఇచ్చిన ఆజ్ఞ ప్రకారము ఆ భాగము వారిదే. అక్కడనే వారు స్థిరపడిరి.

10. కాని రూబేనీయులు, గాదీయులు, మనష్షే అర్ధ తెగవారు కనానీయుల దేశమున యోర్దాను చెంతనున్న రాళ్ళగుట్ట యొద్దకు వచ్చి అక్కడ ఒక పెద్దబలిపీఠమును నిర్మించిరి.

11. రూబేనీయులు, గాదీయులు, మనష్షే అర్ధతెగ వారు కనానుదేశములో రాళ్ళగుట్టవద్ద యోర్దాను నదీతీరమున యిస్రాయేలు వైపున ఒక బలిపీఠమును నిర్మించిరి అను వార్త యిస్రాయేలీయుల చెవినపడెను.

12. ఆ విషయము తెలియగనే యిస్రాయేలీయులందరు షిలోవద్ద ప్రోగై వారి మీదికి దండెత్తి వెడలుటకు సంసిద్ధులైరి.

13. యిస్రాయేలీయులు యాజకుడైన ఎలియెజెరు కుమారుడైన ఫీనెహాసును తూర్పు తెగల వారి వద్దకు పంపిరి.

14. ఒక్కొక్క తెగనుండి ఒక్కొక్క నాయకుని చొప్పున పది తెగలనుండి పదిమంది నాయకుల నెన్నుకొని వారిని కూడ ఫీనెహాసుతో పంపిరి.

15-16. వారు పోయి గిలాదుమండలములోని రూబేనీయులను, గాదీయులను, మనష్షే అర్ధతెగ వారిని కలసికొని “యావే సమాజము మీతో చెప్పుడని పలికిన మాటలివి: మీరు యిస్రాయేలు దేవునకు ద్రోహము తలపెట్టనేల? మీకు మీరే ఈ పీఠమును నిర్మించుకొని యావే మార్గమునుండి వైదొలగితిరేల? ఇది యావే మీద తిరుగుబాటుచేయుట కాదా?

17. పేయోరు వద్ద మనము చేసిన పాపమునకు ప్రభువు మనలను అంటురోగములతో పీడింపలేదా? ఆ పీడ మనలనింకను వదలనూలేదు. అది చాలదని ఈ దుష్కార్యము కూడ చేయవలయునా?

18. మీరు నేడు యావేకు ఎదురు తిరిగి అతనిననుసరించుటకు నిరాకరించిరి. రేపతడు యిస్రాయేలు సమాజము మొత్తము మీద మండిపడకుండునా?

19. మీరు వసించు నేల అపవిత్రమైనది అనుకొందురేని ప్రభు మందసమున్న యావే మండలమునకొచ్చి మాతో పాటు భాగముపొందుడు. కాని యావే మీద తిరుగబడవద్దు. యావే బలిపీఠమునకు వ్యతిరేకముగా మరియొక బలిపీఠము నిర్మించి మీ తిరుగుబాటులో మమ్మునుకూడా భాగస్వాములను చేయవలదు.

20. సేరా కుమారుడు ఆకాను ప్రతిష్టితములైన వాని విషయములో తిరుగబడినపుడు, ఆ దుష్కార్యమును అతడొక్కడే చేసినను దేవుని ఉగ్రత యిస్రాయేలు సమాజమునెల్ల పీడింపలేదా? ఆ పాపము బలిగొనినది అతని యొక్కని ప్రాణములనే కాదుగదా?" అనిరి.

21-22. అపుడు రూబేనీయులు, గాదీయులు, మనష్షే అర్ధతెగవారు యిస్రాయేలు పెద్దలతో "మా సంగతి ప్రభువు, దేవాధిదేవుడైన యావేకు తెలియును. యిస్రాయేలీయులైన మీరును తెలిసికొందురుగాక! మేము ద్రోహమునుగాని, తిరుగుబాటునుగాని తలపెట్టితిమేని నేడు యావే మమ్ము కాపాడకుండును గాక!

23. మేము యావే మార్గమునుండి వైదొలగి ఈ పీఠము మీద దహనబలులు, సమాధానబలులు, సమర్పణ బలులు, అర్పింపగోరియే దానిని నిర్మించి నచో ప్రభువు మమ్ము శిక్షించునుగాక!

24. రేపు మీ సంతతివారు మా సంతతివారితో యిస్రాయేలు దేవుడైన యావేతో మీకేమి సంబంధము కలదని వాదింపవచ్చునని భయపడి ఈ పీఠమును నిర్మించితిమి. 

25. ప్రభువు రూబేను, గాదు తెగలవారికి మాకు మధ్య యోర్దానునే హద్దుగా నియమించెననియు, వారికి యావే ఆరాధనలో భాగము లేదనియు మీవారు మావారితో అనవచ్చుగదా! ఈ విధముగా యావేను ఆరాధింపనీయకుండ మీ సంతతివారు మా సంతతి వారికి అడ్డుపడ వచ్చును.

26. కనుక మాలో మేము కలియబలుకుకొని మనము ఒక పీఠము నిర్మింతము. అది బలులను, దహనబలులను సమర్పించుటకు కాదుగాని, వారికిని మనకును, వారి సంతతికిని, మనసంతతికిని సాక్ష్యముగా నిలువగలదు అని అనుకొంటిమి.

27. మేమును దహనబలులతోను, సమర్పణబలులతో, సమాధానబలులతో యావేను కొలుతుమనుటకు ఈ పీఠమే గురుతు. దీనినిబట్టి రేపు మీ సంతతివారు మా సంతతి వారిని చూచి మీకు యావే ఆరాధనలో భాగములేదని చెప్పజాలరుగదా!

28. ఇకమీదట వారు మాతోగాని, మా తరముల వారితో గాని ఎప్పుడైనా అట్టి మాటలాడుదురేని, మేము “ఈ పీఠము యొక్క ఆకారమును చూడుడు. దహనబలులు, సమర్పణబలులు అర్పించుటకుకాదు గాని మీకును, మాకును మధ్య సాక్షిగానుండుటకై మా పితరులు ఈ పీఠమును నిర్మించిరి” అని చెప్పుదమని అనుకొంటిమి.

29. యావేను ఎదిరింపవలయునని గాని అతని ఊడిగము మానుకోవలయుననిగాని, మేము ఈ పీఠము కట్టలేదు. దాని మీద దహనబలులు, సమర్పణబలులు, సమాధానబలులు, సమర్పింపవలె నను కోరికయు మాకు లేదు. యావే మందసము ఎదుటనున్న బలిపీఠముతో పోటీ పడవలెననియు మా తలంపుకాదు” అని చెప్పిరి.

30. యాజకుడగు ఫీనెహాసు, అతనివెంట వచ్చిన యిస్రాయేలు నాయకులగు సమాజపు పెద్దలు గాదు, రూబేను, మనష్షే అర్ధ తెగలవారు పలికిన పలుకులువిని సంతుష్టులైరి.

31. అంతట యాజకుడగు ఎలియెజెరు కుమారుడైన ఫీనెహాసు, రూబేను, గాదు, మనష్షే అర్ధ తెగలవారిని చూచి “మీరు ప్రభువునకు ద్రోహము తలపెట్టలేదు కనుక అతడు మనకు తోడైయున్నాడనియే మా నమ్మకము. మీరు యిస్రాయేలు ప్రజను ప్రభు శిక్షనుండి కాపాడితిరి” అనెను.

32. అంతట యాజకుడగు ఎలియెజెరు కుమారుడైన ఫీనెహాసు, ప్రజానాయకులు రూబేనీయులు, గాదీయులను వీడ్కోలునిచ్చి, గిలాదునుండి పయనమై కనానునందలి యిస్రాయేలు మండలము చేరి జరిగిన దంతయు తమవారికి విన్పించిరి.

33. ఆ వార్తలకు సంతసించి యిస్రాయేలీయులు దేవునికి వందనములర్పించిరి. వారు తమ సోదరులమీదికి దండెత్తి పోవుటకు గాని రూబేను, గాదు తెగలవారు స్థిరపడిన మండలమును నాశనముచేయుటకుగాని పూనుకొనలేదు.

34. రూబేనీయులు, గాదీయులు “ఈ పీఠము 'యావేదేవుడు' అనుటకు సాక్ష్యముగా ఉండును” అనుకొని, దానికి 'సాక్ష్యము' అని పేరిడిరి.