ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

ద్వితియోపదేశకాండము 22

1. నీ పొరుగువాని ఎద్దుకాని, గొఱ్ఱెకాని దారి తప్పుటను చూచినపుడు నీవు ఉదాసీనముగా ఉండవలదు. దానిని యజమానుని ఇంటికి తోలుకొని పొమ్ము.

2. అతడు దూరమున వసించుచున్నచో, లేక అసలు ఆ పశువెవరిదో నీకు తెలియనిచో దానిని నీ ఇంటికి తోలుకొనిపొమ్ము. యజమానుడు వెదుకుచు వచ్చి తోలుకొనిపోవువరకు అది నీ ఇంటనే యుండును.

3. పొరుగువాడు పోగొట్టుకొనిన గాడిదగాని, పై వస్త్రముగాని, లేక మరియేదైనా వస్తువుగాని నీ కంటబడినచో పై నియమమునే పాటింపుము.

4. పొరుగువాని ఎద్దుగాని, గాడిదగాని త్రోవలో కూలబడినచో ఉదాసీనముగా వెళ్ళిపోవలదు. అతనికి సాయపడి ఆ పశువును పైకిలేపుము.

5. స్త్రీ పురుష వస్త్రములనుగాని, పురుషుడు స్త్రీ వస్త్రములనుగాని ధరింపరాదు. ఇట్టిపనులు చేయు వారిని దేవుడైన ప్రభువు అసహ్యించుకొనును.

6. చెట్టుమీదనో, నేలమీదనో నీకు పక్షిగూడు కనిపించినదనుకొనుము. తల్లిపక్షి గ్రుడ్లమీదనో, పిల్లల మీదనో కూర్చుండియున్నది.

7. అప్పుడు నీవు తల్లి పక్షిని పట్టుకొనిపోరాదు. కావలసినచో పిల్లలను తీసికొనిపోయి తల్లిని తప్పక వదలివేయుము. అట్లు చేయుదువేని నీవు చిరకాలము క్షేమముగా జీవింతువు.

8. నీవు క్రొత్త ఇల్లు కట్టినపుడు దానిమీద పిట్టగోడ కూడ కట్టింపవలయును. అప్పుడు ఇంటిమీది నుండి ఎవరైన కాలుజారి క్రిందబడి చనిపోయినచో నీవు బాధ్యుడవుకావు.

9. మీ ద్రాక్షతోటలో వివిధమైన విత్తనములు విత్తరాదు. అట్లు చేయుదురేని ఆ తోటనుండి వచ్చు రాబడి యంతయు దైవార్పణకు అపవిత్రమగును.

10. ఎద్దును, గాడిదను జతచేసి పొలము దున్నకుడు.

11. దీన్నిబట్టలను, నూలుబట్టలను కలిపి కుట్టిన దుస్తులు ధరింపకుడు.

12. మీరు కప్పుకొను పైవస్త్రపు నాలుగు మూలల యందు నాలుగుకుచ్చులు అమర్చుకొనుడు.

13. ఒకడు ఒక యువతిని పెండ్లి చేసుకొని ఆమెను కూడిన పిదప ఆమెను వదలి వేయుననుకొందము.

14. ఆ యువతి శీలవతికాదని, తానామెను కూడినపుడు ఆమె కన్యగా కనిపింపలేదని నేరము మోపెననుకొందము.

15. అప్పుడు ఆ యువతి తల్లి దండ్రులు ఆమె కన్యత్వమును నిరూపించు ఆధారమును పురద్వారము చెంతప్రోగైన పెద్దల యొద్దకు కొనిరావలయును.

16. యువతి తండ్రి ఆ పెద్దలతో “నా కుమార్తెను ఇతనికిచ్చి పెండ్లి చేసితిని. కాని ఇతనికి ఈమెమీద మోజులేదు.

17. నా కుమార్తె శీలవతి కాదనియు, కన్యకాదనియు ఇతడు నేరము మోపెను. కాని ఆమె కన్య అనుటకు ఆధారమిదియే” అని చెప్పి పెద్దలయెదుటనే వధూవరుల శయన వస్త్రమును నేలమీద పరపవలెను.

18. అప్పుడు పెద్దలు ఆ యువకుని కొరడాతో శిక్షింపవలయును.

19. అతనికి నూరువెండినాణెములు అపరాధము విధించి ఆ సొమ్మును యువతి తండ్రికి ఇప్పింపవలయును. యిస్రాయేలు కన్యను అవమానపరచినందులకు ఆ యువకునికి శిక్ష ఇది. ఆ మీదట ఆమె అతనికి భార్యగనే ఉండును. ఇక అతడు ఆమెకు విడాకు లిచ్చుటకు వీలుపడదు.

20. కాని అతడు మోపిన నేరము యథార్థమే అనుకొనుడు. ఆ యువతి కన్యత్వమును నిరూపింప జాలరు అనుకొనుడు.

21. అప్పుడామెను పుట్టినింటి ముంగిటియొద్దకు కొనిపోయి ఆమె ఊరి పౌరులు ఆమెను రాళ్ళతో కొట్టి చంపవలయును. ఆమె తన తండ్రి ఇంటనున్నపుడు వ్యభిచరించి యిస్రాయేలీయు లకు అపకీర్తి తెచ్చెను. ఈ రీతిగా మీరు ఈ చెడును మీ మధ్యనుండి తొలగించుకోవలయును.

22. ఎవడైన వివాహితయైన స్త్రీని కూడుచు పట్టుబడెనేని, అతనిని ఆమెను ఇద్దరిని చంపివేయవలయును. ఈ రీతిగా ఆ చెడును యిస్రాయేలీయుల నుండి వదిలించుకొనుడు.

23. ఎవడైన మరియొకనికి ప్రధానము చేయ బడిన యువతిని నగరమునందు కూడినట్లు తెలియవచ్చినదనుకొనుడు.

24. వారిరువురిని నగరద్వారము చెంతకు కొనిపోయి రాళ్ళతో కొట్టిచంపుడు. నగరము నందే ఉండి సహాయము కొరకు కేకవేయలేదు కనుక ఆ యువతియు, పొరుగువానికి ప్రధానము చేయబడిన బాలికను చెరిచెను గనుక ఆ పురుషుడును చంపదగినవారు. ఈ రీతిగా మీరు ఈ చెడును మీ మధ్యనుండి వదిలించుకొనుడు.

25. కాని, ఎవడైన పొరుగువానికి ప్రధానము చేయబడిన యువతిని పొలమున మానభంగము చేసెననుకొనుడు. అప్పుడు ఆ పురుషుని మాత్రమే చంపివేయవలయును.

26. ఆ యువతిని శిక్షింపరాదు. చంపదగిన నేరమేమియు ఆమె చేయలేదు. ఈ సంఘటన, ఒకడు తోటివాని మీదపడి వానిని చంపుటవంటిది.

27. ఆమె పొలమున వానికి చిక్కినది. అచట ఆమె కేకవేసినను సాయపడుటకు ఎవరును వచ్చి యుండకపోవచ్చును.

28. ఎవడేని ప్రధానము చేయబడని కన్యను బలవంతముగా కూడుచు పట్టుబడెననుకొనుడు.

29. ఆ యువతి తండ్రికి ఏబది వెండినాణెములు శుల్కముగా చెల్లింపవలయును. తాను ఆయువతిని కూడెను గనుక అమె అతనికి భార్యయగును. ఇక అతడామెకు విడాకులిచ్చుటకు వీలుపడదు.

30. ఎవ్వడును తన తండ్రి భార్యను, తండ్రికి వరసయైనవారిని పరిగ్రహింపకూడదు. అతడు తన తండ్రి హక్కును భంగపరచుచున్నాడు.