1-2. ఆ పిమ్మట యాజకుడైన ఎలియెజెరు, నూను కుమారుడగు యెహోషువ, యిస్రాయేలు ప్రజల పెద్దలు కనాను మండలములోని షిలో నగరమున నుండగా లేవీయుల పెద్దలు వారలయొద్దకు వచ్చి “మేము నివసించుటకు పట్టణములను, మా గొడ్లను మేపుకొనుటకు గడ్డి బీళ్ళను ఈయవలెనని యావే మోషే ద్వారా ఆజ్ఞాపించెను గదా?” అని అడిగిరి.
3. కనుక యావే ఆజ్ఞ చొప్పున యిస్రాయేలీయులు తమతమ వారసత్వభూముల నుండి ఆయా పట్టణములను, వాని నంటియున్న గడ్డి బీళ్ళను లేవీయులకు ఇచ్చివేసిరి.
4. లేవీయులలో ఒక వంశమువారగు కోహతీయులకు చీట్ల చొప్పున మొదట వంతులువేసిరి. అటుల అహరోను పుత్రులైన లేవీయులకు యూదా, షిమ్యోను, బెన్యామీను తెగలవారి నుండి పదుమూడు పట్టణములు వచ్చెను.
5. మిగిలిన కోహతీయులకు ఎఫ్రాయీము, దాను తెగల నుండి మనష్షే అర్థతెగ నుండి కుటుంబముల వరుసన పది పట్టణములు లభించెను.
6. యిస్సాఖారు, ఆషేరు, నఫ్తాలి తెగలనుండి, బాషానునందలి మనష్షే అర్ధతెగనుండి గెర్షోనీయులకు కుటుంబముల వరుసన పదుమూడు పట్టణములు వచ్చెను.
7. రూబేను, గాదు, సెబూలూను తెగల వారినుండి మెరారీయులకు కుటుంబముల వరుసన పండ్రెండు పట్టణములు వచ్చెను.
8. యావే మోషే ద్వారా ఆజ్ఞాపించినట్లే యిస్రాయేలీయులు ఈ పట్టణములను, వానినంటియున్న గడ్డి బీళ్ళను లేవీయులకు ఇచ్చివేసిరి.
9. యూదా షిమ్యోను తెగల వారి నుండి ఈ క్రింది నగరములు లభించెను.
10. లేవీయులైన కోహాతు వంశము వారిలో అహరోను పుత్రులకు జ్యేష్ఠభాగము లభించెను. వారి భాగమిది.
11. నేటి యూదా పర్వతసీమలోని హెబ్రోను అనబడు అనాకీయుల ముఖ్యనగరము కిర్యతార్బాను, దాని చుట్టుపట్ల గల గడ్డి బీళ్ళను యిస్రాయేలీయులు వారికిచ్చివేసిరి.
12. ఈ పట్టణమునకు చెందిన పొలములు పల్లెలు మాత్రము యెఫున్నె కుమారుడగు కాలెబునకు ఇచ్చిరి.
13-16. యాజకుడు అహరోను పుత్రులకు హెబ్రోనును, దానిని అంటియున్న గడ్డి బిళ్ళను ఇచ్చిరి. ఈ పట్టణము పొరుగువారిని చంపిన హంతకులకు ఆశ్రయపట్టణము కూడ. ఇంకను లిబ్నా, యాత్తీరు, ఎష్టేమోవా, హోలోను, దెబీరు, ఆయిను, యుత్తా, బేత్-షెమేషు అను పట్టణములను, వాని గడ్డి బీళ్ళను ఇచ్చివేసిరి. ఈ రీతిగా పై రెండుతెగల వారు తొమ్మిది పట్టణములనిచ్చిరి.
17-18. బెన్యామీను తెగ నుండి గిబ్యోను, గేబా, అనాతోతు, అల్మోను పట్టణములు వాని గడ్డి బీళ్ళు లభించెను. ఇవి నాలుగు పట్టణములు.
19. ఈ విధముగా అహరోను పుత్రులును, యాజకులునగు లేవీయులకు లభించినవి మొత్తము పదుమూడు పట్టణములు, వాని గడ్డి బీళ్ళు.
20. మిగిలిన కోహాతువంశము వారికి అట్లే వంతులువేయగా ఎఫ్రాయీము తెగ వారి పట్టణములు వచ్చెను.
21-22. ఎఫ్రాయీము అరణ్యసీమయందలి ఆశ్రయ పట్టణమగు షెకెము మరియు గేసేరు, కిబ్షాయీము, బేత్-హోరోను పట్టణములు, వాని గడ్డి బీళ్ళు వారికి లభించెను. ఇవి నాలుగు పట్టణములు.
23-25. దాను తెగనుండి ఎల్తేకె, గెబ్బోతోను, అయ్యాలోను, గాత్-రిమ్మోను అను నాలుగు పట్టణములు వాని గడ్డి బీళ్ళు వచ్చెను. మనష్షే అర్థతెగనుండి తానాకు, ఈబ్లేయాము అను రెండు పట్టణములు, వాని గడ్డి బీళ్ళు వచ్చెను.
26. ఈ రీతిగా మిగిలిన కోహాతు వంశము వారికి లభించిన పట్టణములు మొత్తము పది.
27. లేవీయులలో మరియొక వంశపు వారగు గెర్షోనీయులకు బాషాను నందలి ఆశ్రయపట్టణమగు గోలాను, బెయేస్తెరా వాని గడ్డి బీళ్ళు లభించెను. ఇవి రెండును మనష్షే అర్ధతెగ వారి వారసత్వములోనివి.
28-29. యిస్సాఖారు తెగనుండి కీషియోను, దాబెరతు, యార్మూతు, ఎన్గన్నీము అను నాలుగు పట్టణములు వాని గడ్డి బీళ్ళు లభించెను.
30-31. ఆషేరు తెగనుండి మిషాలు, అబ్దోను, హెల్కాత్తు, రెహోబు అను నాలుగు పట్టణములు, వాని గడ్డిబీళ్ళు లభించెను.
32. నఫ్తాలి తెగనుండి గలిలీలోని ఆశ్రయ పట్టణమైన కేదేషు, హమ్మోతుదొరు, కార్తను అను మూడుపట్టణములు, వాని గడ్డి బీళ్ళు లభించెను.
33. ఆయా కుటుంబముల సంఖ్య చొప్పున గెర్షోనీయులకు లభించిన పట్టణములు వాని గడ్డి బీళ్ళు మొత్తము పదుమూడు.
34. లేవీయులలో మిగిలినవారగు మెరారీయుల వంశములకు సెబూలూను తెగ వారి వారసత్వభూమి నుండి యోక్నెయాము, కర్తా, దిమ్నా, నహలాలు అను నాలుగు పట్టణములు, వాని గడ్డి బీళ్ళు లభించెను.
35-37. యోర్దానునకు ఆవలనున్న రూబేను తెగవారి వారసత్వమునుండి పీఠభూములలోని అరణ్యసీమ యందలి ఆశ్రయపట్టణము బేసేరు, యాహాసు, కెడెమోతు, మెఫాత్తు అను నాలుగుపట్టణములు, వాని గడ్డి బీళ్ళు లభించెను.
38-39. గాదు తెగవారి నుండి ఆశ్రయ పట్టణమగు రామోత్-గిలాదు, మహ్నయీము, హెష్బోను, యాసేరు అను నాలుగు పట్టణములు, వాని గడ్డి బీళ్ళు లభించెను.
40. లేవీయుల తెగలలో మిగిలినవారగు మెరారీయులకు కుటుంబముల సంఖ్య చొప్పున లభించిన పట్టణములు మొత్తము పండ్రెండు.
41. ఈ రీతిగా యిస్రాయేలు దేశమున లేవీయులకు మొత్తము నలువది ఎనిమిది పట్టణములు, వాని గడ్డి బీళ్ళు లభించెను.
42. ఈ పట్టణములు ఒక్కొక్కటి దాని చుట్టుపట్లగల గడ్డి బీళ్ళతో కలిపి లేవీయులకు లభించెను.
43. ఈ రీతిగా యావే పితరులకు వాగ్దానము చేసిన నేల అంతటిని యిస్రాయేలీయులకు ఇచ్చి వేసెను. వారు ఆ నేలను స్వాధీనము చేసికొని, నివాసములు ఏర్పరచుకొనిరి.
44. యావే పితరులకు వాగ్దానము చేసినట్లే వారి సరిహద్దులన్నింట శాంతిని నెలకొల్పెను. యిప్రాయేలు శత్రువులలో ఒక్కడును వారిని ఎదిరించుటకు సాహసింపలేదు. శత్రువుల నందరిని ప్రభువు వారి వశము చేసెను.
45. యావే యిస్రాయేయులకు చేసిన వాగ్దానములలో ఒక్కటియు తప్పిపోలేదు. అన్నియు నెరవేరెను.