1. ప్రభువు మీకు ఈయనున్న దేశమునందలి పొలమున ఎచటనైనను, ఎవడైనను చంపబడి కనిపించే ననుకొనుడు. హంత ఎవరో మీకు తెలియని పక్షమున
2. అప్పుడు మీ పెద్దలు, న్యాయాధిపతులు వెళ్ళి ఆ శవము కనిపించినచోటికి, ఆ చుట్టుపట్లనున్న పట్టణములకు ఎంతదూరమో కొలిచి చూడవలయును.
3. అచటికి చేరువలోనున్న నగరమేదియోగూడ నిర్ణయింప వలయును. అంతట ఆ దగ్గరి పట్టణపు పెద్దలు ఇంకను కాడికి అలవరుపని ఆవు పెయ్యను ఒకదానిని ఎన్నుకోవలయును.
4. వారు ఆ పెయ్యను ఎప్పుడును వట్టిపోని లోయ దగ్గరకు తోలుకొనిపోయి అచట ఎన్నడును దున్ని విత్తనమువేయని తావున దాని మెడను విరుగదీయవలయును.
5. లేవీయ యాజకులును అచటికి వత్తురు. కలహములకు, దౌర్జన్యమునకు సంబంధించిన తగవులన్నిటిని పరిష్కరించునది వారే. ప్రభువు తనను సేవించుటకును, తన పేరు మీదుగా ప్రజలను దీవించుటకును వారినే ఎన్నుకొనెను.
6. ఆ దగ్గరి పట్టణపు పెద్దలు చచ్చిన పెయ్య మీద చేతులు కడుగుకోవలయును.
7. అటుపిమ్మట వారు “మా చేతులు ఈ రక్తమును చిందించలేదు. మా కన్నులు దీనిని చూడలేదు.
8. ప్రభూ! నీవు ఐగుప్తునుండి తోడ్కొనివచ్చిన ఈ యిస్రాయేలీయుల అపరాధమును మన్నింపుము. నిరపరాధులైన యిస్రాయేలీయుల వధకు మేము బాధ్యులము కాకుందుముగాక!” అని చెప్పవలయును. ఇట్లు చేయుదురేని హత్యాపరాధమునకు వారి నిమిత్తము ప్రాయశ్చిత్తము కలుగును.
9. మీరు ప్రభువుసమక్షమున ధర్మబద్దముగా జీవింప గోరుదురేని నిరపరాధుల వధను అరికట్టవలయును.
10. ప్రభువు యుద్ధమునందు శత్రువులను మీ చేతికి చిక్కింపగా మీరు వారిని బంధించిరనుకొనుడు.
11. ఆ బందీలలో ఒక రూపవతియైన వనిత కనిపింపగా నీవు ఆమెమీద మోజుపడి ఆమెను వివాహమాడకోరెదవనుకొనుము.
12. అప్పుడు ఆమెను నీ ఇంటికి కొనిపొమ్ము. ఆ వనిత క్షౌరము చేయించుకొని, వ్రేలిగోళ్ళు కత్తిరించుకొని
13. తన బందీబట్టలను మార్చుకొని నీ ఇంటనుండియే చనిపోయిన తల్లి దండ్రులకొరకు నెలరోజులపాటు ఆమెను శోకింపనిమ్ము. అటుపిమ్మట నీవామె వద్దకు పోయి ఆమెను పెండ్లియాడవచ్చును. ఆమె నీకు భార్య అగును.
14. కాని కొంతకాలము గడచిన పిదప నీకు ఆ వనిత ఇష్టముకాదేని ఆమెను స్వేచ్చగా వెళ్ళి పోనిమ్ము. కాని నీవామెను బానిసగా అమ్మి సొమ్ము చేసికోరాదు. నీవు ఆమెను అవమానించితివి కనుక, ఆమెను బానిసవలె చూడరాదు.
15. ఒకనికి ఇద్దరుభార్యలు ఉన్నారనుకొందము. అతనికి ఒకతెయనిన ఇష్టము, మరొక తెయనిన అయిష్టము. ఆ ఇద్దరికిని పుత్రులు కలిగిరనుకొందము. కాని జ్యేష్ఠకుమారుడు ఇష్టములేని భార్యకు పుట్టినవాడు అనుకొందము.
16. అతడు తన ఆస్తిని కుమారులకు పంచియిచ్చునపుడు నచ్చనిదాని కుమారుడైన జ్యేష్ఠునికి మారుగా నచ్చిన భార్య కుమారుని జ్యేష్ఠునిగా చేయరాదు.
17. తనకు ఇష్టముకాని భార్యకు పుట్టినవానినే జ్యేష్టునిగా అంగీకరించి వానికి తన ఆస్తిలో రెండు వంతులు పంచి ఈయవలయును. మొదట పుట్టిన ఆ పుత్రుడు తండ్రి యవ్వనబలారంభము కనుక జ్యేష్ఠత్వమునకు అర్హుడు అతడే.
18. ఒక తండ్రికి తలబిరుసుతనముతో తిరుగబడు కుమారుడు కలడనుకొందము. అతడు తల్లిదండ్రుల మాట వినడు. వారు తనను శిక్షించినను లొంగడు.
19. అప్పుడు తల్లిదండ్రులు వానిని పుర ద్వారమువద్ద కూర్చొను పెద్దలవద్దకు కొనిపోవలయును.
20. ఆ పెద్దలతో “మా కుమారుడు తలబిరుసు తనముతో తిరుగబడుచున్నాడు. మా మాట వినుట లేదు. వీడు తిండిబోతు, త్రాగుబోతు” అని చెప్పవలయును.
21. అప్పుడు ఆ ఊరి జనులు అతనిని రాళ్ళతో కొట్టి చంపవలయును. ఆ రీతిగా మీరు ఆ చెడును మీ మధ్యనుండి వదిలించుకోవలయును. యిస్రాయేలీయులందరు ఆ సంగతి విని భయపడుదురు.
22-23. మరణశిక్షకు తగిన పాపము చేసిన వానిని ఎవనినైనను ఉరితీసి మ్రానికి వ్రేలాడగట్టినపుడు, అతని శవమును రేయి మ్రానుమీద ఉండనీయరాదు. ఆ దినమే అతనిని తప్పక పాతి పెట్టవలయును. వ్రేలాడదీయబడినవాడు దేవునికి శాపగ్రస్థుడు. అట్టి వాని శవముతో ప్రభువు మీకీయనున్న దేశమును అమంగళము చేయరాదు.