ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

యెహోషువ 20

1-2. ఆ తదుపరి యావే యెహోషువతో “నీవు యిస్రాయేలీయులతో ఆశ్రయపట్టణములను ఎన్నుకొనుమని చెప్పుము. నేను ముందుగనే ఈ సంగతి మోషే ద్వారా తెలియజేసితిని.

3. తెలియకయే పొరపాటున ఎవరినైన చంపినచో, వారు ఈ పట్టణములలో తలదాచుకోవచ్చును. పగతీర్చుకోగోరిన వారినుండి ఈ నగరములు రక్షణ కల్పించును.

4. ఇతరులను చంపినవాడు ఈ పట్టణములలో శరణు పొందవచ్చును. అతడు మొదట నగరద్వారమువద్ద నిలిచి పెద్దలకు తన సంగతి తెలుపవలెను. వారతనిని నగరమునకు తోడ్కొనిపోయి, ఉండుటకు వసతినీయవలెను.

5. పగతీర్చుకోగోరిన హతుని తరుపు వారు హంతకుని వెన్నాడివత్తురేని మీరతనిని పట్టి ఈయరాదు. అతడు పగపట్టి చంపవలెనని తలంపకయే, అనుకోకుండ పొరుగువానిని చంపి వచ్చెనుగదా!

6. అట్లు పారివచ్చిన హంత నగర సమాజము తనకు తీర్పు చెప్పువరకును, తాను వచ్చినపుడు పదవిలో నున్న ప్రధానయాజకుడు మరణించు వరకును, ఆశ్రయ నగరముననే ఉండవలెను. అటు పిమ్మటగాని అతడు స్వీయనగరమునందలి తన ఇంటికి పయనమై పోరాదు” అని పలికెను,

7. కనుక నఫ్తాలి పర్వతసీమయందలి గలలీలోని కేదేషు, ఎఫ్రాయీము మన్నెములోని షెకెము, యూదా కొండ సీమలోని కిర్యతార్బా అనబడిన హెబ్రోను నగరములను ఆశ్రయపట్టణములుగా నిర్ణయించిరి.

8. యోర్దానునకు ఆవల యెరికోకు తూర్పు వైపుననున్న ఎడారి పీఠభూములలోని రూబేను తెగలో బేసేరును, గాదు తెగలో రామోత్-గిలాదును, మనష్షే తెగలో బాషాను మండలపు గోలానును ఆశ్రయపట్టణములుగా నిర్ణయించిరి.

9. యిస్రాయేలీయులుగాని, వారితో జీవించుచున్న అన్యదేశీయులు గాని ఎవరినైనను తెలియక పొరపాటున చంపినపుడు ఈ నగరములలో శరణు పొందవచ్చును. నగర సమాజముల నుండి తీర్పు పొందువరకు పగ తీర్చుకోగోరిన హతునివైపు వారి నుండి తప్పించుకోవచ్చును.