ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

ద్వితియోపదేశకాండము 20

1. మీరు యుద్ధమునకు పోయినపుడు శత్రు సైన్యమునందలి గుఱ్ఱములను, రథములను చూచిగాని లేక మీకంటే గొప్పదియగు విరోధిబల మును చూచిగాని భయపడకుడు. మిమ్ము ఐగుప్తునుండి తోడ్కొని వచ్చిన ప్రభువే మీకు బాసటయై ఉండును.

2. మీరు యుద్ధము ప్రారంభింపకముందు యాజకుడు ముందునకు వచ్చి మీ సైన్యమును ఇట్లు హెచ్చరింప వలయును:

3. 'యిస్రాయేలీయులారా వినుడు! మీరిపుడు శత్రువులతో తలపడి పోరాడనున్నారు. మీరు వారిని చూచి భయపడవలదు. ధైర్యము కోల్పోవలదు, కలవరపడవలదు.

4. ప్రభువు మీతో వెడలివచ్చి మీ తరపున పోరాడును. శత్రువులనుండి మిమ్మును రక్షించును.”

5. అటుపిమ్మట సైనికోద్యోగులు భటులను ఇట్లు హెచ్చరింతురు: , “క్రొత్తగా ఇల్లు కట్టి ఇంకను గృహప్రవేశము చేయనివాడు ఎవడైనా మీలోనున్నాడా? అతడు యుద్ధమున చనిపోయినయెడల మరియొకడు గృహప్రవేశము చేయును. కనుక అతడు ఇంటికి వెళ్ళిపోవచ్చును.

6. క్రొత్తగా ద్రాక్షతోటను నాటించి ఇంకను దాని ఫలములను అనుభవింపనివాడు ఎవడైనా మీలోనున్నాడా? అతడు యుద్ధమున చనిపోయినచో మరియొకడు ఆ ఫలములను అనుభవించును. కనుక అతడు ఇంటికి వెళ్ళిపోవచ్చును.

7. ప్రధానము జరిగిపోయి ఇంకను పెండ్లి ముగించుకొననివాడు , ఎవడైన మీలోనున్నాడా? అతడు యుద్ధమున చనిపోయినచో మరియొకడు ఆ వధువును పెండ్లియాడును. కనుక అతడు ఇంటికి వెళ్ళిపోవచ్చును.”

8. సైనికోద్యోగులు ఇంకను ఇట్లు హెచ్చరింతురు: “మీలో పిరికివాడు, గుండెదిటవు లేనివాడు ఎవడైన ఉన్నచో ఇంటికి వెళ్ళిపోవచ్చును. అతనిని చూచి తోటియోధులుకూడ ధైర్యము కోల్పోవుదురు.”

9. ఈ రీతిగా అధికారులు హెచ్చరించిన పిమ్మట సైనికదళములకు నాయకులను నియమింపవలయును.

10. మీరు ఏ నగరముమీదికైనను దండెత్తినపుడు మొదట ఆ పట్టణ ప్రజలు మీకు లొంగిపోయి ప్రాణములు కాపాడుకొనుటకు శాంతి ఒప్పందమునకు అవకాశము నిండు.

11. అలా వారు మీకు లోబడి నగరద్వారములు తెరతురేని, ఇక వారు మీకు పన్ను చెల్లించి బానిసలై వెట్టిచాకిరి చేయుదురు.

12. కాని ఆ ప్రజలు మీకు లొంగక పోరునకు తలపడుదురేని మీరు వారి నగరమును ముట్టడింపుడు.

13. ప్రభువు ఆ నగరమును మీ చేతికి చిక్కించును. మీరు అందలి మగ వారినెల్ల వధింపుడు.

14. కాని అచటి స్త్రీలను, పిల్లలను, మందలను, వస్తువులను కొల్లసొమ్మును మీరు స్వాధీనము చేసికోవచ్చును. ప్రభువు మీ చేతికి చిక్కించిన శత్రువుల కొల్లసొమ్మునెల్ల మీరు అనుభవింపవచ్చును.

15. మీ చుట్టుపట్ల ఉన్న జాతుల పట్టణ ములు గాక, మీకు చాల దూరముననున్న పట్టణము లను మాత్రమే ఈ రీతిగా పట్టుకొనుడు.

16. కాని ప్రభువు మీకు ఇవ్వనున్న దేశము నందలి వివిధజాతుల నగరములను మీరు స్వాధీనము చేసికొనినపుడు మాత్రము అచట శ్వాసగల దేనిని బ్రతుకనీయకూడదు.

17. ప్రభువు మిమ్ము ఆజ్ఞాపించి నట్లే హిత్తీయులు, అమోరీయులు, కనానీయులు, పెరిస్సీయులు, హివ్వీయులు, యెబూసీయులు మొదలగు వారినెల్ల నాశనము చేయుడు.

18. అప్పుడు వారు తమ దేవతలను ఆరాధించునపుడు చేయు జుగుప్సాకరమైన కార్యములను మీకు నేర్పింపక ఉందురు. మీరును ప్రభువునకు విరుద్ధముగా పాపము కట్టుకొనకుందురు.

19. మీరేదైన పట్టణము మీదికి దండెత్తినపుడు చాలకాలము వరకు దానిని ముట్టడింపవలసి వచ్చినచో అచటి పండ్ల చెట్లను గొడ్డలితో నరికివేయకుడు. వాని పండ్లను ఆరగింపుడు. ఆ చెట్లను మాత్రము నాశనము చేయకుడు. పొలములోని చెట్టును ముట్టడించుటకు అది నరుడాఏమి?

20. కాని పండ్ల చెట్లు కానివానిని మాత్రము మీరు నిరభ్యంతరముగా నరికి వేయవచ్చును. శత్రు పట్టణము లొంగువరకు వాటికొయ్యను ముట్టడికి వాడుకోవచ్చును.