1. కనుక యావే ఆజ్ఞాపించినట్లే మనమెల్లరము వెనుదిరిగి ఎడారిగుండ నడచి రెల్లు సముద్రమువైపు వెళ్ళితిమి. చాలనాళ్ళు సేయీరు మన్నెమున తిరుగాడితిమి.
2-3. అంతట ప్రభువు నాతో 'మీరు ఈ కొండలలో చాలనాళ్ళు గడిపిరి. ఇక ఉత్తర దిశకు పొండు.
4. ఈ ప్రజలతో నీవిట్లు చెప్పవలయును. మీరు మన దాయాదులగు ఏసావు వంశజులు నివసించు సెయీరు గుండ ప్రయాణము చేయవలయును. వారు మిమ్ముచూచి భయపడుదురు.
5. కాని మీరు వారిని రెచ్చగొట్టరాదు. నేను వారి నేలలో బెత్తెడైనను మీకీయను. సెయీరు మన్యమును పూర్వమే ఏసావు వంశజులకు ఇచ్చితిని.
6. ఆ దేశమున మీరు తినుతిండికి, త్రాగునీటికి వారికి సొమ్ము చెల్లింపుడు' అనెను.
7. మీరు చేయు కార్యములనెల్ల ప్రభువు దీవించెను. ఈ విశాలమైన ఎడారిగుండ పయనించు నపుడు అతడు మిమ్ము కాపాడెను. ఈ నలువదియేండ్లు ప్రభువు మీకు చేదోడువాదోడుగా నుండెను. అతని కృపవలన మీకు ఏమియు తక్కువ కాలేదు.
8. ఆ రీతిగా మనము సేయీరు దాటితిమి. ఏసోన్గ్‌బేరు, ఎలాతు మైదాన మార్గమునుండి మృత సముద్రమునకు పోవు మార్గమును వీడి మోవాబునకు పోవు త్రోవపట్టితిమి.
9. అప్పుడు ప్రభువు 'మీరు మోవాబు ప్రజలను రెచ్చగొట్టి యుద్ధమునకు ప్రేరేపింప వలదు. నేను ఆరు పట్టణమును పూర్వమే లోతు వంశజులకు ఇచ్చితిని. వారి నేల మరల మీకీయను' అని చెప్పెను.
10. పూర్వము ఏమీయులు అనబడు వారు చాలమంది అచట జీవించిరి. వారు అనాకీయులు వలె ఆజానుబాహులు.
11. అనాకీయులు వలె వారికిని రేఫాయీమీయులని కూడ పేరు. అయినను మోవాబీయులు వారిని ఏమీయులనియే పిలిచెడి వారు.
12. పూర్వము ఇచట హోరేయులు అనువారు కూడ వసించిరి. కాని ఏసావువంశజులు వారిని వెలుపలకు తరిమి నాశనముచేసి ఆ దేశమును ఆక్ర మించుకొనిరి. అట్లే యిస్రాయేలు ప్రజలును ప్రభువు తమకిచ్చిన నేలమీదినుండి శత్రువులను తరిమి వేసితిరిగదా!
13-14. అంతట మనము ప్రభువు ఆజ్ఞపై సేరేదు నది దాటితిమి. కాదేషు బార్నెయా నుండి సేరెదు నది చేరుటకు మనకు ముప్పదియెనిమిదేండ్లు పట్టినది. ప్రభువు సెలవిచ్చినట్లే ఈ కాలమున మన ప్రజలలో యుద్ధము చేయగలవారందరును చనిపోయిరి.
15. ప్రభువుహస్తము వారి మనుగడకు అడ్డుతగిలెను. కనుక వారెల్లరు గతించిరి.
16-17. ఆ రీతిగా యుద్ధము చేయగలవారందరును కన్నులు మూయగా ప్రభువు నాతో 'నేడు మీరు ఆరు పట్టణము మీదుగా మోవాబు దాటిపోవలయును.
18-19. ఆ పిమ్మట మీరు లోతు వంశజులైన అమ్మోనీయుల మార్గమున వెళ్ళునపుడు మీరు వారిని రెచ్చగొట్టి పోరునకు ప్రేరేపింపవలదు. నేను వారిదేశమును మీకీయను. దానిని ఏనాడో వారికిచ్చివేసితిని' అని అనెను.
20. ఈ దేశమునకు గూడ రేఫాయీము అని పేరు. పూర్వమిచట రేఫాయీమీయులు వసించిరి. కాని అమ్మోనీయులు వారిని 'సమ్సుమ్మీయులు' అని పిలిచెడివారు.
21. వారు అనాకీయులవలె చాల పెద్దజాతి, ఆజానుబాహులు. కాని ప్రభువు వారిని నాశనముచేయగా అమ్మోనీయులు ఆ దేశమును ఆక్రమించుకొని అచట స్థిరపడిరి.
22. అట్లే ప్రభువు హోరీయులను నాశనముచేయగా ఏసావు సంతతి వారు వారికి చెందిన సేయీరు దేశమును ఆక్రమించు కొని అందు స్థిరపడి, నేటికిని అచటనే వసించుచున్నారు గదా!
23. అదే విధముగా అవ్వీయులు దక్షిణమున గాజా వరకు స్థిరపడియుండిరి. కఫ్తోరు నుండి కఫ్తోరీయులు వెడలివచ్చి అవ్వీయులను వధించి వారి దేశమున స్థిరపడిరి. ఆ రీతిగా మనము మోవాబు దాటిన తరువాత ప్రభువు నాతో
24. మీరిచట నుండి బయలుదేరిపోయి అర్నోను ఏరుదాటుడు. అమోరీయుడును హెష్బోను రాజగు సీహోనును మీ వశము చేసితిని. అతని రాజ్యమును మీకిచ్చితిని. మీరు అతని మీదపడి ఆ దేశమును ఆక్రమించుకొనుడు.
25. నేటి నుండి ప్రజలందరికి మీరనిన భయము పుట్టింతును. మీ పేరు వినగనే అన్ని జాతులు భీతితో కంపించి పోవును' అని పలికెను. ,
26. అప్పుడు నేను కెడెమోతు ఎడారినుండి హెష్బోను రాజగు సీహోనునకు ఇట్లు శాంతి సందేశము పంపితిని.
27. 'మేము నీ దేశముగుండ ప్రయాణము చేయనెంచుచున్నాము. ' మేము రాజమార్గములోనే వెళ్ళెదము. త్రోవనుండి కుడిఎడమలకు బెత్తెడైనను కదలము.
28-29. మీ దేశమున తినిన తిండికి, త్రాగిన నీటికి రూకలు చెల్లింతుము. మేము యోర్దాను దాటి దేవుడు మాకిచ్చిన నేలను చేరుకోవలెను. సేయీరున నివశించు ఏసావు వంశజులు, ఆరున వసించు మోవాబీయులు మాకు దారియిచ్చిరి.'
30. కాని సీహోను మనకు దారి ఈయడయ్యెను. మీ దేవుడైన ప్రభువు ప్రేరణమువలన అతడు మొండికెత్తి గుండె బండచేసికొనెను. కనుక నేడు జరిగినట్లుగా ప్రభువు అతనిని మన వశముచేసెను.
31. అప్పుడు ప్రభువు నాతో సీహోనును అతని దేశమును మీచేతికి అప్పగించితిని. ఈ నేలను జయించి స్వాధీనము చేసి కొనుడు' అని చెప్పెను.
32. అంతట సీహోను జనమును ప్రోగుచేసికొని వచ్చి యాహాసువద్ద మనలను ఎదిరించెను.
33. ప్రభువు అతనిని మనచేతికి చిక్కించెను. కనుక మనము ఆ రాజును అతని కుమారులను, ప్రజలను చంపితిమి.
34. అతని పట్టణములను పట్టుకొంటిమి. అచటి స్త్రీ పురుషులను, పిల్లలను ఒక్కరినిగూడ తప్పిపోనీయకుండ అందరిని శాపము పాలుచేసి మట్టుబెట్టితిమి.
35. ఆ నగరములను కొల్లగొట్టి అచటి పశువులమందలను తోలుకొని వచ్చితిమి.
36. అర్నోను లోయ అంచుననున్న అరోయేరు పట్టణము మొదలుకొని గిలాదు వరకును గల ప్రతి నగరము మనకు లొంగిపోయెను. వానినన్నిటిని ప్రభువు మన వశముచేసెను.
37. అయినను అమ్మోనీ యుల దేశమునుగాని, యబ్బోకు నదీతీరమునుగాని, మన్యముననున్న నగరమునుగాని, ప్రభువు నిషేధించిన మరి ఏ ప్రాంతమునుగాని మనము సమీపింపలేదు.