ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

యెహోషువ 1

1. దేవుడైన యావే తన సేవకుడైన మోషే మరణించిన పిమ్మట, మోషే పరిచారకుడును, నూను కుమారుడైన యెహోషువను ఇట్లు ఆజ్ఞాపించెను:

2. “నా సేవకుడు మోషే గతించెను. కనుక లెమ్ము! నీవు ఈ జనులందరితో యోర్దాను నది దాటి, నేను యిస్రాయేలీయులకిత్తునని ప్రమాణము చేసిన దేశమునకు పొమ్ము.

3. నేను మోషేతో చెప్పినట్లు మీరు అడుగు పెట్టిన భూమినెల్ల మీకిచ్చెదను.

4. మహారణ్యము, లెబానోను మొదలుకొని యూఫ్రటీసు మహానదివరకు, పశ్చిమమున హిత్తీయుల దేశము మీదుగా మహా సముద్రము వరకును విస్తరించిన భూమి అంతయు మీకే చెందును.

5. నీ జీవితకాలములో ఎవ్వరును నిన్ను ఎదిరింపజాలరు. మోషేకువలె నీకును నేను తోడైయుందును. నిన్ను విడువను. నిన్ను ఎడబాయను.

6. ధైర్య స్టెర్యములు కలిగివుండుము. నేను ఈ జనుల పితరులకు ఈ దేశమును ఇత్తునని ప్రమాణము చేసితిని, అట్లే నీవు దానిని యిస్రాయేలీయులకు పంచియిత్తువు.

7. ధైర్యస్తైర్యములు మాత్రము కోల్పోకుము. నా సేవకుడు మోషే నీకిచ్చిన ధర్మశాస్త్రమును తు.చ. తప్పక అనుసరింతువేని నీవు కృతార్థుడవగుదువు.

8. ఈ ధర్మశాస్త్రమును నిత్యము పఠింపుము. అహోరాత్రములు మననము చేసికొనుము. దానిలో చెప్పిన న్యాయములన్నిటిని పాటింపుము. అప్పుడు నీ కార్యములు సంపూర్ణముగా నేరవేరును. నీవు కృతార్థుడవగుదువు.

9. నేను చెప్పినట్లు ధైర్యస్థైర్యములు అవలంబింపుము. నిర్భయముగా నిస్సంశయముగా ప్రవర్తింపుము. నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన ప్రభువు ఎల్లవేళల నీకు తోడైయుండును”

10-11. అంతట యెహోషువ ఈ విధముగా జనులకు చెప్పవలసినదిగా నాయకులను ఆజ్ఞాపించెను. “సరిపడు ఆహారపదార్ధములు సమకూర్చు కొనుడు. ఎందుకనగా మూడు దినములలో యావే మీకిత్తునని వాగ్దానము చేసిన దేశమును వశము చేసుకొనుటకు యోర్దాను నదిని దాటవలయును"

12. యెహోషువ రూబేను, గాదు సంతతివారిని, మనష్షే సంతతివారిలో సగముమందిని పిలచి

13. “మీ దేవుడైన ప్రభువు ఈ భూమిని మీకు ఒసగును. మీకు విశ్రాంతిని ప్రసాదించును” అని ప్రభువు దాసుడు మోషే మీతో చెప్పిన విషయము జ్ఞప్తికి తెచ్చుకొనుడు.

14. మీ ఆలుబిడ్డలు, పశువుల మందలు మోషే మీకిచ్చిన యోర్ధాను ఈవలితీరమున నిలువవచ్చును. కాని మీరు మీ బలగముతో నది దాటి పోవలయును. మీలో వీరులైనవారు ఆయుధములతో ముందుగా నడచి మీసోదరులకు సహాయము చేయవలయును. మీకువలె మీసోదరులకును ప్రభువు విశ్రాంతి దయచేయువరకు, వారు ప్రభువు ఇచ్చెదనన్న భూమిని వశము చేసికొనునంతవరకు వారితో కలసి పోరాడుడు.

15. అటుపై యావే సేవకుడగు మోషే తూర్పున యోర్దాను ఈవలి తీరమున మీకిచ్చినది, మీ స్వాధీనములో నున్నదియునగు దేశమునకు మీరు తిరిగిరావచ్చును” అని చెప్పెను.

16. అంతట వారు “నీవు చెప్పినట్లెల్ల చేయుదుము. నీవు పొమ్మన్న చోటికి పోవుదుము.

17. సర్వవిధముల మోషే మాట వినినట్లు నీ మాట విందుము. మన దేవుడైన యావే మోషేకువలెనె నీకును బాసటయైయుండునుగాక!

18. నీ ఆనతికి ఎదురుతిరిగి నీ మాట విననివారికి మరణ శిక్ష విధింపుము. ధైర్యస్థైర్యములతో ఉండుము” అని యెహోషువతో పలికిరి.