ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

ద్వితియోపదేశకాండము 19

1. ప్రభువు ఆ అన్యజాతులను మీ వశము చేసి వారి దేశమును మీకు ఈయగా మీరు వారి నగరములను, గృహములను స్వాధీనము చేసికొని వానియందు నివసింపమొదలిడిన పిదప,

2-3. ఆ దేశమును మూడుభాగములుగా విభజింపుడు. ఒక్కొక్క భాగమునకు ఒక్కొక్క నగరమును ప్రత్యేకింపుడు. ఆ నగరములను సులువుగా చేరుకొనుటకు మార్గములు ఉండవలయును. నరహంతకులు ఆ నగరములకు పారిపోయి తలదాచుకోవచ్చును.

4. ఎవడైన బుద్ధి పూర్వకముగాగాక పొరపాటున తోటినరుని చంపెనేని ఆ ఆశ్రయపట్టణములకు పారిపోయి ప్రాణరక్షణ కావించు కోవచ్చును.

5. ఉదాహరణకు ఇరువురు మనుష్యులు వంటచెరకు కొరకు అడవికి వెళ్ళిరను కొందము. వారిలో ఒకడు చెట్టును నరుకుచుండగా గొడ్డలిపిడి ఊడి తోటివానికి తగిలి వాడు చనిపోయెననుకొందము. ఆ హంతకుడు పై నగరములలో తలదాచుకొని ప్రాణములు కాపాడుకోవచ్చును.

6. ఒక్క పట్టణమేయున్నచో ఆ పట్టణము చాలదూరమున ఉన్నచో హతుడైన వానిబంధువు పగతీర్చుకోగోరి హంతకుని వెన్నాడి దారిలోనే పట్టుకొని కోపావేశముతో సంహరింపవచ్చును. కాని హంతకునికి చచ్చిన వానిపట్ల వైరములేదు. తాను అతనిని బుద్ధిపూర్వకముగా చంపలేదు. కనుక అతడు చంపదగినవాడు కాడు.

7. కావుననే హంతకుల కొరకు మూడుపట్టణములను ప్రత్యేకింపుడని నేను మిమ్ము ఆజ్ఞాపించు చున్నాను.

8. ప్రభువు మీ పితరులకు మాటయిచ్చినట్లే మీ దేశమును విస్తృతముకావించి తాను ప్రమాణము చేసిన భూమినంతటిని మీ వశముచేసిన పిదప,

9. మరి మూడుపట్టణములను కూడ ప్రత్యేకింపుడు. ఈనాడు నేను విధించిన విధులన్నిటిని మీరు పాటించిన యెడల ప్రభువును ప్రేమించి ఆయన ఆజ్ఞలను అనుసరింతురేని, మరి మూడుపట్టణములను తప్పక మీ పరము చేయును.

10. ప్రభువు మీకొసగిన ఆ నేలమీద నిర్దోషులెవరును ప్రాణమును కోల్పోరు. మీరు నిరపరాధులను చంపిన పాపమునబోరు.

11. కాని యెవడైన తన పొరుగువాని మీద వైరము పెట్టుకొని వాని కొరకు పొంచియుండి వాని మిదబడి చచ్చునట్లు కొట్టి పై పట్టణములకు పారిపోయననుకొందము.

12. అప్పుడు అతని ఊరి పెద్దల వానిని పట్టించి చనిపోయిన వాని బంధువునకు అప్పగింపవలయును. ఆ బంధువు అతనిని వధించి పగతీర్చుకొనును.

13. అట్టి వానిమీద మీరు దయ చూపరాదు. మీరు యిస్రాయేలు దేశమున నిర్దోషుల వధను పూర్తిగా వారింతురేని మీకు క్షేమము కలుగును.

14. నీవు స్వాధీనపరచుకొనునట్లు, యావే నీకిచ్చుచున్న దేశములో నీకు కలుగు నీ స్వాస్థ్యములో, పూర్వులు మీ పొరుగువారి పొలమునకు పాతిన గట్టు రాళ్ళను తొలగింపకుడు.

15. మానవుని దోషిగా నిర్ణయించుటకు ఒక్కని సాక్ష్యము చాలదు. ఇద్దరు లేక ముగ్గురు సాక్ష్యము పలికిననే గాని ఎవనినైన దోషిగా నిర్ణయింపరాదు.

16-17. ఎవడైన కపటముతో మరియొకని మీద నేరముమోపెనేని వారు ఇరువురును ప్రభువు ఎన్నుకొనిన ఆరాధనస్థలమునకు పోవలయును. అప్పుడు అచ్చట అధికారములోనున్న యాజకులు, న్యాయాధిపతులు వారికి తీర్పుచెప్పుదురు.

18. న్యాయాధిపతులు ఆ తగవును జాగ్రత్తగా పరిశీలింతురు. కాని అభియోక్త తోటియిస్రాయేలీయుని మీద అన్యాయముగా నేరము మోపెనని తేలిన యెడల,

19. అభియోక్త తన సహోదరునికి ఎట్టి శిక్ష ప్రాప్తింప తలంచునో అట్టి శిక్షనే అభియోక్తకు విధింపవలయును. ఈ రీతిగా ఈ దుష్కార్యమును అణచివేయవలయును.

20. ఇతరులు ఈ సంగతివిని భయపడి మరల ఇట్టి పాడుపనికి పాల్పడరు.

21. ఇట్టి తగవులలో మీరు జాలి చూపరాదు. ఎంతటి కీడుచేసిన వారికి అంతటి ప్రతీకారము చేయుడు. కనుక ప్రాణమునకు ప్రాణము, కంటికి కన్ను, పంటికి పన్ను, చేతికి చేయి, కాలికి కాలు శిక్ష,