ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

యెహోషువ 17

1. యోసేపు జ్యేష్ఠపుత్రుడు మనష్షే అతనికి లభించిన భూమి యిది: మనష్షే జ్యేష్ఠపుత్రుడు మాకీరు పోరాటవీరుడు కనుక అతనికి గిలాదు, బాషాను మండలములు లభించెను.

2. మనష్షే ఇతర కుమారులకు వారివారి కుటుంబములను అనుసరించి భూములిచ్చిరి. వారు అబియెజెరు, హేలేకు, ఆస్రియేలు, షెకెము, హేఫేరు, మెమిదా. వీరందరు యోసేపు కుమారుడు మనష్షే పుట్టిన కుమారులు.

3. మనష్షే కుమారుడు మాకీరు. అతని కుమారుడు గిలాదు. గిలాదు కుమారుడైన హేఫేరు కుమారుడగు సేలోఫెహాదునకు కుమార్తెలు మాత్రమే కలరు. వారి పేర్లు మహ్లా, నోవా, హోగ్లా, మిల్కా, తీర్సా.

4. వీరందరు నూను కుమారుడు యెహోషువను, యాజకుడగు ఎలియెజెరును, ప్రజల పెద్దలను సమీపించి “మా బంధువులతో పాటు మాకును భాగము ఈయవలెనని యావే మోషేకు ఆజ్ఞయిచ్చెను గదా!" అనిరి. కనుక యావే ఆజ్ఞను అనుసరించి ఆ ఆడుపడుచులకు వారి పినతండ్రులతో పాటు భూములను పంచియిచ్చిరి.

5. ఈ రీతిగా యోర్దానునకు ఆవలనున్న గిలాదు, బాషాను మండలములు కాక మనకు పదివంతులు అదనముగా వచ్చెను.

6. ఏలయనగా, మనష్షే కుమార్తెలు అతని కొడుకులతో పాటు భాగములు పంచుకొనిరి. గిలాదు మనష్షే కుమారులకు సంక్రమించెను.

7. మనష్షే వచ్చిన భాగమునకు సరిహద్దు ఆషేరు వైపున షెకెమునకు ఎదురుగా నున్న మిక్మేతాతు వరకుపోయి అచటినుండి దక్షిణమున తాపువా చెలమ చెంతగల యాషీబు వరకు వ్యాపించెను.

8. తాపువా మండలము మనష్షేది. కాని తాపువా పట్టణము మాత్రము మనష్షే మండలము సరిహద్దున ఉన్నందున ఎఫ్రాయీమీయులకు చెంది యుండెను.

9. ఆ సరిహద్దు దిగువవైపున కానా ఏటివరకు పోయి సముద్రము చేరెను. ఈ ఏటికి దక్షిణమున ఎఫ్రాయీము పట్టణములు కలవు. ఇవిగాక మనష్షే పట్టణములందు ఎఫ్రాయీము ప్రజలకు కొన్ని నగరములు కలవు. మనష్షే తెగవారి భూమి ఈ ఏటికి ఉత్తరమున సముద్రము వరకు వ్యాపించి ఉన్నది.

10. ఈ రీతిగా దక్షిణమున ఎఫ్రాయీము, ఉత్తరమున మనష్షే ఉండిరి. వారిమధ్య సరిహద్దు సముద్రము వరకు ఉండెను. వారికి ఉత్తరమున ఆషేరు, తూర్పున యిస్సాఖారు కలరు.

11. యిస్సాఖారు, ఆషేరు మండలములలో మనష్షేనకు పట్టణములు కలవు. బేత్-షెయాను దాని పల్లెలు, ఈబ్లెయాము దాని పల్లెలు, దోరు, ఎన్-దోరు వాని పల్లెలు, తానాకు, మెగిద్ధో వాని పల్లెలు, నెఫేత్తు మూడవవంతు మనష్షేవి.

12. కాని మనష్షే ఈ పట్టణములను ఆక్రమించుకోలేదు. కనానీయులే వానినేలిరి.

13. కాని యిస్రాయేలీయులు బలవంతులైన కొలది కనానీయులను పూర్తిగా వెళ్ళగొట్టలేక పోయినను వారిచేత వెట్టిచాకిరి చేయించుకొనిరి.

14. యోసేపు సంతతివారు యెహోషువతో “నీవు మాకు ఒక్కభాగమే ఇచ్చితివిగదా! యావే దీవెనవలన మేము చాలమందిమైతిమి” అనిరి.

15. యెహోషువ వారితో “మీరు చాల మందియైనచో ఎఫ్రాయీము పీఠభూములు మీకు చాలనిచో, అరణ్య ప్రాంతమునకు పొండు. పెరిస్సీయులు, రేఫీయులు వసించు దేశములోని అడవులను నరికివేసి ఆ నేలను ఆక్రమించుకొనుడు” అని చెప్పెను.

16. యోసేపు సంతతివారు “ఈ పీఠభూమి మాకు చాలదు. ఈ మైదానమున వసించు కనానీయులందరకు ఇనుపరథములు కలవు. అట్లే బేత్-షెయానుకు, దాని ఏలుబడిలోనున్న పట్టణములకు, యెస్రెయేలు మైదానములోనున్న వారికి ఇనుప రథములున్నవి” అనిరి.

17-18. కనుక యెహోషువ యోసేపు సంతతివారగు ఎఫ్రాయీము, మనలతో “మీరు చాలమంది అయితిరి. చాల బలవంతులు కూడ. మీకు ఒక్క భాగము చాలదు. కనుక ఈ పర్వతసీమను ఆక్రమించుకొనుడు. దానిని ఆవరించియున్న అడవులను నరికివేయుడు. ఈ సీమయెల్లలే మీ యెల్లలు. ఇచటి కనానీయులు బలవంతులైనను, ఇనుపరథములు ఉపయోగించుచున్నను మీరు వారిని వెడలగొట్టగలరు.” అని చెప్పెను.