1. చీట్లు వేయగా యోసేపు తెగవారికి వచ్చిన వంతుగా యోర్దాను నుండి యెరికో జలముల వరకు తూర్పు వైపుగల నేల లభించెను. వారి సరిహద్దు యెరికో నుండి పీఠభూముల మీదుగా బేతేలు పీఠ భూముల వరకు వ్యాపించెను.
2. అచటినుండి బేతేలు లూసు మీదుగా అటారోతు చెంతగల ఆర్కి వరకు వ్యాపించెను.
3. అచటినుండి క్రిందివైపుగా, పడమటి వైపుగాపోయి యాఫ్లెతీయుల దిగువనున్న బేత్-హోరోను వరకును, గేసేరు వరకును వ్యాపించి సముద్రమును చేరెను.
4. యోసేపు కుమారులైన మనష్షే, ఎఫ్రాయీములకు లభించిన వారసత్వభూమి యిదియే.
5. ఎఫ్రాయీము తెగవారికి వంశముల ప్రకారము లభించిన వారసత్వభూమి తూర్పు సరిహద్దు అటారోతు -అద్దారు వరకు, ఎగువన బేత్-హోరోను వరకును వ్యాపించి సముద్రమును చేరెను.
6. ఉత్తరమున మిక్మేతాతు వరకును వ్యాపించెను. అక్కడి నుండి తూర్పు నకు తిరిగి తానాత్-షిలో వరకును, యానోవా వరకును వ్యాపించెను.
7. అచటినుండి దిగువకు మరలి అటారోతు, నారాల వరకు పోయి యెరికో మీదుగా వచ్చి యోర్దాను చేరెను.
8-9. ఆ సరిహద్దు తాపువా మీదుగా పడమటికి తిరిగి కానా వాగుమీదుగా సముద్రమును చేరెను. ఎఫ్రాయీము తెగ వారికి వారివారి కుటుంబములను అనుసరించి వచ్చిన వారసత్వభూమి యిదియే. మనష్షే తెగవారికి లభించిన వారసత్వ భూమియందును ఎఫ్రాయీమీయులకు ఈయబడిన పట్టణములు, పల్లెలు కలవు.
10. ఎఫ్రాయీము జనులు గేసేరున వసించు కనానీయులను వెడలగొట్ట లేకపోయిరి. కనుక వారు నేటికిని ఎఫ్రాయీమీయులతో వసించుచున్నారు. అయినను వీరు వారిచేత వెట్టి చాకిరి చేయించుకొనిరి.