ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

ద్వితియోపదేశకాండము 16

1. అబీబు నెలలో పాస్కపండుగను కొనియాడి మీ ప్రభువైన దేవుని స్తుతింపుడు. ఆ నెలలో ఒకరాత్రి ప్రభువు మిమ్ము ఐగుప్తునుండి తోడ్కొనివచ్చెను.

2. ప్రభువు తన నామమునకు నివాసస్థానముగా ఎన్నుకొనిన తావులోనే పాస్కను కొనియాడవలయును. అచట మీ మందలనుండి కొనివచ్చిన బలిపశువును వధింపుడు.

3. ఈ పండుగ చేసికొనునపుడు మీరు పొంగిన రొట్టెలు భుజింపరాదు. ఏడుదినములపాటు పొంగనిరొట్టెలనే ఆరగింపుడు. మీరు ఐగుప్తునుండి త్వరత్వరగా వెడలివచ్చినపుడు పొంగనిరొట్టెలనే భుజించిరికదా! ఆ రొట్టెలు బాధను జ్ఞప్తికి తెచ్చును. వానిని భుజించుటవలన మీరు ఐగుప్తునుండి వెడలి వచ్చిన దినమును జీవితాంతమువరకు జ్ఞప్తియందుంచు కొందురు.

4. మీరు నివసించు ప్రదేశమున ఏడు దినములవరకు పులిసిన పదార్ధము కనిపింపకూడదు. పండుగ మొదటి దినమున చంపిన బలిపశువు మాంసమును ఆ దినముననే భుజింపవలయును. మరునాటికి మిగల్చరాదు.

5. ప్రభువు మీకిచ్చిన ఇతర నగరములలో పాస్కబలిని అర్పింపరాదు.

6. నీ దేవుడైన యావే తన నామమునకు నివాసస్థలముగా ఎన్నుకొనిన తావులోనే బలినర్పింపుడు. సూర్యాస్త మయమున అనగా మీరు ఇగుప్తునుండి బయలు దేరివచ్చిన సమయమున, ఆ బలిని అర్పింపుడు.

7. ప్రభువు ఎన్నుకొనిన ఆరాధనస్థలముననే బలిపశువు మాంసమును వండి భుజింపుడు. ఆ మరుసటిరోజు ప్రొద్దుననే మీ ఇండ్లకు వెడలిపోవచ్చును.

8. మీరు ఆరురోజులపాటు పొంగనిరొట్టెలు తినుడు. ఏడవ రోజున యెల్లరును సమావేశమై ప్రభువును ఆరా ధింపుడు. ఆ రోజున మీ జీవనోపాధియైన ఏ పనియు చేయరాదు.

9. కోతకారునుండి మొదలు పెట్టి ఏడువారముల కాలమును లెక్కింపుడు.

10. ఆ కాలము ముగియగనే ప్రభువును స్తుతించుచు వారములపండుగ చేసికొనుడు. యావే మీకిచ్చిన వానినుండి మీరు ఆయనకు స్వేచ్చగా కానుకలు అర్పింపుడు.

11. మీ పిల్లలతో, సేవకులతో, మీ నగరములందు వసించు లేవీయులతో, పరదేశులతో, అనాథ బాలలతో, వితంతువులతో ప్రభువు సమక్షమున ఆనందించి సంతసింపుడు. నీ దేవుడైన యావే తన నామమునకు నివాసస్థలముగా ఎంచుకొనిన తావుననే ఈ ఉత్సవము జరుపుకొనుడు.

12. ఈ ఆజ్ఞలనెల్ల జాగ్రత్తగా పాటింపుడు. మీరు ఐగుప్తున బానిసలుగా నుంటిరని మరచిపోవలదు.

13. మీ కళ్ళములలోని ధాన్యము మీ తొట్టిలోని ద్రాక్షసారాయము ఇల్లు చేరినపిదప ఏడురోజులపాటు గుడారములపండుగ చేసికొనుడు. 

14. మీ పిల్లలతో, సేవకులతో మీ నగరములలో వసించు లేవీయులతో, పరదేశులతో, అనాథ బాలబాలికలతో, వితంతువులతో ప్రభువు సమక్షమున ఆనందించి సంతసింపుడు.

15. ప్రభువు ఎంచుకొనిన ఆరాధనస్థలముననే ఏడురోజుల పాటు ఆయన పేరిట పండుగ చేసికొనుడు. ప్రభువు మీ పంటను, మీ కృషిని దీవించును. గనుక మీరెల్లరు సంతసింపుడు.

16. మీ మగవారందరు ఏడాదికి మూడుమార్లు అనగా పులియనిరొట్టెల పండుగలోను, వారముల పండుగలోను, గుడారములపండుగలోను మీ దేవుడైన యావే ఎంచుకొనిన స్థలమున మీ మగవారందరు ఆయన సన్నిధిలో కనపడవలయును. ఎవరును వట్టిచేతులతో వచ్చి ప్రభువును దర్శింపరాదు.

17. మీ ప్రభువు మిమ్ము దీవించిన దానికి అనుగుణముగా మీరును ఆయనకు కానుకలు కొనిరండు.

18. ప్రభువు మీకు ఈయనున్న నగరములన్నింటను మీ తెగలకు న్యాయాధిపతులను, అధికారు లను నియమింపుడు. వారు నిష్పాక్షికముగా తగవులు తీర్పవలయును.

19. వారు న్యాయము చెరుపరాదు. జనుల ముఖము చూచి తీర్పుచెప్పరాదు. లంచములు పుచ్చుకొనరాదు. లంచము బుద్ధిమంతుల కళ్ళనుకూడ పొరలు క్రమ్మునట్లు చేయును. వారిచే తప్పుడు నిర్ణయములు చేయించును.

20. మీరు ఖండితముగా న్యాయమును పాటింపవలయును. అప్పుడు మీరు ప్రభువు ఈయనున్న నేలను స్వాధీనము చేసికొని అచట నివసించుదురు.

21. మీ దేవుడైన యావేకు మీరు కట్టు బలిపీఠముచెంత అషీరాదేవతకు స్తంభమును నాట రాదు.

22. విగ్రహారాధనకు గాను శిలాస్తంభమును నెలకొల్పరాదు. అట్టి స్తంభమును ప్రభువు ఏవగించుకొనును.