ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

యెహోషువ 15

1. యూదా తెగవారికి వారివారి కుటుంబముల ప్రకారముగా చీట్ల వలన వచ్చిన వారసత్వ భూమి ఎదోము సరిహద్దునగలదు. ఆ భూమి సీను ఎడారి నుండి దక్షిణమున కాదేషువరకు వ్యాపించియుండెను.

2-3. వారి దక్షిణపు సరిహద్దు మృతసముద్రము నొద్ద దక్షిణపు అఖాతము నుండి ప్రారంభమై అక్రిబీము శిఖరమునకు దక్షిణముగా సీను మీదుగా సాగిపోయెను. అచటినుండి కాదేషు బార్నెయాకు దక్షిణముగా వెడలిపోయి హెస్రోను మీదుగా ఆడ్డారు వరకు అచటి నుండి కార్కా వరకు సాగిపోయెను.

4. ఆ మీదట ఆస్మాను చుట్టుతిరిగి ఐగుప్తునది మీదుగా సముద్రము వరకు వచ్చెను. ఇది వారి దక్షిణపు సరిహద్దు.

5. వారి తూర్పు సరిహద్దు మృతసముద్రమును యోర్దాను నది కలియుచోటు వరకు ఉండెను.

6. ఉత్తర దిక్కున ఎల్ల యోర్దాను నది మృతసముద్రమును కలియు అఖాతమునొద్ద ప్రారంభమై బేత్-హోగ్లా మీదుగా బేతహరబ్బాకు ఉత్తరముగా సాగిపోయి, రూబేను కుమారుడు బోహాను పేరుమీదుగా పిలువబడు శిలవరకు వ్యాపించెను.

7. ఆ సరిహద్దు ఆకోరు లోయలోని దెబీరు వరకు పోయి, ఉత్తరదిక్కు మరలి ఆదుమ్మీము శిఖరమునకు ఎదుట నదికి దక్షిణముగా నున్న గిలాలుమీదుగా తిరిగి ఎన్-షెమెషు సరస్సు గుండ వచ్చి ఎన్-రోగేలు వద్ద ఆగిపోయెను.

8. అచటి నుండి బెన్-హీన్నోము లోయ మీదుగా యెరూషలేము లేక యెబూసీయుల కొండపల్లము వరకు వచ్చి పశ్చిమమున హిన్నోము లోయను అడ్డుపరచు కొండ శిఖరము వరకు పోయెను. ఈ శిఖరము రేఫాయీము లోయ ఉత్తరాగ్రమున ఉన్నది.

9. ఆ శిఖరము నుండి ఆ ఎల్ల నెఫ్తోవా సరస్సు వరకు వెడలిపోయి ఏఫ్రోను కొండపురములను దాటి అచటినుండి కిర్యత్యారీము లేక బాలా వైపునకు తిరిగెను. 

10-11. అచటినుండి ఆ సరిహద్దు సేయీరు కొండకు పడమటగా పోయి ఖేసలోను లేక యెయారీము కొండకు ఉత్తరముగా తిరిగి బేత్-షెమేషు తిమ్నాల మీదుగా దిగివెళ్ళి ఎక్రోను ఉత్తరమును జేరి షిక్కారోను వైపు మరలి బాలా కొండను దాటి యాబ్నీలు మీదుగా సముద్రము వరకు పోయెను.

12. వారి పడమటి ఎల్లయేమో మహా సముద్రమే. యూదా తెగలవారి కుటుంబములకు వచ్చిన నేలయిదియే.

13. యావే యెహోషువాను ఆజ్ఞాపించినట్లే యెఫున్నె కుమారుడగు కాలెబునకుగూడ యూదా తెగవారు ఆక్రమించుకొనిన నేలలో భాగమిచ్చిరి. అనాకీయుల ప్రధాననగరమగు కిర్యతార్బాను యెహోషువ కాలేబునకు ఇచ్చెను. ఇదియే నేటి హెబ్రోను.

14. అచటినుండి కాలేబు, అనాకు యొక్క ముగ్గురు కుమారులైన షేషయి, అహీమాను, తల్మాయి అను వారిని తరిమివేసెను.

15. అక్కడినుండి కాలెబు, దెబీరు నివాసులపై దండెత్తిపోయెను. ఈ పట్టణమునకు పూర్వనామము కిర్యత్సేఫేరు.

16. కాలేబు “కిర్యత్సేఫేరును ముట్టడించి దానిని పట్టుకొనిన వీరునకు నా కూతురు అక్సా నిచ్చి పెండ్లి చేసెదను” అనెను.

17. కాలేబు సోదరుడును కేనాసు కుమారుడగు ఒత్నీయేలు నగరమును ముట్టడించి పట్టుకొనెను. కాలేబు అతనికి అక్సా నిచ్చి వివాహము చేసెను.

18. ఆమె కాపురమునకు వచ్చినపుడు ఒత్నీయేలు “మీ తండ్రిని పొలము అడుగుము” అని ప్రేరేపించెను. ఆమె గాడిదమీద నుండి త్వరగా దిగి నిలుచుండెను. కాలేబు "తల్లీ! నీకేమి కావలయును?” అని అడిగెను.

19. అక్సా తండ్రితో “నాయనా! నాకు ఒక్కకోరిక తీర్చుము. నన్ను నేగేబు ఎడారి సీమకు వెడలగొట్టితివి గదా! ఇక నీటి బుగ్గలు గల నేలనైనను ఇప్పింపుము” అనెను. కాలేబు కుమార్తెకు ఎగువ నీటిబుగ్గలను, దిగువ నీటిబుగ్గలను ఇచ్చివేసెను.

20. యూదా తెగల వారికి వారివారి కుటుంబముల ప్రకారము సంక్రమించిన వారసత్వభూమి యిదియే.

21-32. ఎడారిలోని ఎదోము వైపునగల యూదా వంశీయుల దూర నగరములివి: కబ్సేలు, ఎదేరు, యాగురు, కీనా, దిమోను, ఆదదా, కేదేషు, హాసోరు, ఈత్నాను, సీపు, తేలెము, బెయాలోతు, హాసోరు-హడట్టా, కెర్యోతు-హెస్రోను లేక హాసోరు, ఆమాము, షేమా, మోలదా, హాసార్-గడ్డా, హెష్మోను, బేత్-పాలేతు, హాసార్-షువాల్, బేర్షెబా మరియు బిసియోతియా, బాలా ఇయీము, ఏసేము, ఎల్తోలదు, కేసీలు, హోర్మా, సీక్లగు, మద్మానా, సన్సానా, లెబావోతు, షిల్హీము, ఆయిన్, రిమ్మోను. ఈ పట్టణములన్నియు పల్లెలతో కలసి ఇరువది తొమ్మిది.

33-36. పల్లపు నేలలలోని పట్టణములివి: ఏష్టవోలు, సోరా, ఆష్నా, సానోవా, ఎన్-గన్నీము, తప్పూవా, ఏనాము, యార్మూతు, అదుల్లాము, సోకో, అసేకా, షారాయీము, అదితాయీము, గెదెరా. గదెరోయీతాము. ఇవి అన్నియు వాటి పల్లెలతో కలసి పదునాలుగు పట్టణములు.

37-41. సేనాను, హదాషా, మిగ్ధాల్గ్-గాదు, దిలాను, మిస్పె, యోక్తీలు, లాకీషు, బోస్కాతు, ఎగ్లోను. కాబ్బోను, లాహ్మాసు, కిత్లీషు, గదెరోతు, బేత్-దగోను, నామా, మక్కేడా. ఇవన్నియు వాటి పల్లెలతో కలిసి పదునారు పట్టణములు.

42-44. లిబ్నా, ఏతేరు, ఆషాను, ఇఫ్తా, ఆస్నా, నేసీబు, కెయిలా, ఆక్సీబు, మరేషా. ఇవన్నియు వానివాని పల్లెలతో జేరి తొమ్మిది పట్టణములు.

45-47. చుట్టుపట్లగల పల్లెలతో పట్టణములతో జేరి ఎక్రోను, ఎక్రోను నుండి సముద్రము వరకును, అష్దోదు వరకును గల పల్లెలు. చుట్టుపట్లగల పల్లెలతో పట్టణములతో చేరి అష్దోదు, చుట్టుపట్లగల పల్లెలతో పట్టణములతో ఐగుప్తునదివరకును గల గాజా. మహా సముద్రమే వీనికన్నిటికి సరిహద్దు.

48-57. పీఠభూములలోని పట్టణములివి: షామీరు, యాత్తీరు, సోకో, దానా, కిర్యత్-సాన్నా లేక దెబీరు, ఆనబు, ఎస్తమో, ఆనీము, గోషెను, హోలోను, గీలో. ఇవియన్నియు వానివాని పల్లెలతో జేరి పదునొకండు పట్టణములు. ఆరబు, రూమా లేక దూమా, ఏషాను, యానీము, బేత్-తపూవా, అఫేకా, హుమ్తా, కిర్యత్బాలు లేక నేటి హెబ్రోను, సియోరు. ఇవి యన్నియు వానివాని పల్లెలతోగూడి తొమ్మిది పట్టణములు. మావోను, కర్మెలు, సీపు, యుత్తా, ఎస్రేయేలు, యోక్దేయాము, సనోవా, కయీను, గిబియా మరియు తిమ్నా-వానివాని పల్లెలతో కలసి పది పట్టణములు.

58-59. హల్హులు, బేత్-సూరు, గెదోరు, మారతు, బేత్-అనోతు, ఎల్తేకోను వానివాని పల్లెలతో జేరి ఆరు పట్టణములు. తేకోవా, ఏప్రతా లేక నేటి బేత్లెహేము, పెయోరు, ఏతాము, కులోను, తాతాము, సోరెసు, కారెము, గల్లీము, బేతేరు, మనాకా వాని వాని పల్లెలతో చేరి పదునొకండు పట్టణములు'.

60. కిర్యత్బాలు లేక నేటి కిర్యాత్యారీము, రబ్బా వాని వాని పల్లెలతో జేరి రెండు పట్టణములు.

61-62. ఎడారి సీమయందు బేత్-అరబా, మిద్దీను, సెకాకా, నిబ్షాను, యీరె-మెల్లాహు, ఎన్-గెదీ వానివాని పల్లెలతోగూడి ఆరు పట్టణములు.

63. కాని యూదా తెగవారు యెరూషలేమున వసించు యెబూసీయులను వెడలగొట్టలేకపోయిరి. యెబూసీయులు నాటినుండి నేటివరకు యూదీయులతో పాటు యెరూషలేముననే వసించుచున్నారు.