ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

ద్వితియోపదేశకాండము 15

1. ప్రతి ఏడవయేటి తరువాత మీరు ప్రజల ఋణముల రద్దుకు గడువీయవలయును.

2. ఆ గడువు నియమములు ఇవి: తన పొరుగువానికి అప్పు ఇచ్చిన ప్రతివాడు దానికి గడువీయవలయును. ఇది యావేకు గడువు అనబడును. కనుక అప్పిచ్చినవాడు అప్పు తీసుకొనినవానిని నిర్బంధింపరాదు.

3. కాని అప్పుతీసుకొనిన పరదేశీయుని నిర్బంధింపవచ్చును. కాని నీ సహోదరునొద్దనున్న దానిని విడిచిపెట్టవలయును.

4-5. ప్రభువు తాను మీకీయనున్న నేలమీద మిమ్ము దీవించును. మీరు ప్రభువు మాటవిని ఈనాడు నేను మీకు విధించిన ఆజ్ఞలనెల్ల పాటింతురేని ఇక మీలో పేదలు అనువారు ఉండబోరు.

6. ఆయన తాను మాట యిచ్చినట్లే మిమ్ము దీవించును. అప్పుడు మీరు పలుజాతులకు ఋణదాతలు అగుదురుగాని ఎవరికిని ఋణగ్రస్తులుకారు. పలుజాతులను మీరు ఏలుదురుగాని ఎవరును మిమ్ము ఏలజాలరు.

7. ప్రభువు మీకు ఈయనున్న దేశమునందలి నగరములలో తోటియిస్రాయేలీయులలో పేదవాడు ఎవడైనను ఉన్నచో మీరు హృదయములను కఠినము చేసికొనక అతనికి సాయము చేయుడు.

8. ఉదార బుద్దితో అతని అక్కరలు తీర్పుడు.

9. బాకీలు రద్దగు ఏడవ యేడు వచ్చినదన్న నీచభావముతో అతనిని చిన్నచూపు చూచి సహాయముచేయ నిరాకరింపకుడు. అతడు మీమీద ప్రభువునకు మొర పెట్టినచో మీరు దోషులుగా గణింపబడుదురు. అది నీకు పాపమగును.

10. ఎట్టి మనోవిచారమును లేక మీరు ఉదారబుద్ధితో పేదవానికి సాయము చేయుదురేని మీ కార్యములన్నిటిని ప్రభువు దీవించును.

11. దేశమున పేదలేమో ఎప్పుడును ఉందురు. కనుక పేదసాదలైన తోటిజనులకు ఉదారబుద్ధితో సాయము చేయుడని మిమ్మాజ్ఞాపించుచున్నాను.

12. తోటియిస్రాయేలీయుడు, పురుషుడుగాని, స్త్రీగాని మీకు బానిసగా అమ్ముడుపోయినచో ఏడవ యేడు అతనిని దాస్యమునుండి విడిపింపవలయును.

13. నీ ఇంటినుండి వెడలిపోవునపుడు అతనిని వట్టి చేతులతో పంపరాదు.

14. నీ మందల నుండియు, ధాన్యమునుండియు, ద్రాక్ష సారాయము నుండియు అతనికి ఉదారముగా పాలిభాగమిమ్ము. దేవుడు నిన్ను సమృద్ధిగా దీవించినట్లే నీవును అతనిని ఆదుకొనుము.

15. పూర్వము మీరు ఐగుప్తున బానిసలై ఉండగా ప్రభువు మీకు దాస్యవిముక్తి కలిగించెనుగదా! కనుకనే నేడు నేను మీకిట్టి ఆజ్ఞనిచ్చితిని.

16. కాని ఆ బానిసకు నీపట్ల నీ కుటుంబము పట్ల ఇష్టము పుట్టవచ్చును. అతడు నీ ఇంట్లో ఉండుటకు ఇష్టపడవచ్చును.

17. అప్పుడు అతనిని మీ ఇంటి తలుపు చెంతకు తీసికొనిపోయి కదురుతో వాని చెవిని గ్రుచ్చుడు. ఇక అతడు జీవితాంతము నీకు బానిసయగును. బానిసరాలకు కూడ ఇట్లే చేయుడు.

18. మీరు ఏ బానిసనైనను స్వేచ్చతో పంపి వేయవలసి వచ్చినపుడు అనిష్టముతో సణుగుకొనకుడు. అతడు ఆరేండ్లపాటు కూలివానికంటె రెండంతలు అదనముగా నీకు చాకిరిచేసెను. కనుక మీరు అతనిని వెళ్ళిపోనిత్తురేని ప్రభువు మీ కార్యములను దీవించును.

19. మీ మందలలో పుట్టిన ప్రతి తొలిచూలు పోతును ప్రభువునకు అర్పింపుడు. అది కోడెదూడ అయినచో దానిని సేద్యమునకు వాడరాదు. గొఱ్ఱెపిల్ల అయినచో దాని ఉన్నిని కత్తిరించుకోరాదు.

20. ప్రభువు నియమించిన ఏకైక ఆరాధన స్థలమున ఏటేట వానిని కుటుంబసమేతముగా ఆరగింపుడు.

21. ఆ పశువులకు ఏదైన లోపమున్నచో, అనగా అవి కుంటివి, గ్రుడ్డివి, లేక మరి ఏదైన అవలక్షణము గలవి అయినచో, వానినసలు దేవునికి అర్పింపరాదు.

22. మీ ఇంటిపట్టుననే, శుద్ధిచేసికొనిగాని, చేసికొనక గాని, జింకనో, దుప్పినో భుజించినట్లుగా వానిని ఆరగింపుడు.

23. వానినెత్తురు మాత్రము ముట్టు కొనక నేలమీద నీటినివలె కుమ్మరింపుడు.