ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

యెహోషువ 14

1. యిస్రాయేలీయులకు కనాను దేశమున లభించిన వారసత్వభూములివి. యాజకుడగు ఎలియెజెరు, నూను కుమారుడగు యెహోషువ, యిస్రాయేలు తెగల పెద్దలు ఈ పంపిణి చేసిరి.

2. యావే మోషే ద్వారా ఆజ్ఞాపించినట్లు తొమ్మిది తెగలకు, పదియవ తెగ అర్ధభాగమునకు ఓట్లు వేసి వంతులవారిగా వారు పంపిణి చేసిరి.

3. యోర్దానుకు తూర్పుననున్న రెండున్నర తెగలకు మోషే ముందుగనే వారసత్వ భూమినిచ్చివేసెను. లేవీ తెగకు మాత్రము ఏ వారసత్వమును లేదు. యోసేపు కుమారులు మనష్షే, ఎఫ్రాయీము అని రెండు తెగలుగా నేర్పడిరి.

4. లేవీ తెగకు భూములేమియు సంక్రమింపలేదు. కాని వారు వసించుటకు కొన్ని పట్టణములు, మందలను మేపుకొనుటకు కొన్ని బయళ్ళు మాత్రము ఈయబడెను.

5. యావే మోషేకు ఆజ్ఞాపించినట్టుగనే యిస్రాయేలీయులు భూమిని పంచుకొనిరి.

6. యూదీయులు గిల్గాలుననున్న యెహోషువను చూడ వచ్చిరి. అపుడు యెఫున్నె కుమారుడును కెనిస్పీయుడునగు కాలేబు యెహోషువతో “కాదేషుభార్నెయా వద్ద యావే నిన్నును, నన్నును గూర్చి యావే సేవకుడైన మోషేతో ఏమి చెప్పెనో నీకు తెలియును గదా!

7. నాకు నలువదియేండ్ల ప్రాయములోనే యావే సేవకుడు మోషే కాదేషుబార్నెయో నుండి నన్నీ దేశమును వేగుచూచి రమ్మనిపంపెను. నేను చూచిన దానిని చూచినట్టు మోషేకు తెలిపితిని.

8. అపుడు నాతో వచ్చినవారు మన ప్రజలకు నిరుత్సాహము కలుగునట్లు మాట్లాడిరి. కాని నేను మాత్రము నీ దేవుడైన యావే చిత్తముచొప్పున నడుచుకొంటిని.

9. నాడే మోషే 'నీవు అడుగు పెట్టిన నేల నీకును నీ సంతతి వారికిని సదా వారసత్వభూమిగా లభించును. నీవు నా దేవుడైన యావే చిత్తముచొప్పున నడుచుకొంటివి' అని ప్రమాణముచేసెను.

10. ఆ వాగ్దానము ప్రకారము దేవుడింతకాలము నాకు ఆయువునిచ్చెను. నలువది ఐదేండ్లనాడు యిస్రాయేలీయులు ఎడారిలో ప్రయాణము చేయుకాలమున యావే మోషేతో ఈ వాగ్దానము చేసెను. ఇప్పుడు నాకు ఎనుబది ఐదేండ్లు,

11. నాడు మోషే పంపినపుడు ఉన్న జవసత్త్వములు నేటికిని ఉడిగిపోలేదు. నాటివలె నేడును శత్రువులతో పోరాడుటకు వారిని జయించుటకు సమర్థుడను.

12. కనుక యావే వాగ్దానముచేసిన ఆ కొండసీమలను నా కిచ్చి వేయుము. ఆ ప్రాంతమున అనాకీయులు నిండియున్నారనియు, అచటి పట్టణములు చాల పెద్దవనియు నీవును వినియేయున్నావు. ప్రభువు నాకు తోడ్పడినచో ఆ ప్రభువు సెలవిచ్చినట్లే వారిని జయింపగలను” అనెను.

13. యెహోషువ యెవున్నె కుమారుడగు కాలెబును దీవించి అతనికి హెబ్రోను సీమను వారసత్వభూమిగా ఇచ్చివేసెను.

14. కనుకనే నేటికిని ఆ సీమ కెనిస్సీయుడును, యెఫున్నె కుమారుడునగు కాలేబు అధీనముననే యున్నది. అతడు యిస్రాయేలు దేవుడగు యావే చిత్తముచొప్పున నడచుకొనినందులకు అది బహుమానము.

15. పూర్వము హెబ్రోను పేరు కిర్యతార్బా, అనాకీయులందరిలోను మహా ప్రసిద్ధుడు ఆర్బా. అటు పిమ్మట ఆ దేశమున యుద్ధములు సమసిపోయి శాంతినెలకొనెను.