ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

ద్వితియోపదేశకాండము 14

1. మీరు ప్రభువైన యావేకు తనయులు. కనుక మీరు మృతులను స్మరించుకొని, మీ శరీరములను కోసికొనకుడు. నొసటిమీద గొరిగించుకొనకుడు.
2. మీరు ప్రభువునకు నివేదితులైన ప్రజలు. ఈ నేలమీది జాతులలోనెల్ల మిమ్మే ఆయన తన సొంత ప్రజలుగా ఎన్నుకొనెను.
3. మీరు అశుచికరమైన పశువులను తినరాదు.
4-5. ఎద్దు, గొఱ్ఱె, మేక, దుప్పి, జింక, కారుమేక, కారుజింక, లేడి, కొండగొఱ్ఱె వీనిని మీరు భుజింపవచ్చును.
6. చీలినగిట్టలు కలిగి నెమరువేయు జంతువును దేనినైనను మీరు తినవచ్చును.
7. చీలినగిట్టలున్నను, నెమరువేయునవి కావేని ఆ జంతువులను మీరు ఆరగింపరాదు. కనుక మీరు ఒంటెలు, కుందేళ్ళు, పొట్టి కుందేళ్ళును ముట్టుకోరాదు. అవి నెమరువేయునుగాని వాని గిట్టలు చీలియుండవు. కావున అవి మీకు అశుచికరమైన జంతువులు.
8. పందికి గిట్టలు చీలియుండునుగాని అది నెమరు వేయదు. కనుక అది మీకు అశుచికరమైన జంతువు. మీరు అట్టి జంతువులను భుజింపకుడు, వాని మృత దేహములను కూడ ముట్టుకొనకుడు.
9. నీటి జంతువులలో పొలుసులు, రెక్కలు గల వానినన్నిటిని మీరు భక్షింపవచ్చును.
10. పొలుసులు, రెక్కలు లేనివి భక్షణయోగ్యములు కావు. అవి మీకు అశుచికరములు.
11. శుచికరములైన పక్షులను మీరు ఆరగింప వచ్చును.
12-18. ' కాని ఈ క్రింది జాతి పక్షులను మీరు ఆరగింపరాదు: గరుత్మంతుడు, పెద్దబోరువ, క్రౌంచము, పిల్లి గ్రద్ద, రాబందు, నానావిధములైన కాకులు, నిప్పుకోడి, కపిరిగాడు, కోకిల, నానా విధములైన డేగలు, గుడ్లగూబలు, పైడికంటి, హంస, గూడబాతు, తెల్లబందు, చెరువు కాకి, చీకు బాతు, సారసము, రకరకములైన కొంగలు, కుకుడుగువ్వ, గబ్బిలము.
19. ఎగిరెడు కీటకములన్నియు అశుచికరములు. కనుక మీరు వానిని ముట్టుకొనరాదు.
20. శుచి కరమైన కీటకములను మాత్రము మీరు తినవచ్చును.
21. చనిపోయిన జంతువును దేనిని మీరు భుజింపరాదు. మీ నగరములలో వసించు పరదేశులు దానిని తినవచ్చును. లేదా అన్యజాతి ప్రజలకు దానిని అమ్మివేయవచ్చును. మీరు ప్రభువునకు పరిశుద్ధ ప్రజలు. మేకపిల్లను దాని తల్లిపాలలో కలిపి వండరాదు.
22. ప్రతియేడు మీ పొలమున పండు పంటలో పదియవవంతు పన్ను క్రింద జమకట్టుడు.
23. మీరు ప్రభువు తన నామమును ప్రతిష్ఠింప ఎన్నుకొనిన ఏకైక ఆరాధనస్థలమునకు పొండు. అచట ప్రభువు సమక్షమున మీ దశమ భాగములను, ధాన్యము, ద్రాక్షసారాయము, ఓలివుతైలము, మందలలోని తొలిచూలు పిల్లలను భక్షింపుడు. ఇట్లు చేయుదురేని మీరు ఎల్లవేళల మీ ప్రభువుపట్ల భయభక్తులతో మెలిగినట్లగును.
24. యావే తన నామమునకు నివాసస్థానముగా ఎన్నుకొనిన ఆరాధనస్థలము మిక్కిలి దూరముగా నున్నచో, దేవుని అనుగ్రహమువలన మీకు పండిన పంటనుండి మీరు దశమభాగములను అంతదూరము మోసికొనిపోజాలనిచో, ఇట్లు చేయుడు.
25. ఆ ధాన్యమును అమ్మి, సొమ్మును ఆరాధన ప్రదేశమునకు తీసుకొనిపొండు.
26. ఆ డబ్బుతో మీ ఇష్టము వచ్చినవానిని అనగా కోడెలు, గొఱ్ఱెలు, ద్రాక్షసారాయము ఘాటయిన మద్యము మొదలయిన వానిని కొని తెచ్చు కొనుడు. వానినెల్ల మీ కుటుంబములతో దేవునియెదుట భుజించి ఆనందింపుడు.
27. మీతోపాటు మీ నగరములలో వసించు లేవీయులను మరచిపోవలదు. వారికి మీకున్నట్లుగా సొంత ఆస్తి ఏమియు లేదుకదా!
28-29. ప్రతి మూడవయేటి చివర మీకు పండిన పంటనుండి దశమభాగములను కొనివచ్చి నగరమున భద్రపరపుడు. సొంత ఆస్తి ఏమియులేని లేవీయులు, మరియు మీ పట్టణములలో వసించు పరదేశులు, అనాథశిశువులు, విధవలు ఈ ధాన్యమును పంచుకొని ఆరగింతురు. ఇట్లు చేయుదురేని ప్రభువు మీ కష్టమును ఆశీర్వదించి, దీవించును.

Copyright © 2025 Telugu Catholic Bible All Rights Reserved | Website Designed by HyderHub Web Services