ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

యెహోషువ 13

1. యెహోషువ యేండ్లు గడచి ముదుసలి అయ్యెను. యావే అతనితో “నీవు యేండ్లు గడచి ముదుసలివైతివి. ఇంకను జయింపవలసిన దేశములు చాల కలవు.

2. అవి ఏవనగా: ఫిలిస్తీయుల దేశము, గెషూరీయుల దేశము.

3. ఐగుప్తునకు తూర్పున ఉన్న షీహారు నది నుండి ఉత్తరమున ఎక్రోను సరిహద్దు వరకుగల కనానీయుల దేశము. గాజా, అష్దోదు, అష్కేలోను, గాతు, ఎక్రోను అను ఐదు ఫిలిస్తీయ మండలములు. దక్షిణముననున్న అవ్వీయుల దేశము.

4-5. సీదోనీయుల అధీనముననున్న ఆరా నుండి అమోరీయుల సరిహద్దగు అఫేకా వరకు గల కనానీయుల దేశము, లెబానోనునకు తూర్పున, హెర్మోను ప్రక్కన గల బాలాదు నుండి హమతు కనుమ వరకు గల గెబాలీయుల దేశము.

6. లెబానోను నుండి పడమరన మిస్రేఫోత్తు వరకు గల కొండసీమలలో వసించువారినందరను, నీదోనీయులనందరను, నేనే యిస్రాయేలీయుల కన్నుల యెదుటినుండి తరిమివేసెదను. నీవు మాత్రము నేనాజ్ఞాపించినట్లే ఈ నేలను వారసత్వభూమిగా యిస్రాయేలీయులకు పంచియిమ్ము.

7. తొమ్మిది తెగలకు, మనష్షే అర్ధతెగకు ఈ నేలను వారసత్వ భూమిగా పంచియిమ్ము.

8-9. రూబేను, గాదు తెగల వారికి యోర్దానునకు ఆవలివైపున తూర్పు దిక్కున మోషే వారికిచ్చిన నేల లభించెను. అర్నోను ఏటిలోయ అంచుల నున్న అరోయేరు మొదలుకొని, ఆ లోయ మధ్యనున్న పట్టణమునుండి దీబోను వరకు మేడెబా పీఠభూమి నంతయు,

10-12. అమ్మోనీయుల సరిహద్దుదాక హెష్బోనున పరిపాలనము చేసిన అమోరీయుల రాజైన సీహోను సమస్త పట్టణములు గిలాదు, గెషూరీయులయు, మాకాతీయులయు మండలములు, హెర్మోను కొండసీమలు, సలేకా బాషాను దేశమంతయు వారికే లభించెను. రేఫా వంశము వారిలో చివరివాడు మరియు అష్టారోతు, ఎద్రేయి నగరములందు పరిపాలనము చేసిన ఓగు రాజు రాజ్యము కూడ వారికే లభించెను. మోషే ఈ రాజులందరను ఓడించి వారి రాజ్యములను చేకొనెను.

13. అయినను యిస్రాయేలీయులు గెషూరీయులను, మాకాతీయులను పారద్రోలలేదు. కనుక ఆ జాతులవారు నేటికిని యిస్రాయేలీయుల నడుమ జీవించుచునే యున్నారు.

14. లేవీ తెగకు మాత్రము వారసత్వభూమి ఏమియు లభింపలేదు. యిస్రాయేలు దేవుడైన యావే సెలవిచ్చినట్లు ఆయనకు అర్పింపబడు బలులే వారి వారసత్వము.

15. మోషే రూబేను తెగ వారికి వారివారి కుటుంబములను అనుసరించి వారసత్వభూమిని పంచియిచ్చెను.

16. వారికి వచ్చిన భాగము అర్నోను వాగు ఒడ్డుననున్న అరోయేరు నుండి పీఠభూముల లోని పట్టణముమీదుగా మేడెబా వరకు వ్యాపించి యుండెను.

17-21. హెబ్రోను పీఠభూములలోని దీబోను, బమోత్బాలు, బెత్బాల్ మెయోను, యాహసు, కెడెమోతు, మేఫాత్తు, కిర్యతాయిము, సిబ్మా కొండలలోని సేరెత్-షాహారు, బెత్పెయోరు, పిస్గా  కొండ పల్లములు, బెత్-యెషిమోతు పీఠభూమిలోని పట్టణములు, హెష్బోనున వసించు అమోరీయరాజు సీహోను రాజ్యము వారికే వచ్చెను. మోషే ఈ సీహోనును అతనితోపాటు మిద్యాను, ఎవి, రేకెము, సూరు, హూరు, రేబాలను గూడ జయించెను. వీరందరు సీహోనునకు సామంతులై ఆ దేశమున వసించెడివారు.

22. బేయోరు కుమారుడు సోదెగాడు బిలామును మిగిలినవారితోపాటు వధించిరి.

23. రూబేనీయుల భూమి యోర్దానువరకు వ్యాపించి యుండెను. పల్లెలతోను, పట్టణములతోను కలుపుకొని రూబేను వంశముల వారికి లభించిన వారసత్వ భూమియిదియే.

24-27. గాదు తెగకు వారి వారి కుటుంబముల ననుసరించి మోషే భూమి పంచియిచ్చెను. వారికి వచ్చిన భాగములివి: యాసేరు, గిలాదు పట్టణములు, రబ్బాకు తూర్పున అరోయేరు వరకు వ్యాపించిన అమ్మోనీయుల దేశమున సగభాగము, హెష్బోను నుండి రామత్మిస్పే వరకు బెటోనియము వరకుగల భాగములు, మహనాయీము నుండి లోడెబారు వరకు గల భాగములు, లోయలోని బెత్-హారాము, బెత్-నిమ్రా, సుక్కోతు, సాపోను, హెష్బోను రాజు సీహోను రాజ్యమున శేషించిన భాగములు.

28. వారికి పడమటి వైపున యోధాను, ఉత్తరమున కిన్నెరోతు సరస్సు క్రింది భాగములు ఎల్లలు.

29. మనష్షే అర్ధతెగ వారికి వారివారి కుటుంబముల ననుసరించి మోషే వారసత్వభూమిని పంచి ఇచ్చెను.

30. వారిభాగము మహనాయీము, బాషాను ఓగు రాజ్యము. బాషానునందలి యాయీరు మండలమున గల అరువది పట్టణములు.

31. గిలాదున సగము భాగము, బాషానున ఓగు రాజు రాజధానులగు అష్టారోతు, ఎద్రేయి మనష్షే కుమారుడు మాకీరు సంతతి వారికి వచ్చెను. ఈ భూములు మాకీరు సంతతి వారిలో సగము మందికి కుటుంబముల వారిగా సంక్రమించెను.

32. యెరికో ఎదురుగా యోర్దానునకు తూర్పున మోవాబు మైదానములో మోషే యిస్రాయేలు తెగల వారికి పంచి యిచ్చిన భూములివి.

33. కాని లేవీ తెగకు మాత్రము మోషే వారసత్వభూమిని ఈయ లేదు. యిస్రాయేలు దేవుడైన యావే ప్రభువే వారికి వారసత్వమని మోషే చెప్పెను.