1. మీ ప్రజలనుండి ఒక ప్రవక్తకాని, కలలు కనువాడుగాని బయలుదేరి మీకొక అద్భుతకార్యమునో, గురుతునో చూపించి,
2. మీరిదివరకు ఎరుగని దైవములను అనుకరించి పూజించుటకు పోవుదము రండు అని మిమ్ము పురికొల్పవచ్చును.
3. మీరు అతని మాటలుగాని, కలలుగాని లెక్కచేయకుడు. ప్రభువు మీరు తనను పూర్ణహృదయముతోను, పూర్ణ ఆత్మతోను ప్రేమింతురో లేదోయని ఆ నరునిద్వారా పరీక్షించుచున్నాడు.
4. మీరు ప్రభువును అను సరించుచు ఆయనకే భయపడుడు. ఆయన ఆజ్ఞలు పాటించుచు ఆయనకే విధేయులుకండు. ఆ ప్రభువు మాట విని ఆయనను అంటిపెట్టుకొని ఉండవలయును.
5. కాని ఆ ప్రభువు ఆరాధనము నుండి మిమ్ము వైదొలగింపజూచిన ఆ ప్రవక్తను లేక కలలు గాంచు వానిని మాత్రము సంహరింపుడు. మిమ్ము దాస్యగృహమునుండి విడిపించినది, ఐగుప్తునుండి తోడ్కొనివచ్చినది ప్రభువేకదా! ఆ దుష్టుడు ప్రభువు నిర్ణయించిన మార్గమునుండి మిమ్ము పెడత్రోవ పట్టించువాడు. కనుక అతనిని మీ నుండి తొలగింప వలయును.
6. మీ సోదరుడుకాని, కుమారుడు లేక కుమార్తె కాని, ప్రియభార్య కాని, ఆప్తమిత్రుడు కాని మీరు, మీ పూర్వులు ఎరుగని అన్యదైవములను ఆరాధించుటకు పోవుదమురండు అని మిమ్ము రహస్యముగా ప్రోత్సహింపవచ్చును.
7. మీకు దాపులోనున్న ప్రజల దైవములను కాని లేక దూరముననున్న ప్రజల దైవములను కాని ఆరాధించుటకు మిమ్ము పురికొల్పవచ్చును.
8. అట్టివాని ప్రలోభమునకు మీరు లొంగరాదు. వాని మాటలు కూడ వినిపించుకోరాదు. అతనిమీద దయచూపరాదు. అతనిని క్షమింపరాదు, అతని తప్పును కప్పిపుచ్చరాదు.
9. అతనిని వెంటనే వధింపుడు. నీవే అతనిమీద మొదటిరాయి విసురుము. తరువాత ఇతరులు రాళ్ళు విసరుదురు.
10. దాస్యగృహమైన ఐగుప్తునుండి మిమ్ము తోడ్కొని వచ్చిన ప్రభువునుండి మిమ్ము వైదొలగింపజూచెను గనుక వానిని మీరు రాళ్ళతో కొట్టి చంపవలసినదే.
11. అప్పుడు యిస్రా యేలీయులెల్లరు ఇది విని భయపడుదురు. వారు మరల అట్టి చెడ్డపని చేయుటకు సాహసింపరు.
12-13. మీరు ప్రభువు మీకొసగిన పట్టణము లలో వసించునపుడు మీలో కొందరు దుర్మార్గులు క్రొత్త దైవములను పూజించుటకు తమ నగరవాసులను మభ్య పెట్టిరని వార్తలు వినిపింపవచ్చును.
14. అప్పుడు మీరు అసలు సంగతి నిజమో కాదో జాగ్రత్తగా విచారింపుడు. కాని అట్టిపని జరిగినమాట నిజమేనని తెలియవచ్చినచో,
15. ఆ పట్టణ ప్రజలనందరిని కత్తితో వధింపుడు. అచటి పశువులనెల్లచంపుడు.
16. ఆ నగరపౌరుల వస్తువులనెల్ల కొనివచ్చి రచ్చబండ వద్ద కుప్పవేయుడు. ఆ నగరమును దానిలోని సమస్త వస్తువులను శాపము పాలుచేసి ప్రభువునకు దహన బలిగా కాల్చివేయుడు. ఆ పట్టణము శాశ్వతముగా పాడుపడిపోవును. మరల అచట ఎవ్వరును గుమ్మము లెత్తరాదు.
17. అటుల శాపముపాలైన నగరము నుండి మీరేమియు తీసికొనరాదు. అప్పుడు ప్రభువు తన తీవ్రకోపమును ఉపసంహరించుకొని మీమీద కనికరము చూపును. ఆయన మిమ్ము కరుణించి పూర్వము తాను మీ పితరులకు వాగ్దానము చేసినట్లే మిమ్ము అధిక సంఖ్యాకులను చేయును.
18. నేడు నేను మీకు విధించిన ఈ ఆజ్ఞలెల్లపాటించి ప్రభువునకు విధేయులగుదురేని, ఆయన సమక్షమున ధర్మబద్ద ముగా జీవింతురేని, మీరు తప్పక అధిక సంఖ్యాకుల గుదురు.