1. యిస్రాయేలీయులు ఈ క్రింది రాజులను జయించి, వారి రాజ్యములను స్వాధీనము చేసికొనిరి. యోర్దానునకు ఆవలిప్రక్క తూర్పుదిశను, అర్నోను వాగునుండి హెర్మోను కొండవరకును, తూర్పున ఎడారి వరకును వారు జయించిన రాజుల పేరులివి:
2. హెష్బోనున వసించిన అమోరీయురాజు సీహోను. అతని రాజ్యము అర్నోను యేటి అంచుల నున్న అరోయేరునుండి అనగా ఆ యేటిలోయ మధ్య భాగమునుండి గిలాదు సగముభాగమును కలుపుకొని అమ్మోనీయుల సరిహద్దు యబ్బోకు నది వరకును వ్యాపించియుండెను.
3. ఇంకను ఆరబానుండి కిన్నెరోతు సరస్సు తూర్పువరకును, బేత్ యెషిమోతు దిశగా ఆరబా సముద్రము అనగా మృతసముద్రము వరకును, దక్షిణ దిక్కున పిస్గా కొండ చరియల దిగువనున్న బేత్ యెషిమోతు వరకును వ్యాపించియుండెను.
4. అష్దారోతున ఎద్రేయి నందు వసించుచుండిన రేఫా వంశీయుడైన బాషానురాజగు ఓగు.
5. అతడు హెర్మోను, సలేకా సీమలను, గెషూరీయుల, మాకాతీయుల సరిహద్దుల వరకును గల బాషాను సీమను, హెష్బోను రాజగు సీహోను రాజ్యము సరిహద్దు వరకును, సగము గిలాదు ప్రాంతమును పరిపాలించు చుండెను.
6. యావే సేవకుడుగు మోషే, యిప్రాయేలీయులు ఈ రాజులను జయించిరి. యావే సేవకుడుగు మోషే, ఆ రాజ్యములను రూబేను తెగవారికి, గాదు తెగ వారికి, మనష్షే అర్ధతెగవారికి ఇచ్చివేసెను.
7. యెహోషువ, యిస్రాయేలీయులు యోర్దానునకు పడమటి దిక్కున లెబానోను లోయలోని బాల్గాదు నుండి సేయీరువైపు సాగిపోవు హాలకు కొండవరకును పరిపాలించు రాజులను జయించిరి. ఆ రాజుల రాజ్యములను యెహోషువ యిస్రాయేలు తెగలవారికి పంచి యిచ్చెను.
8. పీఠభూములందు, పల్లపునేలలందు, ఆరబా కొండగుట్టలందు, ఎడారియందు, నేగెబునందుండిన హిత్తీయులు, అమోరీయులు, కనానీయులు, పెరిన్సీయులు, హివ్వీయులు, యెబూసీయులు మొదలగు జాతులవారి సీమలందు యెహోషువ జయించిన రాజుల పేరులివి:
9-24. యెరికో, బేతేలు వద్దగల హాయి, యెరూషలేము, హెబ్రోను, యార్మూతు, లాకీషు, ఎగ్లోను, గేసేరు, దెబీరు, గెదెరు, హార్మా, అరదు, లిబ్నా, అదుల్లాము, మక్కేడా, బేతేలు, తాప్పువా, హేఫేరు, ఆఫెకు, షారోను, మాదోను, హాసోరు, షిమ్రోను, ఆక్షపా, తానాకు, మెగిద్ధో, కెదేషు, కర్మెలులో యోక్నియాము, దోరు కొండ సీమలలోని దోరు, గిల్గాలులోని గొయ్యీము, తీర్సా అను నగరములను ఏలినరాజులు; వీరందరునుకలిసి ముప్పది యొక్కరు. ఈ రాజులు ఒక్కొక్క నగరమునకు ఒక్కొక్కరు చొప్పున జయింపబడిరి.