1. మీ పితరుల దేవుడైన ప్రభువు మీరు స్వాధీనము గావించుకొన మీకిచ్చిన నేలమీద జీవించి నంతకాలము మీరు పాటింపవలసిన కట్టడలు, ఆజ్ఞలివి:
2. మీరు జయింపబోవు మండలములలోని ప్రజలు పర్వతములమీదను, తిప్పలమీదను, తోపుల లోను నెలకొల్పిన ఉన్నత స్థలములనెల్ల కూలద్రోయుడు.
3. వారి బలిపీఠములను, పవిత్ర శిలాస్తంభములను పడగొట్టుడు. ఆ షేరాదేవత కొయ్యకంబములను నరికివేయుడు. ఆ జనులు పూజించు విగ్రహములను తగులబెట్టుడు. వాని అడపొడ కానరాకుండచేయుడు.
4. కాని మీ ప్రభువైన యావేపట్ల మాత్రము ఇట్లు ప్రవర్తింపరాదు.
5. మీ దేవుడైన యావే మీ సమస్త తెగలలో తన నామమును స్థాపించుకొనుటకు నివాసస్థానముగా ఎన్నుకొను తావును వెదకి అక్కడికే యాత్రలు చేయుచుండవలయును.
6. మీ దహన బలులు, సామాన్యబలులు, దశమభాగములు, కానుకలు, మ్రొక్కుబడులు, మీ స్వేచ్ఛార్పణలు, మీ మందలలోని తొలిచూలు పిల్లలు, అన్నిటిని అచటనే అర్పింపవలయును.
7. ఆ తావుననే, మిమ్ము దీవించు ప్రభువు సన్నిధిలోనే, మీరు పండించుకొనిన పంటను కుటుంబసమేతముగా భుజించి ఆనందింపుడు,
8. ఇపుడు మనమిక్కడ చేయుచున్నట్లు మీలో ప్రతివాడును తనకిష్టము వచ్చినట్లు ప్రభువును ఆరాధించకూడదు.
9. ప్రభువు మీకు ఈయనున్న మండలమును, మీరు సంతోషముగా వసించు దేశమును, మీరింకను స్వాధీనము చేసికొనలేదు.
10. మీరు యోర్దాను నదిని దాటినపిదప ప్రభువు మీకు ఈయనున్న దేశమును ఆక్రమించుకొని అచట వసింతురు. ఆయన శత్రువులనుండి మిమ్ము కాపాడగా మీరు సురక్షితముగా జీవింతురు.
11. దేవుడైన యావే తన నామమునకు నివాసముగా ఏర్పరచుకొనిన తావునకు మాత్రమే నేను మిమ్ము ఆజ్ఞాపించిన వానినన్నింటిని, అనగా మీ దహన బలులును, ఇతరబలులును, దశమభాగములును, కానుకలును, దేవునకు మ్రొక్కుకొను మీ శ్రేష్ఠమైన మ్రొక్కుబడులను మీరు కొనిరావలయును.
12. మీరు, మీ పిల్లలు, మీ సేవకులు, మీలో ఏ భాగమైనను భుక్తమైనను పొందక మీ గ్రామమునుండి వచ్చిన లేవీయులతోకూడ అచట ప్రభువుసన్నిధిలో ఆనందింపుడు. ఆ లేవీయులకు సొంత ఆస్తి ఏమియు లేదని గుర్తుంచుకొనుడు.
13. దహనబలులను మీ ఇష్టము వచ్చిన చోటులందు అర్పింపరాదు.
14. మీలో ఒక తెగవారు వసించు మండలమున ప్రభువు ఎన్నుకొను ఏకైక ప్రదేశముననే వానిని అర్పింపవలయును. అచటనే నేను ఆజ్ఞాపించిన ఆరాధనమంతయు జరుగ వలయును.
15. అయినను మీరు వసించు చోటులందెల్ల పశువులను చంపి ఇష్టము వచ్చినట్లు భుజింపవచ్చును. ప్రభువు మీకు దయచేసినన్ని పశువులను చంపి తినవచ్చును. మీరు శుద్ధి చేసికొనిగాని, చేసికొనకగాని ఆ జంతువులనెల్ల జింకనో, దుప్పినో ఆరగించినట్లుగా ఆరగింపవచ్చును.
16. కాని వాని నెత్తురుమాత్రము మీకు ఆహారము కారాదు. దానిని నీటివలె భూమి మీద కుమ్మరింపుడు.
17. మీరు ప్రభువునకు అర్పించిన దానిని మీ ధాన్యమున దశమభాగములుకాని, మీ ద్రాక్షసారాయము ఓలివు నూనె కాని, మీ మందలలో తొలిచూలు పిల్లలుకాని, మీరు మ్రొక్కుబడి చేసికొన్న వస్తువులు కాని, స్వేచ్ఛార్పణములుకాని, మరి ఏ కానుకలు కాని మీ నగరములలో భుజింపరాదు.
18. మీరు, మీ పిల్లలు, మీ సేవకులు, మీ నగరములలో వసించు లేవీయులు, ప్రభువు సమక్షమున, ఆయన తన ఆరాధన స్థలముగా ఎంచుకొనిన ప్రదేశమున మాత్రమే పై వస్తువులను భుజింపుడు. మీరు పండించుకొనిన పంటలను దేవుని సమక్షమున భుజించి ఆనందింపుడు.
19. మీరు ఆ దేశమున జీవించినంతకాలము లేవీయులను కనిపెట్టి ఉండుడు.
20. ప్రభువు మాటయిచ్చినట్లే మీ దేశమును సువిశాలము చేసినపిదప మీరు కోరుకొనినపుడెల్ల మస్తుగా మాంసము భుజింపుడు.
21. మీ దేవుడైన యావే తన నామమును స్థాపించుకొనుటకు ఎన్ను కొనుగ్ధలము మీకు దూరముగా నున్నందున మీరచటికి పోలేనిచో, మీరు కోరుకొనినపుడెల్ల యావే మీకు దయచేసిన పశువులను మీ నగరములందే వధింపవచ్చును. పైన నేను విధించిన నియమము ప్రకారము మీరు వసించు తావుననే పశువులను చంపి మీ ఇష్టము వచ్చినంత మాంసమును మీ ఇంటనే భుజింపవచ్చును.
22. శుద్ది చేసికొనినవారు, చేసికొననివారు ఎల్లరును, జింకనో, దుప్పినో భుజించినట్లుగా ఆ పశువుమాంసమును ఆరగింపవచ్చును.
23. మీరు ఆ పశువులనెత్తురు మాత్రము ఆహారముగా గైకొనరాదు. నెత్తుటిలో ప్రాణముండును. మీరు జంతువు మాంసముతో పాటు దాని ప్రాణమును గూడ భుజింపరాదు.
24. కనుక నెత్తుటిని భోజనమునకు వాడుకొన రాదు. దానిని నీటివలె నేలమీద కుమ్మరింపుడు.
25. మీరు ఈ ఆజ్ఞలను పాటింతురేని ప్రభువు మీవలన సంతుష్టుడగును. అప్పుడు మీకును, మీ సంతానము నకును క్షేమము కలుగును.
26. కాని మీకు నియమింపబడిన బలులు, మ్రొక్కుబడులు మాత్రము ప్రభువు ఎన్నుకొనిన ఏకైక ఆరాధనస్థలముననే చెల్లింపుడు.
27. మీ దహనబలులను అచట ప్రభువు బలిపీఠము మీద అర్పింపుడు. ఇతర బలులుకూడ అచటనే అర్పింపుడు. వానిని అర్పించునపుడు మీరు పశువుల మాంసమును భుజింపవచ్చును. కాని వాని నెత్తుటిని మాత్రము బలిపీఠముమీద కుమ్మరింపవలయును.
28. నేను మీకు విధించిన ఆజ్ఞలన్నిటిని జాగ్రత్తగా పాటింపుడు. మీ ప్రభువు ఎదుట ధర్మబద్దముగాను, న్యాయ సమ్మతముగాను ప్రవర్తింతురేని, మీకును మీ సంతతికిని క్షేమము కలుగును.
29. మీరు ఆ దేశమును ఆక్రమించుకొనినపుడు ప్రభువు అచటి జాతులను నాశనము చేయును. మీరు వారి దేశమును స్వాధీనముచేసికొని అచటవసింతురు.
30. ప్రభువు వారిని నాశనము చేసిన పిమ్మట మీరు వారి మతాచారములను అనుసరింపరాదు. అటుల చేయుదురేని మీరు ఉరిలో చిక్కుకొందురు. కనుక ఆ ప్రజలు తమ దైవములను ఎట్లు ఆరాధించిరా అని విచారింపబోకుడు. మీరును అటులనే ఆరాధింపవచ్చును గదా అని భావింపకుడు.
31. ఆ జాతులు తమ దైవములను పూజించినట్లుగా మీరు యావేను కొలువరాదు. వారు తమ ఆరాధనములో ప్రభువు అనహ్యించుకొను ఏవగింపు పనులను చేయుదురు. తమ పిల్లలను మంటలో త్రోసి దైవములకు దహన బలిగా సమర్పింతురు.
32. నేను మీకు విధించిన ఆజ్ఞలెల్ల పాటింపుడు. మీరు వానికి ఏమియు చేర్పకుడు, వానినుండి ఏమియు తొలగింపకుడు.