ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

యెహోషువ 11

1-3. హాసోరు రాజగు యాబీను యెహోషువ విజయమునుగూర్చి విని, మాడోను రాజగు యోబాబు నకు, షిమ్రోను రాజునకు, అక్షాపు రాజునకు, ఉత్తర దేశపు పీఠభూములందలి రాజులకు, కిన్నెరోత్తుకు దక్షిణమున నున్న లోయలోని రాజులకు, డోరుసీమకు ప్రక్క మన్యములలో పల్లములలో పరిపాలించు రాజులకు, తూర్పు పడమరలందు వసించు కనానీయులకు, పీఠభూములందు వసించు అమోరీయులకు, హివ్వీయులకు, పెరిస్సీయులకు, యెబూసీయులకు, మిస్ఫాయందలి హెర్మోనున వసించు హిత్తీయులకు కబురు పంపెను.

4. వారందరు తమ సైన్యములతో, రథములతో, గుఱ్ఱములతో సముద్రతీరమునందలి ఇసుక రేణువులవలె అసంఖ్యాకులుగా కదలివచ్చిరి.

5. ఆ రాజులందరు విడిది తావును నిర్ణయించుకొని మేరోము సరస్సునొద్ద దండు దిగి, యిస్రాయేలీయులతో పోరాడుటకు సంసిద్ధులైరి.

6. యావే యెహోషువతో “నీవు ఈ జనమును జూచి భయపడవలదు. రేపు ఈపాటికి వీరెల్లరు యిస్రాయేలీయుల చేతికి చిక్కిచత్తురు. నీవు వారి గుఱ్ఱముల గుదికాలి నరములు తెగగొట్టి వారి రథములను కాల్చివేయుదువు” అని చెప్పెను.

7. యెహోషువ అతని వీరులు మేరోము సరస్సు నొద్దకు వచ్చి అకస్మాత్తుగా శత్రువుల మీదపడిరి.

8. యావే వారిని యిప్రాయేలీయులకు అప్పగించెను. యిస్రాయేలీయులు శత్రువులను ఓడించి తరిమిరి. పెద్దసీదోను వరకు, పడమట మిస్రేఫోత్తుమాయీము వరకు, తూర్పున మిస్పాలోయ వరకు శత్రువులను తరిమికొట్టిరి. వారిలో ఒక్కరిని గూడ మిగులనీయకుండ అందరిని మట్టుపెట్టిరి.

9. యావే ఆజ్ఞాపించినట్లే యెహోషువ వారి గుఱ్ఱముల గుదికాలి నరములను తెగగొట్టి రథములను కాల్చి వేసెను.

10. అంతట యెహోషువ తిరిగివచ్చి హాసోరును జయించి దానిని ఏలు రాజును కత్తికి బలిచేసెను. పై రాజ్యములన్నిటికి పూర్వము హాసోరే రాజధాని.

11. వారు అచటి ప్రాణులనెల్ల శాపముపాలుచేసి వధించి నగరమును కాల్చివేసిరి.

12. యెహోషువ ఆ రాజనగరములను వానినేలు రాజులను ఓడించెను. దేవుని సేవకుడగు మోషే ఆజ్ఞాపించినట్లుగనే వారిని అందరను శాపముపాలు చేసి కత్తివాదరకెరచేసెను.

13. అయితే యెహోషువా హాసోరును కాల్చి వేసెను గాని, మెట్ట ప్రాంతములలో ఉన్న నగరములను వేనిని గూడ యిస్రాయేలీయులు కాల్చివేయలేదు.

14. ఈ నగరములనుండి వచ్చిన కొల్లసొమ్మును, పశువులను యిస్రాయేలీయులు చేకొనిరి. కాని అచటి జనులనందరిని కత్తివాదరకెరచేసి సర్వనాశనము చేసిరి. ఊపిరియున్న ప్రాణియేదియు మిగులలేదు.

15. యావే మోషేకిచ్చిన ఆజ్ఞలనెల్ల మోషే యెహోషువ కొసగెను. అతడు ఆ ఆజ్ఞలనన్నిటిని వీసమెత్తుకూడ మీరలేదు.

16. ఆ దేశమంతయు యెహోషువనకు స్వాధీనమయ్యెను. పీఠభూములు, దక్షిణసీమలు, గోషెను మండలము, పల్లపు నేలలు, ఎడారి, ఎగువనేలలు, దిగువనేలలన్నియు యెహోషువ వశమయ్యెను.

17. సెయీరు వైపుగా పోవు హాలాకు కొండల నుండి హెర్మోను కొండల క్రిందనున్న బాలాదు లోయ లోని లెబానోను వరకుగల రాజులందరిని జయించి వధించెను.

18. ఈ రాజులతో యెహోషువ చాల కాలము యుద్ధము చేసెను.

19. హివ్వీయుల గిబ్యోను నగరము తప్ప ఒక్కపట్టణము కూడా యిస్రాయేలీయులతో సంధిచేసికొనలేదు. ఆ పట్టణములన్నిటిని వారు యుద్ధమున జయించిరి.

20. ఈ ప్రజలందరు యిస్రాయేలీయులతో యుద్ధమునకు పూనుకొన చేయనెంచి యావే వారి గుండెలను రాయిచేసెను. ప్రభువు మోషేతో సెలవిచ్చినట్లు ఆ ప్రజలను కనికరింపక సర్వనాశనము చేయవలయుననియే యావే తలంపు.

21. తరువాత యెహోషువ పీఠభూముల నుండియు, హెబ్రోను, దెబీరు, ఆనాబు నగరముల నుండియు యూదా యిస్రాయేలు పీఠభూముల నుండి అనాకీయులనందరను తుడిచివేసెను. వారిని వారి పట్టణములను శాపముపాలు చేసెను.

22. గాజా, గాతు, ఆష్దోదులందు తప్ప యిస్రాయేలు దేశమున అనాకీయులలో ఒక్క పురుగైనను మిగులలేదు.

23. యావే మోషేతో సెలవిచ్చినట్లే యెహోషువ ఆ దేశమునంతటిని వశపరచుకొనెను. అతదు ఆ దేశమును యిస్రాయేలీయులకు తెగలవారిగా వారసత్వభూమిగా పంచియిచ్చెను. దానితో యుద్ధములు సమసిపోయి, దేశమున శాంతి నెలకొనెను.

Copyright © 2025 Telugu Catholic Bible All Rights Reserved | Website Designed by HyderHub Web Services