1. మీ ప్రభువైన యావేను ప్రేమించి ఆయన ఆజ్ఞలు, విధులు, కట్టడలు ఎల్లవేళల పాటింపుడు.
2. ఇన్నాళ్ళు ప్రభువునుండి శిక్షణ పొందినది మీరేగాని మీ తనయులు కాదని గుర్తింపుడు. మీరు ఆ ప్రభువు మహత్తును, ఆయన బాహుబలమును, చాచినచేతిని తెలిసికొంటిరి.
3. ఫరోను, ఐగుప్తీయులను అణచి వేయుటకు ఆయన చేసిన అద్భుతకార్యములను కన్నులార చూచితిరి.
4. ఆ ప్రభువు ఐగుప్తు సైనికులను వారి రథములతోను, గుఱ్ఱములతోను మట్టుపెట్టెను. ఆ యోధులు మిమ్ము వెన్నాడుచుండగా ప్రభువు వారిని రెల్లు సముద్రమున ముంచివేసెను. నేటివరకును వారిజాడ తెలియలేదు.
5. మీరిక్కడికి చేరక ముందు ఆయన ఎడారిలో ఏమి చేసెనో మీకెల్లరకు బాగుగా తెలియును.
6. రూబేను తెగకు చెందిన ఎలీయాబు కుమారులు దాతాను, అబీరాములను ప్రభువు ఏమి చేసెనో జ్ఞప్తికి తెచ్చుకొనుడు. యిస్రాయేలీయులెల్లరు చూచుచుండగనే నేల నోరువిప్పి వారి కుటుంబము లను, గుడారములను వారి సమస్తవస్తువులను మ్రింగి వేసెను.
7. ప్రభువు చేసిన మహాకార్యములన్నియు మీరు స్వయముగా వీక్షించిరి.
8. నేడు నేను ఆదేశించు ఆజ్ఞలెల్ల మీరు పాటింప వలయును. అట్లు చేయుదురేని మీరు బలముకలిగి నదినిదాటి ఆ దేశమును స్వాధీనము చేసికొనుటకు సమర్థులగుదురు
9. ప్రభువు మీ పితరులకు, వారి సంతతికి దయచేయుదునని వాగ్దానముచేసిన పాలు తేనెలు జాలువారు దేశమున చిరకాలము జీవింతురు.
10. మీరు స్వాధీనము చేసికొనబోవు నేల ఇప్పుడు మీరు వెడలివచ్చిన ఐగుప్తుదేశము వంటిది కాదు. మీరు అచటి పొలమున పైరు వేసినపుడు కూరగాయల తోటకువలె, కాళ్ళతో నీరు పెట్టెడివారు.
11. కాని యిపుడు మీరు ప్రవేశింపబోవు దేశము కొండలతోను, లోయలతోను నిండినది. అచట వానలే నేలను తడుపును.
12. ప్రభువు ఆ నేలను పరామర్శించు చుండును. సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతము వరకు ప్రభువు ఆ నేలను వీక్షించుచుండును.
13. కనుక నేడు నేను మీకు ఆదేశించు ఆజ్ఞలెల్ల పాటింపుడు. ఆ ప్రభువును నిండుమనసుతో ప్రేమించి సేవింపుడు.
14. అప్పుడు ఆయన మీకు సకాలమున తొలకరి వానలును, కడవరివానలును కురిపించును. ఆ ఫలితముగా మీకు ధాన్యము, ద్రాక్షసారాయము, ఓలివు తైలము సమృద్ధిగా లభించును.
15. మీ పొలమున పశుగ్రాసము దట్టముగా పెరుగును. మీరు కోరుకొన్న భోజనపదార్థములెల్ల లభించును.
16. కాని మీరు మీ మనసున అన్యదైవతములను ఆరాధించి ప్రభువునుండి వైదొలగుదురేమో జాగ్రత్త!
17. అటుల చేసినచో ప్రభువు కోపము మీపై రగుల్కొనును. ఆయన వానలు కురిపింపడు. పొలము పంటలుపండని కారణమున ఆ సారవంతమైన నేలమీద కూడ మీరెల్లరు సత్వరమే నాశనమగుదురు.
18. నేడు నేను మీకు ఆదేశించిన ఆజ్ఞలను మీ హృదయములో నిలుపుకొనుడు. వీనిని జ్ఞాపకార్థముగా మీ చేతులమీద సూచకములుగా, మీ నొసటిమీద బాసికముగా కట్టుకొనుడు.
19. ఈ ఆజ్ఞలను మీ పిల్లలకు బోధింపుడు. మీరు ఇంటనున్నను, బయట నున్నను, శ్రమచేయుచున్నను, విశ్రాంతి తీసికొను చున్నను వీనిని గూర్చి ముచ్చటింపుడు.
20. మి ద్వారబంధములమీదను, నగరద్వారముల మీదను వీనిని వ్రాసిపెట్టుకొనుడు.
21. ఇట్లు చేయుదురేని ప్రభువు మీ పితరులకు వాగ్దానము చేసిన నేలమీద మీరును, మీ పిల్లలును భువిపై ఆకాశము నిలిచి యున్నంతకాలము చీకుచింతలేకుండ జీవింతురు.
22. నేను మీకు ఉపదేశించిన ఆజ్ఞలనెల్ల జాగ్రత్తగా పాటింపుడు. ప్రభువును ప్రేమించి ఆయన ఆజ్ఞలను చేకొని ఆయన మీద నమ్మిక చూపుడు.
23. అప్పుడు ప్రభువు ఈ జాతులనెల్ల మీ ఎదుటినుండి తరిమివేయును. మీకంటె అధిక సంఖ్యాకులు, బలాధ్యు లైన జాతులను మీరు స్వాధీనము చేసుకొందురు.
24. మీరు పాదములు మోపిన నేలయెల్ల మీవశమగును. దక్షిణమున ఎడారినుండి ఉత్తరమున లెబానోను కొండవరకును, తూర్పున యూఫ్రటీసు నదినుండి పడమరయందు మధ్యధరాసముద్రము వరకును, మీ దేశము విస్తరిల్లును.
25. ఏ నరుడు మిమ్మెదిరింప జాలడు. ప్రభువు మాట ఇచ్చినట్లే మీరు వెళ్ళిన తావులందెల్ల ప్రజలు మిమ్ము చూచి భయపడుదురు.
26. మీరు ఆశీర్వాదమును, శాపమును గూడ పొందుమార్గమును నేడు మీకు చూపుచున్నాను.
27. నేను మీకు ఆదేశించిన ప్రభువు ఆజ్ఞలు పాటింతురేని మీరు ఆశీర్వాదము పొందుదురు.
28. కాని ప్రభువు ఆజ్ఞలను ధిక్కరించి నేను చూపిన మార్గమునుండి వైదొలగి ఇదివరకు మీరెరుగని అన్యదైవముల పూజింతురేని, తప్పక శాపముపొందుదురు.
29. ప్రభువు తాను వాగ్దానముచేసిన నేలకు మిమ్ము తోడ్కొనిపోయినపుడు మీరు పై ఆశీర్వాద వచనములను గెరిసీము కొండమీదనుండి, పై శాప వచనములను ఏబాలుకొండ మీదినుండి ఎల్లరకును ప్రకటింపుడు.
30. ఈ కొండలు రెండు యోర్దాను నదికి పశ్చిమమున కనానీయులు వసించు దేశమున కలవు. మరియు అవి గిల్గాలు పట్టణమునకు చెంతగల మోరే క్షేత్రములోని సింధూరవృక్షములకు దాపు లోనేయున్నవి.
31. మీరు నదిని దాటి ప్రభువు మీకిత్తునని బాసచేసిన దేశమును స్వాధీనము చేసికొన బోవుచున్నారు. మీరు ఆ నేలను ఆక్రమించుకొని అచట వసింతురు.
32. అప్పుడు నేడు నేను మీకు విధించిన కట్టడలను, ఆజ్ఞలనెల్ల పాటింపుడు.