ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

యెహోషువ 10

1. యెహోషువ హాయి పట్టణమును జయించి, దానిని శాపముపాలు చేసెననియు, ఆ పట్టణమునకు దాని రాజునకు, యెరికో పట్టణమునకు దాని రాజునకు పట్టినగతియే పట్టెననియు యెరూషలేము రాజైన అదోనిసెదెకు వినెను. గిబ్యోను నివాసులు యిస్రాయేలీయులతో సంధి చేసికొని వారితో చేతులు కలిపిరని తెలిసికొనెను.

2. గిబ్యోను పెద్దపట్టణము రాజనగరము వంటిది. హాయి పట్టణముకంటె పెద్దది. ఆ నగర వాసులందరు శూరులు. అటువంటి పట్టణమే లొంగి పోవుట చూచి ఎల్లరును మిక్కిలి భయపడిరి.

3-4. కనుక యెరూషలేమురాజగు అదోనిసెదెకు, హెబ్రోను రాజగు హోహామునకు, యార్మూతురాజగు పీరామునకు, లాకీషురాజగు యాఫియాకు, ఎగ్లోను రాజగు దెబీరునకు “మీరు నాకు సహాయముగారండు. గిబ్యోను యెహోషువతోను, యిస్రాయేలీయులతోను సంధిచేసి కొనెను. గనుక మనమందరము కలసి గిబ్యోను పట్టణమును జయింతము” అని వార్త పంపెను.

5. ఆ రీతిగా అమోరీయరాజులు ఐదుగురు అనగా యెరూషలేము, హెబ్రోను, యార్మూతు, లాకీషు, ఎగ్లోను రాజులు ఏకమై సైన్యములతో వచ్చి గిబ్యోను వద్ద దండుదిగి పట్టణమును ముట్టడించిరి.

6. గిబ్యోను పౌరులు గిల్గాలు శిబిరముననున్న యెహోషువకు కబురంపి "మమ్ము గాలికి వదలవలదు. నీవు వెంటనే వచ్చి మమ్ము రక్షింపుము. మాకు సాయపడుము. పర్వత ప్రాంతములలో నివసించుచున్న అమోరీయరాజులందరు మాకు విరోధముగా ఏకమై వచ్చియున్నారు” అని వర్తమానము పంపిరి.

7. ఆ కబురు వినగానే యెహోషువ తన వీరులనెల్ల ప్రోగు చేసికొనివచ్చెను.

8. యావే యెహోషువతో “నీవు శత్రువులకు భయపడవలదు. నేను వారిని నీ వశము చేసితిని. వారిలో ఏ ఒక్కరును నిన్ను ఎదిరింపజాలరు” అని సెలవియ్యగా,

9. యెహోషువ గిల్గాలు నుండి రాత్రి అంతయు నడచివచ్చి అకస్మాత్తుగా శత్రువుల మీదపడెను.

10. యావే శత్రువులకు యిస్రాయేలీయులనిన భయము పుట్టించెను. ఆయన గిబ్యోనున వారిని నిర్మూలించెను. బేతహోరోను పల్లము వరకు శత్రువులను తరిమెను. అసేకా, మక్కేడా నగరముల వరకు వెంటాడి యోధులు వారిని చిత్రవధ చేసిరి.

11. అమోరీయులు యిస్రాయేలీయులకు జడిసి బేత్ హోరోను పల్లము మీదుగా పారిపోవుచుండగా, యావే అసెకా వరకు వారిపై పెద్ద వడగండ్లవాన కురిపించెను. యిస్రాయేలీయుల కత్తివాతబడి చచ్చినవారికంటె ఆ వడగండ్ల వానవలన చచ్చినవారే ఎక్కువ.

12. యావే అమోరీయులను యిస్రాయేలీయుల చేతికి అప్ప గించిన దినముననే యెహోషువ యావేను ప్రార్ధించెను. అతడు యిస్రాయేలీయులు వినుచుండగా ఇట్లనెను: “సూర్యుడా! నీవు గిబ్యోను పట్టణముపై నిలువుము; చంద్రుడా! నీవు అయ్యాలోను లోయమీద ఆగుము.”

13. ఆ రీతిగనే యిస్రాయేలు శత్రువుల మీద బడి పగతీర్చుకొనునంత వరకు సూర్యుడు నిలిచెను, చంద్రుడు ఆగెను. ఈ సంగతి 'నీతిమంతుల గ్రంథము' లో వ్రాయబడియున్నది. ఆ విధముగా సూర్యుడు మింటి నడుమ ఆగిపోయి, ఒక రోజు వరకు అస్తమించ లేదు. 

14. దేవుడు నరుని ఆజ్ఞకు బద్దుడైన ఆ దినము వంటిదినము మరియొకటిలేదు. ఇక ఉండబోదు. నాడు యావే యిస్రాయేలీయుల పక్షమున యుద్ధము చేసెను.

15. అటు తరువాత యెహోషువ తన సైన్యముతో గిల్గాలు శిబిరమునకు తిరిగివచ్చెను.

16. శత్రురాజులు ఐదుగురు పారిపోయి మక్కేడా గుహలో జొరబడిరి.

17. వారు మక్కేడా గుహలో దాగుకొనియున్నారని యెహోషువకు తెలుపబడినపుడు

18. అతడు గుహముఖమున పెద్దరాళ్ళను దొర్లించి భటులను కాపు పెట్టుడని ఆజ్ఞాపించెను.

19. పైగా యెహోషువ తన జనముతో “మీరు ఊరకుండక శత్రువుల వెంటబడి తరుముడు. పారిపోవుచును వారిని పట్టి చంపుడు. వారిని మరల పట్టణములలో ప్రవేశింపనీయకుడు. యావే వారిని మీ చేతికి అప్పగించెను” అని చెప్పెను.

20. యెహోషువ యిస్రాయేలీయులు, అమోరీయులను చాలమందిని మట్టుబెట్టి, వారిలో కట్టకడపటి వారిని వధించుచుండగా తప్పించుకొనిపోయిన వారు కొంతమంది తమ కోటలలో దూరిరి.

21. యిస్రాయేలీయులందరు చెక్కుచెదరకుండ మక్కేడా వద్ద విడిదిచేసియున్న యెహోషువ వద్దకు మరలివచ్చిరి. శత్రువులెవరును వారిని పల్లెత్తిమాట అనుటకైన సాహసింపలేదు.

22. యెహోషువ అనుచరులతో “మక్కేడా గుహ ముఖమున పెద్దరాళ్ళను తొలగించి ఆ ఐదుగురు రాజులను నా కడకు కొనిరండు” అని చెప్పెను.

23. వారు యెరూషలేము, హెబ్రోను, యార్మూతు, లాకీషు, ఎగ్లోను రాజులు ఐదుగురను యెహోషువ కడకు కొనివచ్చిరి.

24. యెహోషువ ప్రజలందరిని సమావేశపరచి తనతో నిలిచి యుద్ధముచేసిన ప్రజా నాయకులతో “మీరిటువచ్చి వీరి మెడలపై పాదములు మోపుడు” అని చెప్పెను. వారు ముందుకు వచ్చి శత్రురాజుల మెడలపై పాదములు పెట్టిరి.

25. యెహోషువ వారితో “మీరు భయపడవలదు. ఆశ్చర్యపడవలదు. ధైర్యముతో, బలముతో పోరాడుడు. మీరు ఎదిరించి పోరాడు శత్రువులనందరిని ప్రభువు ఈ రీతిగనే నాశనము చేయును” అని చెప్పెను.

26. యెహోషువ ఆ ఐదుగురు రాజులను వధించి, ఐదు చెట్లకు వ్రేలాడదీయించెను. సాయంకాలమగువరకు, వారు ఆ చెట్లనుండి వ్రేలాడిరి.

27. ప్రొద్దుగ్రుంకిన పిదప యెహోషువ ఆనతి యీయగా రాజుల శవములను చెట్లనుండి క్రిందికి దింపి మునుపు వారు దాగుకొనిన కొండగుహలో పడవేసిరి. గుహముఖమున పెద్దరాళ్ళను దొర్లించిరి. ఆ రాళ్ళు నేటికిని అచటనే యున్నవి.

28. ఆ దినముననే యెహోషువ మక్కేడాను జయించెను. ఆ పట్టణ ప్రజలను, దానిని ఏలు రాజును కత్తివాదరకు ఎరచేసెను. అచటనున్న ప్రతి ప్రాణిని శాపముపాలు చేసెను. కనుక ఎవరును తప్పించు కోలేదు. మక్కేడా రాజుకును యెరికో రాజునకు పట్టిన గతియే పట్టెను.

29. యెహోషువ అతని అనుచరులు మక్కేడానుండి లిబ్నాకు వచ్చి ఆ పట్టణమును ముట్టడించిరి.

30. యావే ఆ పట్టణమును దానిని పాలించు రాజును యిస్రాయేలు వశముచేసెను. యిస్రాయేలీయులు అచటనున్న ప్రతి ప్రాణిని కత్తివాదరకు ఎర చేసిరి. కనుక ఎవరును తప్పించుకోలేదు. ఆ పట్టణపు రాజునకును యెరికో రాజునకు పట్టిన గతియేపట్టెను.

31. యెహోషువ తన అనుచరులతో లిబ్నా నుండి లాకీషుకు వచ్చి అచట దండు విడిచి పట్టణమును ముట్టడించెను.

32. యావే ఆ పట్టణమును యిస్రాయేలీయుల వశముచేయగా వారు రెండవ రోజున దానిని జయించిరి. లిబ్నా యందువలె లాకీషున కూడ ప్రతి ప్రాణిని కత్తివాదరకు ఎరచేసిరి.

33. గేసేరు రాజు హోరాము, లాకీషుకు తోడ్పడవచ్చెను. కాని యెహోషువ ఆ రాజును ససైన్యముగా మట్టుపెట్టెను. వారిలో ఒక్కరును మిగులలేదు.

34. యెహోషువ అతని అనుచరులు లాకీషు నుండి ఎగ్లోనునకు వెళ్ళి ఆ పట్టణమును ముట్టడించిరి.

35. ఆ రోజుననే పట్టణమును స్వాధీనము చేసికొని సర్వనాశనము చేసిరి. లాకీషునవలె అచట నున్న ప్రతిప్రాణియు శాపముపాలయ్యెను.

36. యెహోషువ అతని అనుచరులు ఎగ్లోను నుండి హెబ్రోనునకు వచ్చి ఆ పట్టణమును ముట్టడించిరి.

37. నగరమును స్వాధీనము చేసికొని రాజును, ప్రజలను, దాని అధీనములోనున్న గ్రామములను కత్తివాదరకు ఎరచేసిరి. ఎగ్లోనులోవలె హెబ్రోనున గూడ ఎవరిని మిగులనీయలేదు. పట్టణమును, అందు వసించు ప్రాణులను సర్వనాశనము చేసిరి.

38. యెహోషువ అనుచరులతో దెబీరునకు వచ్చి పట్టణమును ముట్టడించెను.

39. ఆ పట్టణమును, దానిని పాలించు రాజును, దాని అధీనముననున్న గ్రామములను వశముచేసికొని కత్తివాదరకు ఎర చేసెను. అందువసించు ప్రాణులన్నియు శాపము పాలయ్యెను. హెబ్రోనునకు పట్టిన గతియే మరియు లిబ్నాకును దాని రాజునకును పట్టినగతియే దెబీరునకు దాని రాజునకు కూడ పట్టెను.

40. ఈ రీతిగా యెహోషువ పీఠభూములను, దక్షిణ భూభాగములను, పల్లపునేలలను, మన్యపు నేలలను వానిని పాలించు రాజులను స్వాధీనము చేసికొనెను. యిస్రాయేలు దేవుడైన యావే ఆజ్ఞాపించినట్లే ఎవ్వరిని తప్పించుకోనీయకుండ అందరిని శాపము పాలుచేసెను.

41. కాదేషుబార్నెయా నుండి గాసా వరకు, గిబ్యోను వరకు గల గోషేను మండలమును యెహోషువ స్వాధీనము చేసికొనెను.

42. యావే యిస్రాయేలీయుల పక్షమున పోరాడెను గనుక యెహోషువ పైరాజులను వారి రాజ్యములను ఒక్క దండయాత్రలోనే జయించెను.

43. అటుపిమ్మట అతడు, అతని అనుచరులు గిల్గాలునందలి శిబిరమును చేరుకొనిరి.