ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

ద్వితియోపదేశకాండము 1

1. యిస్రాయేలీయులు యోర్దాను నదికి తూర్పు వైపున ఎడారియందు వసించుచుండగా మోషే పలి కిన పలుకులివి. అప్పుడు వారు సూఫు చెంత యోర్దాను ఆవలి అరాబాలోయలో మకాము చేయుచుండిరి. వారికి ఒకవైపు పారాను మరియొకవైపు టో ఫెలు, లాబాను, హసేరోతు, దీసహాబు నగరములు కలవు.

2. హోరేబు నుండి సెయీరు కొండమీదుగా కాదేషు బార్నెయాకు పదకొండురోజుల ప్రయాణము.

3. యిస్రాయేలీయులు ఐగుప్తునుండి వెడలివచ్చిన నలు వదియవయేడు పదునొకండవనెల మొదటి రోజున ప్రభువు ఆజ్ఞాపించిన సంగతులన్నింటిని మోషే వారికి ఎరిగించెను.

4. అప్పటికే మోషే హెష్బోనున పరిపాలనము చేయుచున్న అమోరీయరాజు సీహోనును, అష్టారోతు, ఎద్రెయి నగరములలో పరిపాలనము చేయు బాషానురాజు ఓగును ఓడించియుండెను.

5. ప్రజలు యోర్దానునకు తూర్పు దిశన మోవాబు మైదానమున వసించుచుండగా మోషే ఈ ఉపదేశమును వినిపించెను. అతడిట్లు నుడివెను:

6. “మనము హోరేబువద్ద నివసించుచుండగా ప్రభువు మనతో 'మీరు ఈ కొండయొద్ద చాలకాలము మకాము పెట్టితిరి.

7. ఇక గుడారములెత్తి పయనము కట్టుడు. మీరు అమోరీయుల మన్నెమునకును, అరాబా చుట్టుపట్లగల ఎడారియందును, పీఠభూములందును, లోయ దక్షిణ ప్రాంతములందును, మధ్యధరా సముద్ర తీరమునందును వసించు జనులకడకు పొండు. నేగేబునకు, కనాను దేశమునకు, లెబానోను మండలమున యూఫ్రటీసు మహానది వరకు పొండు.

8. ప్రభుడనైన నేను ఆ నేలను మీ పితరులగు అబ్రహాము, ఈసాకు, యాకోబులకును వారి సంతానమునకును ధారాదత్తము చేయుదునని వాగ్దానము చేసితిని. మీరు వెళ్ళి ఆ దేశమును స్వాధీనము చేసికొనుడు” అనెను.

9. మరియు మోషే ఇట్లు పలికెను: “నేనొక్కడనే మీ బరువు మోయజాలను.

10. ప్రభువు కృపవలన , మీరు ఆకాశమునందలి చుక్కలవలె లెక్కకందని రీతిగా వ్యాప్తి చెందితిరి.

11. మీ పితరుల దేవుడు మిమ్మింకను వేయిరెట్లు అధికముగా విస్తరిల్లజేయునుగాక! తన మాట చొప్పున మిమ్ము దీవించుగాక!

12. కాని నేనొక్కడినే ఎలా మీ బరువు మోయగలను? మీ జగడములు ఎట్లు తీర్పగలను?

13. మీ తెగలనుండి వివేకము, విజ్ఞానముగల అనుభవశాలురను ఎన్నుకొనుడు. నేను వారిని మీకు పెద్దలుగా నియమింతును అని మీతో చెప్పితిని.

14. నేను చెప్పినట్లు చేయుటకు మీరు ఒప్పుకొంటిరి.

15. కనుక నేను మీ తెగలనుండి వివేకము, అనుభవము గలవారిని ఎన్నుకొని మీకు పెద్దలుగా నియమించితిని. వారు మీలో వేయిమందికి, నూరుమందికి, ఏబదిమందికి, పదిమందికి నాయకులైరి. ఇంకను మీ తెగలకు అధికారులనుగూడ నియ మించితిని.

16. అప్పుడే నేను మీ న్యాయాధిపతులతో 'మీరు ప్రజల తగవులను జాగ్రత్తగా వినుడు. స్వజాతీయుల జగడములనుగాని, మీతో కలిసి వసించు విజాతీయుల జగడములనుగాని న్యాయసమ్మతముగా పరిష్కరింపుడు. మీరెవరియెడల పక్షపాతము చూపింప వలదు.

17. అధికునకు, అల్పునకు ఒకేరీతిని తీర్పు చెప్పుడు. ఎవరికిని భయపడకుడు. మీ నిర్ణయములు దేవుని నిర్ణయములు. ఏ వివాదమైన మీకుతెగనిచో నాయొద్దకు కొనిరండు. నేనే దానిని తీర్తును' అని చెప్పితిని.

18. అదే సమయమున మీరు చేయవలసిన ఇతర కార్యములను గూర్చియు మీకు ఆదేశించితిని.

19. మనము హోరేబు నుండి బయలుదేరితిమి. మీరెల్లరును కన్నులార చూచిన ఆ విశాలమును, భయంకరమునైన ఎడారిగుండ పయనించితిమి. దేవుడైన యావే ఆజ్ఞ ప్రకారము అమోరీయుల కొండ ప్రదేశములగుండ నడచి కాదేషుబార్నెయా చేరితిమి.

20. అప్పుడు నేను మీతో 'మనము అమోరీయుల మన్నెము చేరితిమి. మన పితరుల దేవుడు ఈ నేలను మనకిచ్చెను.

21. కనుక మీరు మీ పితరుల దేవుడు నుడివినట్లు వెళ్ళి ఆ భూమిని ఆక్రమించుకొనుడు. మీరు భయపడకుడు, నిరుత్సాహపడకుడు' అని నుడివితిని.

22. కాని మీరెల్లరు నా చెంతకువచ్చి 'వేగుచూచి వచ్చుటకై ముందుగా మనవారిని కొందరిని పంపుదము. మనము ఏ త్రోవనుపోవలయునో, అచట ఏఏ పట్టణములు తగులునో వారే మనకు తెలియజేయుదురు' అని పలికిరి.

23. మీ సలహానుమన్నించి నేను ఒక్కొక్క తెగకు ఒక్కని చొప్పున మొత్తము పండ్రెండుగురు వేగుల వాండ్రను ఎన్నుకొంటిని.

24. వారు ఆ మన్నెమునకు పోయి ఎష్కోలు లోయవరకు వేగుచూచిరి.

25. అచట పండు పండ్లనుగూడ కొనివచ్చి మనకు చూపిరి. 'దేవుడు మనకిచ్చిన నేలసారవంతమైనది' అని చెప్పిరి.

26. అయినను మీరు దేవుని ఆజ్ఞ పెడచెవినిబెట్టి ఆ నేలకు పోవుటకు అంగీకరింపరైతిరి.

27. మీరు గొణుగుచు 'ప్రభువునకు మనమనిన గిట్టదు కనుకనే అతడు మనలను ఐగుప్తునుండి తోడ్కొనివచ్చి ఈ అమోరీయుల వశముచేసి వారిచే చంపింపనున్నాడు.

28. మనము అక్కడికి పోనేల? అటవసించు ప్రజలు మనకంటె బలశాలురనియు, ఆజానుబాహులనియు, వారి పట్టణ ప్రాకారములు ఆకాశమునంటుచున్న వనియు, అక్కడ అనాకీయులు వసించుచున్నారనియు మన వేగులవాండ్రు చెప్పగా వింటిమి. ఈ వార్తలు వినగా మన గుండె నీరగుచున్నది' అని సణుగుకొంటిరి.

29. నేను మిమ్ము హెచ్చరించుచు 'వారిని గూర్చి మీరు దిగులు పడవలదు, వారికి భయపడవలదు,

30. మిమ్ము నడిపించు ప్రభువే మీ పక్షమున పోరాడును. ఆయన ఐగుప్తున మీ కోపు తీసికోలేదా?

31. మీరు ఎడారిగుండ పయనించి ఇచటికి చేరినపుడు త్రోవ పొడుగున ప్రభువు మీకు బాసటయై యుండెను. తండ్రి కుమారునివలె ఆయన మిమ్ము మోసికొనివచ్చెను' అని పలికితిని.

32. కాని నేనెంత మొత్తుకొన్నను మీరు యావేను నమ్మరైతిరి.

33. మీ ప్రయాణమున ఆ ప్రభువు మీకు ముందుగా వెళ్ళి మీకు విడిదిని వెదకెడువాడు. రేయి మీకు త్రోవ చూపించుటకై మీ ముందు నిప్పుకంబములో, పగలు మేఘస్తంభములో పయనించెడివాడు.

34. మీ గొణగుడు విని యావే మండిపడెను.

35. 'ఈ దుర్మార్గపుతరములో ఒక్కడుకూడ వారి పితరులకు నేను వాగ్దానము చేసిన సారవంతమైన నేలపై అడుగు పెట్టజాలడు.

36. యెపున్నె కుమారుడు కాలేబు మాత్రము ఆ దేశము చేరుకొనును. అతడు నాపట్ల విశ్వాసము చూపెను కనుక కాలేబు వేగుచూచిన దేశమును అతనికిని అతని వంశజులకును ఇచ్చెదను' అని ఒట్టు పెట్టుకొనెను.

37. మీవలన ప్రభువు నామీద గూడ విరుచుకొనిపడి 'నీవు ఆ భూమిని చేరజాలవు సుమా!

38. నీ సేవకుడును, నూను కుమారుడునగు యెహోషువ ఆ దేశమున కాలిడును. అతనిని ప్రోత్స హింపుము. ఆ ప్రదేశమును యిస్రాయేలీయులకు వారసభూమిగా పంచి ఇచ్చువాడు అతడే' అని చెప్పెను.

39. మరియు 'మీ చిన్నపిల్లలను శత్రువులు పట్టుకొందురేమోయని నీవు భయపడితివి. అన్నెముపున్నెము ఎరుగని ఆ పసికందులు ఆ దేశము చేరుదురు. నేను ఆ నేలను వారికిత్తును. వారు దానిని స్వాధీనము చేసికొందురు.

40. మీరు మాత్రము వెనుదిరిగి ఎడారి మార్గముపట్టి రెల్లుసముద్రమువైపు వెళ్ళిపోవలసినదే.' అనెను.

41. అప్పుడు మీరు నాతో 'మేము ప్రభువు యెడల అపరాధము చేసితిమి. ఆయన ఆజ్ఞాపించినట్లే శత్రువులమీదికి యుద్ధమునకు పోయెదము' అని యంటిరి. మీరందరును ఆయుధములను ధరించి, ఆలోచింపక మన్నెముమీదికి వెడలిరి.

42. కాని ప్రభువు నాతో 'వీరిని యుద్ధమునకు పోవలదని చెప్పుము. నేను వారికి తోడ్పడను. శత్రువులు వారిని ఓడింతురు' అని చెప్పెను.

43. నేను ఆ సంగతి మీతో చెప్పితినిగాని మీరు లెక్కచేయరైరి. ప్రభువు ఆజ్ఞను ధిక్కరించి తలబిరుసుతనముతో మన్నెము మీదికి దాడిచేసిరి.

44. అప్పుడు ఆ కొండమీద వసించు అమోరీయులు కందిరీగలవలె వెడలివచ్చి, మిమ్ము హోర్మా వరకును తరిమికొట్టి సెయీరున ఓడించిరి.

45. మీరు తిరిగివచ్చి యావే ఎదుట కన్నీరు గార్చిరి. అయినను ప్రభువు మీ వేడికోలు ఆలింపనులేదు, మిమ్ము పట్టించుకొననులేదు.

46. కనుక మీరు చాలనాళ్ళు కాదేషుననే పడి యుండవలసి వచ్చినది.