1. ప్రభూ! అనాదికాలమునుండియు నీవు మాకు వాసస్థలముగానుంటివి.
2. పర్వతములు పుట్టకమునుపే, భూమియు, లోకమును ఏర్పడకపూర్వమే అనాదికాలమునుండి నీవు దేవుడవుగానుంటివి ఎల్లకాలమును నీవు వేల్పువుగా నుందువు.
3. నీవు నరులను మట్టిగా మార్చెదవు. “నరులారా! మీరు మరల మన్నయిపొండు” అని పలికెదవు.
4. నీకు వెయ్యేండ్లు ఒక్కరోజుతో సమానము, అవి గతించిపోయిన నిన్నటిదినముతోను రేయి అందలి ఒక్క జాముతోను సరిసమానము.
5. నీవు నరులను వరదవలె ఈడ్చుకొని పోయెదవు. వారు కలవంటివారు, ఉదయమున మొలకెత్తు గడ్డివంటివారు.
6. అది వేకువన ఎదిగి పూలు పూయును. సాయంకాలమున కోయబడి వాడి, ఎండిపోవును
7. మేము నీ కోపాగ్నివలన మాడిపోవుచున్నాము. నీ క్రోధమువలన గడగడ వణకుచున్నాము.
8. నీవుమా పాపములను నీ ముందట ఉంచుకొందువు మా రహస్య పాపములను నీ ముఖకాంతితో పరిశీలించి చూతువు.
9. నీ కోపము భరించుచూనే మా దినములన్నియు గతించిపోవును. మా ఆయువు శ్వాసమువలె గతించును.
10. మేమొక డెబ్బదియేండ్లు జీవింతుము. దృఢకాయులమైనచో ఎనుబదియేండ్లు బ్రతుకుదుము కాని ఆ యేండ్లన్నియు బాధావిచారములతో నిండియుండును. మా జీవితము క్షణములో ముగియగా మేము దాటిపోవుదుము.
11. కాని నీ కోపప్రభావమును అర్థము చేసికొన్నవాడెవడు? నీ క్రోధమువలన ఎట్టి భయము కలుగునో గ్రహించినవాడెవడు?
12. మా ఆయుష్కాలము ఎంతస్వల్పమైనదో మేము గ్రహించునట్లు చేయుము. దానివలన మేము విజ్ఞులమగుదుము.
13. ప్రభూ! నీ క్రోధమును అణచుకొనుము. నీవింకను ఎంతకాలము కోపింతువు? నీ దాసుల మీద దయచూపుము.
14. వేకువన మమ్ము నీకృపతో నింపుము. మా జీవితకాలమందెల్ల మేము సంబరముతో కేరింతలు కొట్టుదుము.
15. పూర్వము మమ్ము ఎంతగా శ్రమలపాలుచేసి, దుఃఖ పెట్టితివో అంతగా నేడు మమ్ము సంతోషపెట్టుము.
16. నీదాసులమైన మేము నీ రక్షణమును చూతుముగాక మా బిడ్డలు నీ మాహాత్మ్యమును కాంతురు గాక!
17. మా దేవుడవైన ప్రభూ! నీ అనుగ్రహమును మాకు దయచేయుము. మా కార్యములనెల్ల సఫలము చేయుము.