ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

Psalms 88

1. ప్రభూ! నాకు రక్షకుడవైన దేవా! నేను నీకు పగలు మొరపెట్టుకొనుచున్నాను, రేయి నీ సన్నిధిలోనికి వచ్చుచున్నాను.

2. నా ప్రార్థన నీ సన్నిధిని చేరునుగాక! నీవు నా మొరను ఆలింపుము.

3. నాకు పలుకీడులు దాపురించినవి. నేను మృత్యువువాత పడనున్నాను.

4. నా పేరు మృతలోకమునకు పోవువారి జాబితాలోకి ఎక్కినది. నేను సహాయము లభించని వానివలెనైతిని.

5. జనులు నన్ను విడనాడిరి. నేను మృతులలో కలిసిపోతిని. చచ్చి సమాధిచేరినవారిని నీవిక స్మరింపవు, ఆదరింపవు. నేను అట్టివాడనే అయితిని.

6. నీవు నన్ను నడిగుంటలో పడవేసితివి. లోతైన చీకటి కోనేటిలో పడద్రోసితివి.

7. నీ కోపము నన్ను అణగదొక్కినది. నీ క్రోధతరంగములు నన్ను ముంచివేసినవి.

8. నీవు నా మిత్రులు నన్ను విడనాడునట్లు చేసితివి. వారు నన్ను అసహ్యించుకొనునట్లు చేసితివి. నేను ఈ చెరనుండి బయటపడలేను. 

9. శ్రమలవలన నా కంటిచూపు మందగించినది. ప్రభూ! ప్రతి రోజు నేను నీకు మొరపెట్టుచునే యుంటిని. చేతులెత్తి నీకు ప్రార్థన చేయుచునే యుంటిని.

10. నీవు మృతులకొరకు అద్భుతములు చేయుదువా? ప్రేతములు పైకి లేచి నిన్ను స్తుతించునా?

11. సమాధిలో నీ కరుణనుగూర్చి ఎవడు మాట్లాడును? వినాశస్థలములో నీ విశ్వసనీయతను ఎవడు ఉగ్గడించును?

12. చీకటిలో నీ అద్భుతములను ఎవరు గుర్తింతురు? విస్మృతికి గురియైన పాతాళలోకమున నీ న్యాయమును ఎవరు తెలిసికొందురు?

13. కాని ప్రభూ! నేను నీకు మొరపెట్టుకొనుచున్నాను. ప్రతి ఉదయము నీకు ప్రార్ధన చేయుచున్నాను.

14. ప్రభూ! నీవు నన్ను నిరాకరింపనేల? నీ మొగమును నానుండి మరుగుచేసికోనేల?

15. నేను బాల్యమునుండియు శ్రమలను అనుభవించి చావునకు సిద్ధమైనవాడను, నేను నీ శిక్షలు అనుభవించి అలసిపోయితిని.

16. నీ క్రోధము నన్ను కూల్చివేసినది. నీ దండనములు నన్ను నాశనము చేసినవి.

17. నీ శిక్షాతరంగములు దినమెల్ల నన్ను చుట్టుముట్టినవి. అవి నామీదికి పొంగిపొరలినవి.

18. నీవు నా స్నేహితులను, పరిచితులను నానుండి దూరము చేసితివి. కడకు చీకటి మాత్రమే నాకు చెలికాడయ్యెను.