ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

Psalms 84

1. సైన్యములకధిపతియైన ప్రభూ! నీ నివాసము ఎంత రమ్యము!
2. నేను యావే మందిరావరణములను దర్శింపవలెనని ఉవ్విళ్ళూరుచున్నాను, తపించిపోవుచున్నాను. పూర్ణహృదయముతోను, ఆనందముతోను, నేను సజీవుడైన దేవునికి గీతములు పాడుదును.
3. నా దేవుడవును, నా రాజువును, సైన్యములకధిపతియైన ప్రభూ! నీ బలిపీఠమువద్ద పిచ్చుకలు గూడు కట్టుకొన్నవి. వానకోయిలలుకూడ పిల్లలు చేయుటకు గూడు పెట్టుకొన్నవి.
4. నీ మందిరమున వసించుచు, ఎల్లవేళల నిన్ను స్తుతించువారు ధన్యులు.
5. నీ వలన బలముపొంది నీ దేవాలయమునకు యాత్ర చేయగోరువారు ధన్యులు.
6. వారు ఎండిన లోయగుండ పయనముచేసి దానిని చెలమల తావుగా మార్చుదురు. తొలకరివానలు దానిని మడుగులతో నింపును.
7. వారు పయనించిన కొలది అధికబలమును బడయుదురు. సియోను దేవాధిదేవుని దర్శింతురు.
8. సైన్యములకధిపతియైన ప్రభూ! నా వేడుకోలును ఆలింపుము. యాకోబు దేవా! నా మొర వినుము.
9. మాకు రక్షకుడవైన దేవా! మాపై నీ దృష్టి నిలుపుము.  నీవు అభిషేకించిన అతనిని కటాక్షింపుము.
10. అన్యుల ఇండ్లలో వేయినాళ్ళు గడపినదానికంటె నీ మందిరమున ఒక్కరోజు వసించటమేలు. దుష్టుల ఇండ్లలో నివసించుటకంటె, నా దేవుని మందిరమున ద్వారపాలకుడనుగా ఉండుట మెరుగు.
11. ప్రభువు మనకు సూర్యుడు, కవచము వంటివాడు ఆయన మనకు కృపను, కీర్తిని దయచేయును. ధర్మవర్తనులుగా మనువారికి అతడు ఎట్టి శుభములను నిరాకరింపడు.
12. సైన్యములకధిపతియైన ప్రభూ! నిన్ను నమ్మువారు ధన్యులు.

Copyright © 2025 Telugu Catholic Bible All Rights Reserved | Website Designed by HyderHub Web Services