1. దేవా! నీవు చూచుచు ఊరకుండవలదు. దేవా! నీవు మౌనముగ నుండవలదు. జోక్యము చేసికోకుండనుండవలదు.
2. నీ శత్రువులు తిరుగుబాటు చేయుచున్నారు, చూడుము. నిన్ను ద్వేషించువారు నీ మీద తిరుగబడుచున్నారు.
3. వారు నీ జనులమీద కుట్రలు పన్నుచున్నారు. నీవు కాపాడు ప్రజలమీద కుతంత్రములు పన్నుచున్నారు.
4. "రండు మనము వీరి జాతిని నాశనము చేయుదము. " యిస్రాయేలు పేరు ఇక కన్పింపకూడదు” అని పలుకుచున్నారు.
5. వారందరును కూడి ఏకముగా పన్నాగముపన్నిరి. నీకు విరోధముగా నిబంధనము చేసికొనిరి.
6. వారు ఎదోమీయులు, యిష్మాయేలీయులు, మోవాబీయులు, హగ్రీయులు,
7. గెబారీయులు, అమ్మోనీయులు, అమాలేకీయులు, ఫిలిస్తీయులు, తూరీయులు
8. అశ్సురీయులుకూడ వారితో కలిసిపోయిరి. లోతు వంశజులుకూడ ఆ విరోధులలో చేరిపోయిరి
9. నీవు మిద్యానీయులనువలె వారినిగూడ శిక్షింపుము కీషోను నదియొడ్డున సీస్రాకును, యాబీనునకును పట్టించిన గతినే వారికిని పట్టింపుము.
10. వారు ఎండోరువద్ద చచ్చి నేలకు ఎరువైపోయిరి.
11. ఆ విరోధుల సైన్యాధిపతులకు ఓరేబునకును, సెయేబునకును పట్టించిన గతి పట్టింపుము. వారి పాలకులనెల్ల సేబా, సల్మూనా రాజులను ఓడించినట్లుగా ఓడింపుము.
12. వారు దేవుడు వసించు దేశమును తాము స్వాధీనము చేసికొందుమని ఎంచిరి.
13. దేవా! వారిని ధూళివలె ఎగజిమ్ముము. గాలికి ఎగిరిపోవు పొట్టువలె ఎగరగొట్టుము.
14. అగ్ని అరణ్యమును కాల్చివేసినట్లుగాను, నిప్పుమంటలు కొండలను తగులబెట్టినట్లుగాను
15. నీ తుఫానుతో వారిని వెన్నాడుము. నీ సుడిగాలితో వారిని జడిపింపుము.
16. దేవుడైన యావే వారిని అవమానమున ముంచివేయుము. అప్పుడు వారు నిన్ను సేవింతురు.
17. వారికి కలకాలము అపకీర్తియు, భీతియు ప్రాప్తించునుగాక! వారు అవమానముతో చత్తురుగాక!
18. యావే అను నామమును ధరించిన నీవు మాత్రమే ప్రభుడవనియు లవ భూమియందంతట నీవు మాత్రమే మహోన్నతుడవు అనియు వారు గుర్తింతురుగాక!