ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

Psalms 78

1. జనులారా! మీరు నా బోధ వినుడు. నా నోటి పలుకులకు చెవియొగ్గి ఆలింపుడు

2. నేను సూక్తులద్వారా మీతో మాట్లాడెదను. మన పూర్వచరిత్రలోని రహస్యములను మీకు వివరించెదను.

3. మేము విన్న సంగతులు, ఎరిగిన సంగతులు, మా పూర్వులు మాతో చెప్పిన సంగతులు.

4. ప్రభువు మహాకార్యములు, ఆయన పరాక్రమము, ఆయన అద్భుతకార్యములు మొదలైన అంశములను మన పిల్లలకు తెలియకుండ దాచియుంచరాదు. ఆ సంగతులనెల్ల మన తరువాత తరములవారికి తెలియజేయవలెను.

5. ప్రభువు యాకోబు సంతతికి శాసనములను ఒసగెను. యిస్రాయేలు ప్రజలకు ధర్మశాస్త్రమును దయచేసెను మన పూర్వులు ఆ శాసనములను తమ పిల్లలకు బోధింపవలెననియు,

6. అప్పటికి ఇంకను పుట్టని భావితరముల వారును వానిని నేర్చుకొని మరల తమ బిడ్డలకు నేర్పింపవలయుననియు అతడు ఆజ్ఞాపించెను.

7. ఈ రీతిగా మన ప్రజలు దేవుని నమ్మి అతని కార్యములను జ్ఞప్తియందుంచుకొని అతని ఆజ్ఞలను పాటింపగలుగుదురు.

8. మన జనులు మన పితరులవలె అవిధేయులై దేవుని మీద తిరుగుబాటు చేయువారు కారాదు. ఆ పితరులు దేవునిమీద ఆధారపడలేదు. ఆయనపట్ల విశ్వాసమును చూపలేదు.

9. విల్లులతో పోరాడు ఎఫ్రాయీము తెగవారు యుద్ధమున వెన్నిచ్చి పారిపోయిరి.

10. వారు దేవుని నిబంధనమును పాటింపలేదు. ఆయన ధర్మశాస్త్రమును అనుసరింపలేదు.

11. వారు ప్రభువు కార్యములను విస్మరించిరి. ఆయన తమకు చూపించిన అద్భుతకార్యములను మరచిపోయిరి.

12. వారి పితరులు చూచుచుండగా ఐగుప్తులోని సోవాను క్షేత్రమున దేవుడు అద్భుతకార్యములను చేసెను.

13. వేరుచేసిన సముద్రము గుండు ఆ పితరులను నడిపించెను. వారికొరకు సాగరజలములను గోడలవలె నిల్పియుంచెను.

14. పగటిపూట మేఘముతోను, రేయెల్ల నిప్పు వెలుగుతోను యాకోబు జనులను నడిపించెను.

15. ఎడారిలో కొండబండలను బ్రద్దలుచేసి త్రాగుటకు వారికి నీరు సమృద్ధిగా ఒసగెను.

16. కొండబండనుండి ఏరు పుట్టించి నీటిపాయను ప్రవహింపచేసెను.

17. కాని వారు దేవునికి ద్రోహముగా పాపము చేయుచు వచ్చిరి. ఎడారిలో మహోన్నతునిమీద తిరుగబడిరి.

18. తమకు నచ్చిన భోజనమును ఒసగుమని దేవుని బుద్ధిపూర్వకముగా సవాలు చేసిరి.

19. “దేవుడు ఎడారిలో భోజనము దయచేయగలడా” అనుచు ఆయనకు వ్యతిరేకముగా మాటలాడిరి.

20. “దేవుడు బండను చరచినపుడు, నీళ్ళు ప్రవాహముగా పారిన మాట నిజమే కాని ఆయన మనకు ఆహారమును కూడ దయచేయగలడా? మాంసమునుగూడ పెట్టగలడా?” అని పలికిరి.

21. ఆ పలుకులు ఆలించి ప్రభువు కోపించెను. ఆయన అగ్ని యాకోబు వంశమును దహించెను. ఆయన కోపము యిస్రాయేలు మీద విరుచుకొనిపడెను.

22. ఆ జనులు దేవుని నమ్మరైరి. . ఆయన తమను రక్షించునని విశ్వసింపరైరి.

23. అయినను ఆయన ఆకాశమునకు ఆజ్ఞను ఒసగెను.  అంతరిక్ష కవాటములను తెరచెను.

24. ఆ ప్రజలకు అహారముగా మన్నానుకురియించెను ఆకసమునుండి వారికి ఆహారమును ఒసగెను.

25. నరులు దేవదూతల ఆహారమును ఆరగించిరి. ఆయన వారికి సమృద్ధిగా ఆహారమును దయచేసెను

26. ఆయన ఆకాశమునుండి అమలు తూర్పుగాలిని తోలించెను. తన శక్తితో దక్షిణవాయువును పంపెను.

27. ధూళివలెను కడలి ఒడ్డునున్న యిసుక రేణువుల వలెను, తన ప్రజలమీదికి పక్షులను విస్తారముగా పంపెను.

28. అవి ప్రజలు వసించు శిబిరము మధ్య వారి గుడారముల చుట్టునువాలెను.

29. ప్రజలు ఆ పక్షుల మాంసము భుజించి సంతృప్తి చెందిరి. ప్రభువు వారు కోరుకొనిన భోజనమును దయచేసెను.

30. కాని వారి కోరిక తీరకమునుపే, ఆ భోజనము ఇంకను వారి నోటనుండగనే

31. ప్రభువు కోపము వారిమీద విరుచుకొనిపడెను. వారిలో బలాఢ్యులు చచ్చిరి. యిస్రాయేలీయులలో యువకులు నేలకొరిగిరి.

32. ఇన్ని వింతలు జరిగినను జనులు పాపములు విడనాడలేదు. . ప్రభువు అద్భుతములను నమ్మలేదు.

33. కనుక ప్రభువు వారి దినములు శ్వాసమువలె అదృశ్యమగునట్లు చేసెను. వారి ఆయుషు ఆకస్మికమైన విపత్తుల వలన గతించిపోవునట్లు చేసెను.

34. ప్రభువు ఆ ప్రజలను సంహరింప పూనుకోగా వారు ఆయనను శరణువేడిరి. పశ్చాత్తాపపడి భక్తితో ఆయనను ఆశ్రయించిరి.

35. ప్రభువు తమకు ఆశ్రయశిలా దుర్గమనియు, మహోన్నతుడు తమకు విమోచకుడనియు జ్ఞప్తికి తెచ్చుకొనిరి.

36. కాని వారి మాటలన్నియు వట్టి ముఖస్తుతులు. వారి పలుకులన్నియు బొంకులు.

37. వారి హృదయములు ప్రభువుమీద లగ్నము కాలేదు. వారు ఆయన నిబంధనమును పాటింపలేదు.

38. కాని దేవుడు జాలితో వారి తప్పిదములు మన్నించి వారిని మట్టుపెట్టడయ్యెను. అతడు పలుమారులు తన ఆగ్రహమును అణచుకొనెనేగాని, దానినెంత మాత్రము విజృంభింపనీయడయ్యెను.

39. ఆ జనులు కేవలము నరమాత్రులనియు, ఒకసారి వీచి వెడలిపోయి మరల తిరిగిరాని గాలివలె కేవలము క్షణమాత్ర జీవులనియు అతడు జ్ఞప్తికి తెచ్చుకొనెను.

40. వారు ఎడారిలో ఆయనమీద ఎన్నిసార్లు తిరుగబడలేదు? ఆ మరుభూమిలో ఆయన మనసు ఎన్నిసార్లు కష్టపెట్టలేదు.

41. పలుసార్లు ప్రభువును పరీక్షకు గురిచేసిరి. పవిత్రుడైన యిస్రాయేలు దేవుని మనస్సును చివుక్కుమనిపించిరి.

42. ఆయన శక్తి ఎటువంటిదియో మరచిపోయిరి. ఆయన శత్రువులనుండి తమను విడిపించుటను విస్మరించిరి.

43. ఐగుప్తున ఆయన చేసిన అద్భుతములను సోవాను నగర ప్రదేశమున ఆయన చేసిన అసమాన అద్భుత క్రియలను గుర్తునకు తెచ్చుకోరైరి.

44. ప్రభువు ఐగుప్తీయుల నదులను నెత్తురుగ మార్చెను. కనుక ఆ ప్రజలు వారి యేరుల నుండి నీరు త్రాగలేకపోయిరి.

45. అతడు వారిమీదికి ఈగలను పంపగా అవి వారిని బాధించెను. కప్పలను పంపగా అవి వారిని నాశనము చేసెను.

46. వారి పొలములలోని పంటలను చీడపురుగులపాలు చేసెను. ఆ వారి కాయకష్టము మిడుతల వాత పడునట్లు చేసెను.

47. వారి ద్రాక్షలను వడగండ్లతోను అత్తి చెట్లను మంచుతోను పాడుచేసెను.

48. వారి పశువులను వడగండ్లతోను, మందలను మెరుపులతోను నాశనము చేసెను.

49. భీకరమైన తన కోపాగ్నితో ఆ ప్రజలను పీడించి కడగండ్లపాలు చేసెను. వినాశదూతలను వారి మీదికి పంపెను.

50. అతడు తన కోపమును అణచుకోలేదు. ఆ ప్రజలను ప్రాణములతో వదలివేయలేదు. వారు అంటురోగముల వాతపడునట్లు చేసెను.

51. ఐగుప్తులోని తొలిచూలు పిల్లల నెల్ల హాము గుడారములోని బలమైన ప్రథమ సంతానమునెల్ల సంహరించెను.

52. తన ప్రజలను గొఱ్ఱెల మందనువలె నడిపించుకొనిపోయెను. ఎడారిగుండ వారిని తోడ్కొనిపోయెను.

53. అతడు ఆ ప్రజలను సురక్షితముగా కొనిపోగా వారు భయపడరైరి. వారి శత్రువులు మాత్రము సముద్రమున మునిగిపోయిరి.

54. ప్రభువు ఆ ప్రజలను తన పవిత్ర పర్వతమునకు కొనివచ్చెను. తాను స్వయముగా జయించిన కొండనేలకు తీసికొని వచ్చెను.

55. తన ప్రజల ప్రక్క వసించు స్థానిక జాతులను తరిమివేసెను, యిస్రాయేలు తెగలకు వారసత్వపు భూమిని పంచియిచ్చెను. - ఆ తెగలవారు ఆ నేలమీద గుడారములు పన్నుకొనునట్లు చేసెను.

56. అయినను వారు మహోన్నతుడైన దేవుని మీద తిరుగబడిరి, అతని ఆజ్ఞలను మీరిరి.

57. తమ పితరులవలె విశ్వాసఘాతకులై తిరుగుబాటు చేసిరి. వంకరవిల్లువలె మోసగాండ్రయిరి.

58. కొండలమీద అన్యుల గుళ్ళు కట్టి దేవుని కోపమును రెచ్చగొట్టిరి. విగ్రహములను కొల్చి ఆయనను అసూయకు గురిచేసిరి.

59. ఈ చెయిదములెల్ల చూచి దేవుడు కోపించెను. యిస్రాయేలును పూర్తిగా విడనాడెను.

60. అతడు షిలో నగరములోని తన గుడారమును, ప్రజలనడుమ తాను వసించిన నివాసమును త్యజించెను.

61. తన బలముగా వెలుగొందు మందసమును ప్రవాసమునకు అప్పగించెను. తన తేజస్సయిన మందసమును శత్రువులపాలు చేసెను. 

62. తన ప్రజలమీద ఆగ్రహము తెచ్చుకొని, వారు విరోధుల కత్తికి బలియగునట్లు చేసెను.

63. యుద్ధములందు అగ్ని వారి యువకులను దహించివేసెను. వారి యువతులను పరిణయమాడువారు లేరైరి.

64. వారి యాజకులు కత్తివాతపడిరి. వారి వితంతువులు తమ భర్తలకొరకు శోకింపజాలరైరి.

65. అంతట ప్రభువు నిద్రించువాడు మేల్కొనినట్లుగా మేలుకొనెను. మధువును సేవించిన వీరునివలె ఆవేశము తెచ్చుకొనెను.

66. ఆయన శత్రువులను వెనుకకు తరిమికొట్టి శాశ్వత అవమానమునకు గురిచేసెను.

67. ప్రభువు యోసేపు సంతతిని నిరాకరించెను. ఎఫ్రాయీము వంశజులను ఎన్నుకోడయ్యెను.

68. వారికి బదులుగా యూదా తెగను అంగీకరించెను తనకు ప్రీతిపాత్రమైన సియోను కొండను ఎన్నుకొనెను.

69. ఆకాశములోని తన నివాసమునకు పోలికగా ఆ కొండమీద దేవాలయమును కట్టించెను. అది ఎల్లకాలము భూమివలె స్థిరముగా నిల్చియుండునట్లు చేసెను.

70. ఆయన తన దాసుడైన దావీదు నెన్నుకొనెను. గొఱ్ఱెలను కాచుచుండగా అతనిని పిలిపించెను.

71. గొర్రెపిల్లలను మేపుచుండగా అతనిని రప్పించెను. తన సొంత ప్రజలును తాను ఎన్నుకొనినవారునైన యాకోబు ప్రజమీద అతనిని కాపరిగా నియమించెను.

72. దావీదు యదార్ధహృదయుడై ఆ ప్రజలను పాలించెను. నేర్పుతో వారిని నడిపించెను.