1. ఓ ప్రభూ! నేను నీకు హృదయ పూర్వకముగా వందనములు అర్పింతును. దైవముల ముందట నిన్ను కీర్తింతును.
2. నీ కృపను, విశ్వసనీయతను చూచి నీ పవిత్రమందిరమువైపు మరలి, శిరము వంచి నీకు వందనములు అర్పింతును. నీ నామమును, నీ ఆజ్ఞలును అన్నిటికంటెను ముఖ్యమైనవి.
3. నేను మొరపెట్టగా నీవు నా వేడికోలును ఆలించితివి. నీ శక్తితో నన్ను బలాఢ్యుని చేసితివి.
4. ప్రభూ! లోకములోని రాజులెల్ల నీకు వందనములు అర్పింతురు. వారు నీవు సెలవిచ్చినమాటలను వినియున్నారు.
5. వారు నీ కార్యములను, నీ మహామహిమను కొనియాడుదురు.
6. మహోన్నతస్థానము నుండియు నీవు దీనులను గమనింతువు. దూరమునుండియు గర్వాత్ములను పరికింతువు.
7. నేను కష్టములలో చిక్కుకొనినపుడు నీవు నన్ను కాచి కాపాడుదువు. ఆగ్రహపూరితులైన నా విరోధులను ఎదిరించి నీ బలముతో నన్ను రక్షింతువు.
8. నీవు ప్రమాణము చేసినదెల్ల చేసి తీరుదువు. నీ కృప శాశ్వతమైనది. నీవు చేపట్టిన పనిని సంపూర్ణము చేయుము.