1. నిర్దోషులుగా జీవించుచు, ధర్మశాస్త్రముననుసరించువారు ధన్యులు
2. ప్రభువు ఆజ్ఞలు పాటించుచు, పూర్ణహృదయముతో అతనిని వెదకువారు ధన్యులు
3. వారు చెడును తలపెట్టక, ప్రభువు మార్గములలో నడతురు.
4. ప్రభూ! మేము నీ ఆజ్ఞలను చిత్తశుద్ధితో పాటింపవలెనని నీవు నియమము చేసితివి.
5. నేను స్థిరబుద్ధితో నీ కట్టడలను అనుసరించిన ఎంత బాగుండును!
6. నేను నీ ఆజ్ఞలనెల్ల చేకొనినచో ఇక అవమానమునకు గురికానక్కరలేదు.
7. న్యాయయుక్తమైన నీ ఆజ్ఞలను నేర్చుకొనినందుకుగాను నేను నిర్మల హృదయముతో నిన్ను స్తుతింతును.
8. నేను నీ ఆజ్ఞలకు బద్ధుడనగుదును. నీవు నన్ను ఏనాడును పరిత్యజింపవలదు.
9. యువకుడు విశుద్ధజీవితమును ఎట్లు గడుపును? నీ ఆజ్ఞలను పాటించుటవలననే.
10. నేను నిన్ను పూర్ణహృదయముతో వెదకుచున్నాను. నేను నీ ఆజ్ఞలను మీరకుండునట్లు చేయుము.
11. నేను నీకు ద్రోహముగా పాపము చేయకుండుటకుగాను నీ వాక్యమును నా హృదయమున నిలుపుకొంటిని
12. ప్రభూ! నీవు ధన్యుడవు. నీ కట్టడలను నాకు బోధింపుము.
13. నీవు దయచేసిన విధులనెల్ల నేను పునశ్చరణము చేయుచున్నాను.
14. పెద్ద సంపదలను కూడబెట్టుకొనుటవలనగాక నీ శాసనములను పాటించుటవలన నేను ఆనందము చెందుదును.
15. నేను నీ ఆజ్ఞలను ధ్యానింతును. నీ మార్గములను పరిశీలింతును.
16. నేను నీ కట్టడలను గాంచి సంతసింతును. నీ వాక్యమును విస్మరింపను,
17. నీవు ఈ దాసుని కరుణించినచో నేను బ్రతికిపోయెదను. నేను నీ వాక్యమును పాటింతును.
18. నీవు నా కన్నులు తెరువుము. నేను నీ ధర్మశాస్త్రమునందలి అద్భుత విషయములను గ్రహింతును.
19. నేనీలోకమున పరదేశిగానున్నాను. నీ ఆజ్ఞలను నానుండి మరుగు చేయకుము.
20. నీ విధుల మీదగల గాఢవాంచే నా హృదయము ఎల్లవేళల దహించుకొని పోవుచున్నది.
21. నీ ఆజ్ఞలను పాటింపని గర్వాత్ములను, శాపగ్రస్తులను నీవు మందలింతువు.
22. వారు నన్ను నిందించి అవమానింపకుండునట్లు చేయుము. నేను నీ శాసనములను పాటించుచున్నాను.
23. రాజులు సభతీర్చి నామీద కుట్రలు పన్నినను ఈ దాసుడు నీ కట్టడలను ధ్యానించుట మానడు.
24. నేను నీ శాసనములను చూచి సంతోషింతును. అవి నాకు సలహాను ఒసగును.
25. నేను క్రుంగి నేలకొరిగితిని. నీ వాక్యము ప్రకారము నాకు పునర్జీవమును ప్రసాదింపుము.
26. నా తప్పులెల్ల నీకు తెలియజేసికోగా నీవు నా మొరవింటివి. నీ కట్టడలను నాకు బోధింపుము.
27. నీ ఉపదేశములను నేను గ్రహించునట్లు చేయుము నీ అద్భుతకార్యములను నేను ధ్యానింతును.
28. నేను విచారమువలన క్రుంగిపోతిని. నీ వాక్యము ప్రకారము నాకు బలమును దయచేయుము.
29. అపమార్గమునుండి నన్ను తప్పింపుము. నాకు నీ ఉపదేశమును దయచేయుము.
30. నేను నీ పట్ల విశ్వసనీయుడనుగా మెలగితిని. నీ విధులను గైకొంటిని.
31. ప్రభూ! నేను నీ శాసనములకు అంటిపెట్టుకొని యుంటిని. నన్ను అవమానమున ముంచకుము.
32. నీవు నా జ్ఞానమును వృద్ధిచేయుదువు కనుక నేను మక్కువతో పాటింతును.
33. ప్రభూ! నీ కట్టడల భావమును,నాకు విశదీకరింపుము. నేను వానికి సదా విధేయుడనగుదును.
34. నీ ధర్మశాస్త్రమును అనుసరించుటకు నాకు బుద్ధిని దయచేయుము. అప్పుడు పూర్ణహృదయముతో దానిని పాటింతును
35. నేను నీ ఆజ్ఞలను అనుసరించునట్లు చేయుము. నేను వానిని చూచి ఆనందింతును.
36. నా హృదయమును నీ శాసనములవైపు మరల్పుము. ధనవ్యామోహమునుండి దానిని వైదొలగింపుము.
37. నా మనసు వ్యర్థ వస్తువులమీదికి పోకుండునట్లు చేయుము. నీ వాక్యము ప్రకారము నాకు జీవమును దయచేయుము.
38. నీ ఈ దాసునికి నీవు ఇచ్చిన వాక్యమును నిలబెట్టుకొనుము. అది నీపట్ల భయభక్తులు కలవారికి నీవు చేయు ప్రమాణము.
39. నేను వెరచు అవమానములనుండి నన్ను రక్షింపుము నీ విధులు మేలైనవి.
40. ఇదిగో! నేను నీ ఆజ్ఞలమీద ఆశగొనియున్నాను. నీవు నీతిమంతుడవు కనుక నాకు జీవమునిమ్ము.
41. ప్రభూ! నీ కనికరమును నామీద కుమ్మరింపుము. నీ మాటనుబట్టి నీ రక్షణమును నాకు అనుగ్రహింపుము.
42. నేను నీ మాటలను నమ్మితిని కనుక నా మీద నిందలు మోపువారికి బదులు చెప్పగలను.
43. నేను ఎల్లవేళల, సత్యమునే పలుకునట్లు చేయుము. నేను నీ విధులనే నమ్మియుంటిని.
44. నేను ఎల్లవేళల, కలకాలమువరకు నీ ధర్మశాస్త్రమును పాటింతును.
45. నేను నీ ఉపదేశములను చేకొందును గనుక స్వేచ్చగా మనుదును.
46. నేను రాజులకు నీ శాసనములను ఎరిగింతును. దానివలన నేను నగుబాట్లు తెచ్చుకొనను.
47. నీ ఆజ్ఞలు నాకు ఆనందమును ఒసగును. అవి నాకు ప్రీతిపాత్రములు.
48. నేను నీ ఆజ్ఞలకు చేతులెత్తి నమస్కరింతును. వానిని ఆదరముతో చూతును, ధ్యానింతును.
49. ఈ దాసునికి నీవు దయచేసిన మాటను జ్ఞప్తికి తెచ్చుకొనుము. అది నాకు ఆశను కల్పించెను.
50. నీ వాక్యము నాకు జీవమును ఒసగెను కనుక నా బాధలలో కూడ నేను ఓదార్పును పొందితిని.
51. గర్వాత్ములు నన్ను ఎల్లవేళల గేలిచేయుచున్నారు. అయినను నేను నీ ధర్మశాస్త్రమునుండి వైదొలగనైతిని.
52. ప్రభూ! నేను పురాతనములైన నీ విధులను జ్ఞాపకము చేసికొనుచున్నాను. అవి నాకు ఓదార్పును ఒసగుచున్నవి.
53. దుష్టులు నీ ధర్మశాస్త్రమును విడనాడుటను చూడగా నాకు ఆగ్రహము కలుగుచున్నది.
54. ఈ ప్రవాసమున నీ కట్టడలు నాకు పాటలైనవి.
55. నేను రేయి నీ నామమును జ్ఞప్తికి తెచ్చుకొందును. నీ ధర్మశాస్త్రమును స్మరించుకొందును.
56. నీ కట్టడలను పాటించు భాగ్యమునకు నేను నోచుకొంటిని.
57. ప్రభూ! నీవే నా భాగము నేను నీ పలుకులు పాటింతునని మాట ఇచ్చుచున్నాను.
58. నీ వాక్యము ప్రకారము నన్ను కరుణింపుమని నిండుహృదయముతో వేడుకొనుచున్నాను.
59. నేను నా ప్రవర్తనమును పరిశీలించి చూచుకొని, నీ శాసనములను పాటింపబూనితిని.
60. కాలయాపనము చేయక శీఘ్రమే నేను నీ ఆజ్ఞలు చేకొందును.
61. దుష్టులు నన్ను బంధించుటకు ఉచ్చులు పన్నినను నేను నీ ధర్మశాస్త్రమును విస్మరింపలేదు.
62. నేను నడిరేయి మేలుకొని, న్యాయసమ్మతములైన నీ విధులకుగాను నీకు వందనములర్పింతును.
63. నీపట్ల భయభక్తులు చూపుచు, నీ ఉపదేశములను పాటించువారికెల్లరికిని నేను స్నేహితుడను.
64. ప్రభూ! ఈ భూమి నీ ప్రేమతో నిండియున్నది నీ కట్టడలను నాకు బోధింపుము.
65. ప్రభూ! నీ మాట ప్రకారము ఈ దాసునికి నీవు మేలు చేసితివి.
66. నాకు విజ్ఞాన వివేకములను ప్రసాదింపుము. నేను నీ ఆజ్ఞలను నమ్మితిని.
67. నీవు నన్ను శిక్షింపక పూర్వము నేను తప్పు ద్రోవ తొక్కెడివాడను. కాని ఇప్పుడు నేను నీ మాట పాటింతును.
68. నీవు మంచివాడవు, మంచినే చేయుదువు. నీ కట్టడలను నాకు బోధింపుము.
69. గర్వాత్ములు నా మీద చాడీలు చెప్పినను నేను నిండుమనసుతో నీ ఉపదేశములు పాటింతును.
70. ఆ పొగరుబోతుల హృదయములు మొద్దుబారినవి కాని నేను నీ ధర్మశాస్త్రమునుచూచి ఆనందింతును
71. నేను శిక్షను అనుభవించుట మేలే అయినది. దానివలన నేను నీ కట్టడలను నేర్చుకొంటిని.
72. నీవు దయచేసిన ధర్మశాస్త్రము వేలకొలది వెండిబంగారు నాణెములకంటే మెరుగైనది.
73. నీ చేతులు నన్ను నిర్మించి, నాకు రూపము ఏర్పరచెను. నీ ఆజ్ఞలను నేర్చుకొను వివేకమును నాకు ప్రసాదింపుము.
74. నేను నీ వాక్యమును నమ్మితిని కనుక , నీపట్ల భయభక్తులు కలవారు నన్ను చూచి ఆనందింతురు.
75. ప్రభూ! నీ తీర్పులు న్యాయసమ్మతమైనవనియు, నీవు విశ్వసనీయుడవు కనుకనే నన్ను శిక్షించితివనియు నేను బాగుగా ఎరుగుదును.
76. ఈ దాసునికి నీవు బాస చేసినట్లే నీ కృప నన్ను ఓదార్చునుగాక!
77. నీవు నా మీద జాలి చూపినచో నేను బ్రతికిపోయెదను. నీ ధర్మశాస్త్రము నాకు సంతోషమును ఒసగును.
78. నా మీద అపదూరులు మోపు గర్వాత్ములు సిగ్గుచెందుదురుగాక! నేను నీ ఉపదేశములను ధ్యానించుకొందును.
79. నీపట్ల భయభక్తులు కలవారు, నా పక్షమును అవలంబించి తనకు నీ శాసనములను గ్రహింతురుగాక!
80. నేను నీ శాసనములను పూర్ణముగా పాటించి అవమానమునుండి తప్పుకొందునుగాక !
81. నీ రక్షణముకొరకు ఎదురు చూచి చూచి అలసిపోతిని. నేను నీ వాక్యమును నమ్మితిని.
82. నీవిచ్చినమాట కొరకు చూచి చూచి నా కన్నులు వాచినవి. నీవు నాకు ఓదార్పును ఎప్పుడొసగెదవు?
83. నేను పొగచూరిన ద్రాక్ష తిత్తివలె శిథిలమై పోయినపుడును నీ కట్టడలను విస్మరింపలేదు.
84. నీ దాసుడింక ఎంతకాలము వేచియుండవలెను? నన్ను హింసించువారిని నీవెప్పుడు తీర్పు తీర్చెదవు?
85. నీ ధర్మశాస్త్రమును లెక్కచేయని పొగరుబోతులు నన్ను కూలద్రోయుటకు గోతులు త్రవ్విరి.
86. నీ ఆజ్ఞలన్నియు నమ్మదగినవి. ఆ శత్రువులు బొంకులాడి నన్ను హింసించుచున్నారు నీవు నన్ను ఆదుకొనుము.
87. వారు నన్ను నాశనము చేయునంత పనిచేసిరి. కాని నేను నీ ఉపదేశములను విడనాడనైతిని.
88. నీవు కృపామయుడవు కనుక నాకు జీవమునిమ్ము. నేను నీ శాసనములను పాటింతును.
89. ప్రభూ! నీవు కలకాలము నిలుచుదువు. నీ వాక్యము ఆకసమున శాశ్వతముగానుండును.
90. నీ విశ్వసనీయత యుగయుగములు ఉండును. నీవు భూమిని నెలకొల్పగా అది స్థిరముగా నిల్చియున్నది.
91. నీ ఆజ్ఞవలన ఎల్ల వస్తువులును నిల్చియున్నవి. అవియెల్ల నీకు సేవలు చేయుచున్నవి.
92. నీ ధర్మశాస్త్రము నాకు ఆనందమును , ఒసగియుండనిచో నాకు సంభవించిన శ్రమలవలన , నేను నాశనమైపోయెడివాడనే.
93. నేను నీ ఉపదేశములను ఎన్నడును విస్మరింపను నీవు వానిద్వారా నేను బ్రతికియుండునట్లు చేసితివి.
94. నేను నీవాడను, నన్ను రక్షింపుము. నేను నీ ఉపదేశములను పాటించుచున్నాను.
95. దుష్టులు నన్ను నాశనము చేయనెంచిరి. కాని నేను నీ శాసనములను ధ్యానించుకొనుచున్నాను.
96. నాకు ప్రతిదానిలోను కొరత కన్పించినది. నీ ఆజ్ఞలు మాత్రము పరిపూర్ణమైనవి.
97. నీ ధర్మశాస్త్రమనిన నాకు మిక్కిలి ఇష్టము. నేను దినమెల్ల దానిని మననము చేసికొనుచుందును.
98. నీ ఆజ్ఞలు నిత్యము నా చెంతనున్నవి. వానిద్వారా నా శత్రువులకంటెను నన్ను వివేకవంతుని చేసితివి.
99. నీ శాసనములను ధ్యానించుకొనుట వలన నా ఉపదేశకులందరికంటెను నేను ఎక్కువ గ్రహించితిని.
100. నీ ఉపదేశములను పాటించుటవలన నేను వృద్దులకంటె ఎక్కువ జ్ఞానమును ఆర్జించితిని.
101. నీ వాక్యమును అనుసరింపకోరితిని కనుక నేను దుష్టకార్యములనెల్ల విడనాడితిని.
102. నేను నీ విధులనుండి వైదొలగలేదు నీవే స్వయముగా నాకు బోధచేసితివి.
103. నీ వాక్కులు నా నోటికి తీయగానున్నవి. తేనెకంటె మధురముగానున్నవి.
104. నీ ఉపదేశమువలన నాకు జ్ఞానము కలుగును. దుష్టవర్తనము నాకు గిట్టదు.
105. నీ వాక్కు నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగు.
106. న్యాయయుక్తములైన నీ విధులను పాటింతునని పూర్వము నేను చేసిన ప్రమాణమును నిలబెట్టుకొందును.
107. ప్రభూ! నా వ్యధలు ఘోరమైనవి. నీ మాట చొప్పున నన్ను బ్రతికింపుము.
108. ప్రభూ! నా వందన సమర్పణను అంగీకరింపుము. నీ విధులను నాకు నేర్పింపుము.
109. నేను నా ప్రాణమును అర్పించుటకు ఎప్పుడును సిద్ధముగనే ఉన్నాను. నీ ధర్మశాస్త్రమును నేను ఎప్పుడును విస్మరింపలేదు
110. దుష్టులు నాకు వలపన్నిరి. అయినను నేను నీ ఉపదేశములనుండి వైదొలగలేదు.
111. నీ శాసనములను నేను శాశ్వత వారసత్వముగా చేసికొంటిని. అవి నా హృదయమునకు ఆనందమును ఒసగును.
112. నేను మరణమువరకును నీ కట్టడలను పాటింపబూనితిని.
113. రెండు నాలుకల నరులను నేను అసహ్యించుకొందును. నీ ధర్మశాస్త్రము అనిన నాకిష్టము.
114. నాకు ఆశ్రయమును, డాలును నీవే.. నేను నీ వాక్యమును నమ్మితిని.
115. దుష్టులారా! మీరు నా చెంతనుండి దూరముగా తొలగిపొండు. నేను నా దేవుని ఆజ్ఞలను పాటింతును.
116. నీ మాటచొప్పున నన్ను ఆదుకొనుము. నేను బ్రతికిపోయెదను. నీవు నా ఆశను వమ్ము చేయకుము.
117. నీవు నాకు సాయము చేసినచో నేను భద్రముగా మనుదును. ఆ నేను నిత్యము నీ కట్టడలను గైకొందును.
118. నీ కట్టడలను మీరినవారిని నీవు నిరాకరింతువు. వారి కపటవర్తనము చెల్లదు.
119. నీవు దుష్టులను కసవువలె చూతువు. కావున నేను నీ శాసనములను అభిమానించితిని.
120. నేను నిన్ను చూచి గడగడ వణకుదును. నీ విధులకు నేను భయపడుదును.
121. నేను న్యాయమును, ధర్మమును పాటించితిని. నన్ను శత్రువుల చేతికి అప్పగింపకుము.
122. నీవు ఈ దాసునికి హామీగా ఉండుము. ! గర్వాత్ములు నన్ను పీడింపకుండ అడ్డుపడుము.
123. నీ రక్షణ కొరకును నీతిగల నీ మాట కొరకును ఎదురు చూచి చూచి నా కన్నులు వాచినవి.
124. ఈ దాసుని కృపతో బ్రోవుము. నీ కట్టడలను నాకు బోధింపుము.
125. నేను నీ సేవకుడను, నీవు నాకు వివేకము యిచ్చినచో నేను నీ శాసనములను గ్రహింతును.
126. ప్రభూ! ప్రజలు నీ ధర్మశాస్త్రమును మీరుచున్నారు. నీవు జోక్యము చేసికొనుటకిది తరుణము.
127. బంగారముకంటెను, మేలిమి బంగారముకంటెను ఎక్కువగా నేను నీ కట్టడలను ఆశింతును.
128. కనుక నీ ఆజ్ఞల ప్రకారము నా జీవితమును దిద్దుకొందును. అసత్యమార్గములను నేను అసహ్యించుకొందును.
129. నీ శాసనములు అద్భుతమైనవి. కావున నేను వానిని పాటింతును.
130. నీ వాక్యముల వివరణము వెలుగును దయచేయును. తెలివిలేనివారికి తెలివి పుట్టించును.
131. నీ ఆజ్ఞల మీదగల మిక్కుటమైన కోర్కెచే నేను నోరుతెరచి ఆరాటము చెందుచున్నాను.
132. నీ నామమును ప్రేమించువారిని నీవు అనుగ్రహింతువు కనుక నావైపు దృష్టి మరల్చి నన్ను కరుణింపుము.
133. నీ వాక్యమును బట్టి నన్ను పడిపోనీకుండ కాపాడుము. నేను చెడుకు లొంగిపోకుండునట్లు చేయుము.
134. పీడకులనుండి నన్ను రక్షింపుము. నేను నీ ఉపదేశములను పాటింతును.
135. నీ ముఖకాంతిని ఈ దాసునిమీద ప్రసరింపజేయుము. నీ కట్టడలను నాకు బోధింపుము.
136. ప్రజలు నీ ధర్మశాస్త్రమును పాటింపకపోవుటను చూచి నేను కన్నీరు ఏరులుగా కార్చుచున్నాను.
137. ప్రభూ! నీవు నీతిమంతుడవు. నీ విధులు న్యాయమైనవి.
138. నీవు దయచేసిన శాసనములు న్యాయయుక్తములును, విశ్వసనీయములును అయినవి.
139. నా శత్రువులు నీ వాక్యమును అనాదరము చేయుచున్నారు గాన కోపము నన్ను దహించివేయుచున్నది.
140. నీ వాక్యము నమ్మదగినది, అది నీ దాసునికి ప్రీతిపాత్రమైనది.
141. నేను అల్పుడను, తిరస్కృతుడను. అయినను నేను నీ ఉపదేశమును విస్మరింపను.
142. నీ నీతి శాశ్వతముగా నిల్చును. నీ ధర్మశాస్త్రము సత్యసమ్మతము.
143. నేను వేదనలకును విచారమునకును గురియైతిని కాని నీ ఆజ్ఞలు నాకు ప్రమోదము చేకూర్చును.
144. నీ శాసనములు ఎప్పటికిని ధర్మయుక్తములైనవి. నాకు జ్ఞానమును అనుగ్రహింపుము, నేను బ్రతికిపోయెదను.
145. ప్రభూ! నేను పూర్ణహృదయముతో నీకు మొర పెట్టితిని. నా వేడికోలును ఆలింపుము. నేను నీ కట్టడలను పాటింతును.
146. నేను నీకు మొరపెట్టుకొనుచున్నాను, నన్ను కాపాడుము. నేను నీ శాసనములను గైకొందును.
147. వేకువనే లేచి నేను నీ సహాయమును అర్థింతును. నేను నీ వాగ్దానమును నమ్మితిని.
148. నేను రేయెల్ల మేల్కొనియుండి నీ వాక్యములను ధ్యానించుకొందును.
149. ప్రభూ! నీవు కృపామయుడవుగాన నా వేడుకోలును ఆలింపుము. యావే! నీ వాక్య విధులను బట్టి నా ప్రాణమును కాపాడుము.
150. క్రూరులైన పీడకులు నన్ను సమీపించుచున్నారు. వారు ఏనాడును నీ ధర్మశాస్త్రమును పాటింపలేదు.
151. కాని ప్రభూ! నీవు నాకు చేరువలోనేయున్నావు. నీ కట్టడలన్నియు సత్యములు.
152. నీ శాసనములు శాశ్వతమైనవని నాకు పూర్వమునుండియే తెలియును.
153. నా బాధలను గుర్తించి నన్ను కాపాడుము. నేను నీ ధర్మశాస్త్రమును విస్మరింపలేదు.
154. నీవు నా పక్షమున వాదించి నన్ను రక్షింపుము. నీ వాక్యము ప్రకారము నాకు జీవమును ఇమ్ము.
155. దుష్టులు నీ శాసనములను పాటింపరు. కనుక వారికి రక్షణము లేదు.
156. ప్రభూ! నీవు నాపట్ల మిగుల నెనరు చూపితివి. నీ విధుల ప్రకారము నాకు జీవమును ఇమ్ము.
157. నాకు శత్రువులును, పీడకులును చాలమంది ఉన్నారు. అయినను నేను నీ శాసనములనుండి వైదొలగలేదు
158. ఆ దుష్టులను చూడగా నాకు అసహ్యము కలుగుచున్నది. వారు నీ వాక్యములను పాటింపరు.
159. ప్రభూ! నీ ఆజ్ఞలనిన . నాకెంత ఇష్టమో చూడుము. నీవు కృపకలవాడవు కనుక నాకు జీవమునిమ్ము.
160. నీ వాక్యమునందలి ముఖ్యగుణము సత్యము. నీ న్యాయవిధులన్నియు కలకాలము నిల్చును.
161. అధికారులు నన్ను నిష్కారణముగా హింసించిరి. అయినను నేను నీ వాక్యముపట్ల భయభక్తులు చూపుదును.
162. పెన్నిధిని కనుగొనినవానివలె నేను నీ వాక్యములను చూచి ఆనందింతును.
163. అబద్దమనిన నాకు అసహ్యము. నీ ధర్మశాస్త్రమనిన నాకు పరమప్రీతి.
164. న్యాయయుక్తములైన నీ విధులకుగాను దినమునకు ఏడుసార్లు నేను నీకు వందనములు అర్పింతును.
165. నీ ధర్మశాస్త్రమును చేకొనువారు, మిక్కుటమైన శాంతిని బడయుదురు. వారు కాలుజారి పడిపోరు.
166. ప్రభూ! నేను నీ రక్షణముకొరకు ఎదురుచూచుచున్నాను. నేను నీ ఆజ్ఞలను పాటింతును.
167. నేను నీ శాసనములను గైకొందును. అవి నాకు ప్రీతిని కలిగించును.
168. నేను నీ ఉపదేశములను శాసనములను పాటింతును. నీ కార్యములెల్ల నాకు తెలియును
169. ప్రభూ! నా వేడుకోలు నీ సన్నిధిని చేరునుగాక! నీ మాటచొప్పున నాకు వివేకమును దయచేయుము.
170. నా విన్నపము నీ సన్నిధిని చేరునుగాక! నీవు మాట యిచ్చినట్లే నన్ను రక్షింపుము.
171. నీవు నీ కట్టడలను నాకు బోధించితివి కనుక నా పెదవులు నిన్ను స్తుతించును.
172. నీ ఆజ్ఞలు న్యాయయుక్తములు, నా నాలుక నీ వాగ్దానములను కీర్తించును.
173. నేను నీ ఉపదేశములను చేకొంటిని. నీవు నన్ను ఆదుకొనుటకు నీ హస్తము సిద్ధముగా నుంచుము.
174. ప్రభూ! నేను నీ రక్షణముకొరకు ఆశగొనియున్నాను. నీ ధర్మశాస్త్రము నాకు ఆనందము నొసగును.
175. నేను నిన్ను స్తుతించుటకు దీర్ఘకాలము జీవింతునుగాక! నీ విధులు నాకు సాయము చేయునుగాక!
176. నేను మందతప్పిన గొఱ్ఱెవలె తిరుగాడజొచ్చితిని. నీ దాసుని వెదకుటకు రమ్ము. నేను నీ ఆజ్ఞలను విస్మరింపలేదు.