ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

Psalms 116

1. ప్రభువు నా మొర వినును కనుక నేను ఆయనను ప్రేమింతును. ఆయన నా విన్నపమును ఆలకించును.
2. నేను మొర పెట్టినపుడెల్ల నా జీవితకాలమంత ఆయన చెవియొగ్గి ఆలించును.
3. మృత్యుపాశములు నన్ను చుట్టుకొనెను. పాతాళ వేదనలు నన్ను చుట్టుముట్టెను. భయవిచారములు నన్ను క్రమ్ముకొనెను.
4. అప్పుడు నేను ప్రభువునకు మొర పెట్టితిని. “ఓ ప్రభూ! నీవు నన్ను రక్షింపుము” అని వేడుకొంటిని.
5. ప్రభువు దయాళుడు, న్యాయవంతుడు, మన దేవుడు జాలికలవాడు.
6. ప్రభువు నిష్కపటహృదయులను కాపాడును. నేను ఆపదలోనున్నపుడు ఆయన నన్ను ఆదుకొనెను.
7. నా ప్రాణమా! నీవు నమ్మకముతో ఉండుము. ప్రభువు నీకు మేలు చేసెను.
8. ఆయన నన్ను మ త్యువునుండి రక్షించెను. నా కన్నీటిని తుడిచెను. నన్ను జారిపడి పోనీయడయ్యెను.
9. కనుక నేను ప్రభువు సన్నిధిలో జీవవంతుల లోకములో సంచరింతును.
10. “నేను సర్వనాశనమైపోతిని” అని అనుకొన్నప్పుడు గూడ నా నమ్మకమును కోల్సోనైతిని
11. నేను భయమునకు లొంగి, “ఏ నరుని నమ్మగూడదు” అనుకొంటిని.
12. ప్రభువు నాకు చేసిన ఉపకారములకుగాను ఆయనకు ఏమి అర్పింపగలను?
13. రక్షణపాత్రమును చేత పుచ్చుకొని, కృతజ్ఞతావందనములు చెల్లింతును.
14. ప్రభు ప్రజలందరు ప్రోగైన సమాజమున నా మ్రొక్కులు చెల్లించుకొందును.
15. భక్తిమంతుల మరణము ప్రభువునకు మిగులవిలువగలది.
16. ప్రభూ ! నేను నీ దాసుడను. నీ దాసుడను, నీ దాసురాలి కుమారుడను. నీవు నా మృత్యుబంధములను తెంచితివి.
17. నేను నీకు కృతజ్ఞతాబలిని అర్పింతును. నీ నామమునకు వందనములు చెల్లింతును,
18-19. ప్రభువు ప్రజలందరును ప్రోగైన సమాజమున, ఓ యెరూషలేమా! నీ మధ్యనున్న ప్రభువు దేవాలయమున నా మ్రొక్కులు చెల్లించుకొందును. మీరు ప్రభువును స్తుతింపుడు.

Copyright © 2025 Telugu Catholic Bible All Rights Reserved | Website Designed by HyderHub Web Services