1. “ప్రభువు మంచివాడు కనుక ఆయనకు వందనములు అర్పింపుడు. ఆయన కృపకలకాలము నిలుచును”.
2. ప్రభువునుండి రక్షణము బడసినవారెల్ల పై పలుకులు ఉచ్చరింపుడు. ఆయన మిమ్ము శత్రువులనుండి కాపాడును.
3. అన్యదేశములనుండి, తూర్పు పడమరలనుండి, ఉత్తరదక్షిణములనుండి మిమ్ము తోడ్కొనివచ్చెను.
4. కొందరు దారులులేని ఎడారులలో తిరుగాడుచు జనావాసయోగ్యమైన నగరమునకు త్రోవకానరైరి.
5. వారు ఆకలిదప్పులకు గురియై సొమ్మసిల్లిపోయిరి.
6. అంతట వారు తమ శ్రమలలో ప్రభువునకు మొర పెట్టగా ఆయన కేశములోనుండి వారిని కాపాడెను.
7. వారిని తిన్నని మార్గమున కొనిపోయి జనావాసయోగ్యమైన నగరమునకు చేర్చెను.
8. ప్రభువు కృపకుగాను, అతడు నరులకు చేసిన అద్భుతకార్యములకుగాను, వారు అతనికి వందనములు అర్పింపవలయును.
9. అతడు దాహముగొనినవారి దప్పిక తీర్చును. ఆకలిగొనినవారికి మేలి వస్తువులు ఒసగును.
10. మరికొందరు నిరాశాపూరితమైన అంధకారమున వసించుచు, బాధగొల్పు ఇనుప సంకెళ్ళచే బంధింపబడియుండిరి.
11. దేవుని ఆజ్ఞలను ధిక్కరించిరిగాన, మహోన్నతుని ఉపదేశములను నిరాకరించిరిగాన, వారు అట్టి శిక్ష తెచ్చుకొనిరి.
12. వారు ఘోర శ్రమలవలన క్రుంగిపోయి కూలి పడిపోయినను లేవనెత్తువారు లేరైరి.
13. అంతట ఆ జనులు తమ శ్రమలలో ప్రభువునకు మొరపెట్టగా, ఆయన కేశములనుండి వారిని విడిపించెను.
14. నిరాశాపూరితమైన అంధకారమునుండి వారిని వెలుపలికి కొనివచ్చి, వారి సంకెళ్ళను ఛేదించెను.
15. ప్రభువు కృపకుగాను, అతడు నరులకు చేసిన అద్భుతకార్యములకుగాను వారు అతనికి వందనములు అర్పింపవలయును.
16. అతడు ఇత్తడి తలుపులను పగులగొట్టును. ఇనుప గడెలను విరుగగొట్టును.
17. మరికొందరు బుద్ధిహీనులై పాపముచేసి బాధలు తెచ్చుకొనిరి. తమ అపరాధములకుగాను వేదనలు తెచ్చుకొనిరి.
18. వారికి ఏ ఆహారము రుచింపదయ్యెనుగాన మృత్యుద్వారమునకు చేరువ అయిరి.
19. అంతట వారు తమ శ్రమలలో ప్రభువునకు మొరపెట్టగా ఆయన క్లేశమునుండి వారిని కాపాడెను.
20. తన ఆజ్ఞతో వారి రోగములు కుదిర్చి సమాధినుండి వారిని రక్షించెను.
21. ప్రభువు కృపకుగాను, అతడు నరులకు చేసిన అద్భుతకార్యములకుగాను వారు ఆయనకు వందనములు అర్పింపవలయును.
22. దేవునికి కృతజ్ఞతాబలులు అర్పించి, ఆనందనాదముతో ఆయన ఉపకారములను ఎల్లరికి వెల్లడిచేయవలయును.
23. ఇంకను కొందరు ఓడనెక్కి సముద్రయానము కావించుచు, జలనిధిమీద వ్యాపారము చేయుచుండిరి.
24. వారు ప్రభువు చెయిదములను చూచిరి. ఆయన సాగరమున చేయు అద్భుతకార్యములను గ్రహించిరి.
25. ఆయన ఆజ్ఞాపింపగనే తుఫాను చెలరేగి పెద్ద అలలను లేపెను.
26. అది ఓడలను ఆకాశమువరకు లేపి సాగర గర్భమున ముంచివేసెను. అట్టి విపత్తులో వారు ధైర్యము కోల్పోయిరి.
27. మత్తెక్కిన వారివలె తూలి జారిపడిరి. వారి నైపుణ్యము వారికి అక్కరకు రాదయ్యెను.
28. అంతట వారు తమ శ్రమలలో ప్రభువునకు మొరపెట్టగా ఆయన కేశములనుండి వారిని కాపాడెను.
29. ఆయన తుఫానును అణచివేయగా, తరంగములు సమసిపోయెను.
30. వాతావరణము ప్రశాంతముకాగా బాటసారులు సంతసించిరి. ప్రభువు వారిని తాము కోరిన రేవునకు చేర్చెను.
31. ప్రభువు స్థిరమైన కృపకుగాను, ఆయననరులకు చేసిన అద్భుతకార్యములకుగాను వారు ఆయనకు వందనములు అర్పింపవలయును
32. భక్తసమాజము ఆయనను కొనియాడవలయును. పెద్దల సభలో ఆయనను వినుతింపవలయును.
33. ప్రభువు నదులను ఎడారులనుగా మార్చెను. నీటి బుగ్గలు ఎండిపోవునట్లు చేసెను.
34. సారవంతమైన నేలలను చౌటిపర్రెలు గావించెను. అచట వసించు నరుల దుష్టవర్తనమునకుగాను ఆయన అటులచేసెను.
35. ఆయన ఎడారిని జలమయము గావించెను. మరుభూమిలో నీటి బుగ్గలు పుట్టించెను.
36. ప్రభువు ఆకలిగొనిన ప్రజలకు అచట నివాసము కల్పింపగా, వారచట నివాసయోగ్యమైన పట్టణమును నిర్మించుకొనిరి.
37. ఆ ప్రజలు అచట పైరువేసి ద్రాక్షలు నాటగా, విస్తారమైన పంట చేతికి వచ్చెను.
38. ప్రభువు ఆ జనులను దీవింపగా వారికి పెక్కుమంది బిడ్డలు పుట్టిరి. ఆయన వారి మందలను వృద్ధిలోనికి తెచ్చెను.
39. దైవప్రజలు సంఖ్యలో తగ్గిపోయి అవమానమున మునిగియుండిరి. శత్రువులు వారిని క్రూరముగా హింసించి పీడించిరి.
40. కాని ప్రభువు వారి పాలకులను చిన్నచూపు చూచి, వారు దారులులేని ఎడారులలో తిరుగాడునట్లు చేసెను.
41. ఆయన దుఃఖార్తులను బాధలనుండి తప్పించెను. వారి కుటుంబములను గొఱ్ఱెలమందలవలె వృద్ధిలోనికి తెచ్చెను.
42. ఈ సంఘటనమునుచూచి సజ్జనులు సంతసింతురు దుష్టులు మాత్రము నోరు మూసికొందురు.
43. బుద్ధిమంతులు ఈ విషయములెల్ల . ఆలోచించి చూచి, ప్రభువు ప్రేమ ఎట్టిదో అర్థము చేసికొందురుగాక!