1. ప్రభువునకు కృతజ్ఞతలు అర్పింపుడు. ఆయన నామమును, మాహాత్మ్యమును ఉగ్గడింపుడు. ఆయన మహాకార్యములను జాతులకు విశదము చేయుడు.
2. ఆయనను కీర్తించి స్తుతింపుడు. ఆయన అద్భుతకార్యములనెల్ల వెల్లడిచేయుడు.
3. పవిత్రుడైన ప్రభువునకు చెందియున్నందుకు గర్వింపుడు. ఆయనను సేవించువారెల్ల సంతసింపుడు.
4. ప్రభువును వెదకుడు, ఆయన బలమును వెదకుడు నిరతము ఆయనను పూజింపుడు.
5-6. ప్రభువు దాసుడైన అబ్రహాము సంతతి వారును, ప్రభువు ఎన్నుకొనిన యాకోబు వంశజులునైన మీరు ఆయన సల్పిన అద్భుత కార్యములను, ఆయనచేసిన నిర్ణయములను జ్ఞప్తికి తెచ్చుకొనుడు.
7. ఆయన మన దేవుడైన ప్రభువు. ఆయన తీర్పులు భూమికంతటికిని వర్తించును.
8. ఆయన తన నిబంధనమును నిత్యము పాటించును. తన వాగ్దానములను నిరతము నిల్పుకొనును.
9. అబ్రహామునకు తాను చేసిన ప్రమాణములను, ఈసాకునకు తాను చేసిన బాసను కలకాలము నిల్పుకొనును.
10. ఆయన యాకోబుతో ఒప్పందము చేసికొనెను. అది ఎల్లకాలమును ఉండునది.
11. “నేను కనాను మండలమును నీకు ఇత్తును. అది నీకే భుక్తమగును” అని ఆయన సెలవిచ్చెను.
12. ఆ కనాను మండలమున ప్రభువు ప్రజలు కొద్దిమందియైయుండిరి. పరదేశులుగా కూడ గణింపబడిరి.
13. వారు దేశమునుండి దేశమునకు, రాజ్యమునుండి రాజ్యమునకు ప్రయాణము చేసిరి.
14. కాని ప్రభువు వారిని ఎవరి పీడకును గురిచేయలేదు. ఆయన రాజులను మందలించి ఆ ప్రజలను కాపాడెను.
15. "నేను అభిషేకించినవారిని మీరు ముట్టుకొనకుడు నా ప్రవక్తలకు మీరు హానిచేయకుడు" అని పలికెను.
16. అటుతరువాత ప్రభువు దేశము మీదికి కరువు రప్పించి ప్రజల జీవనాధారమైన ఆహారమును దొరకకుండ చేసెను.
17. కాని ఆయన ఆ జనులకు ముందుగా ఒక నరుని పంపెను. అతడే బానిసగా అమ్ముడుపోయిన యోసేపు.
18. జనులు అతని కాళ్ళకు సంకెళ్ళువేసి అతని మెడకు ఇనుప వలయమును తొడిగిరి.
19. ఆ పిమ్మట యోసేపు చెప్పిన సంగతి నెరవేరెను. ప్రభువు వాక్కు అతని సత్యమును నిరూపించెను.
20. అపుడు రాజు అతనిని చెరసాలనుండి విడిపించెను జాతుల నేత అతనికి విముక్తిని ప్రసాదించెను.
21. అతడు యోసేపును, తన ప్రభుత్వమునకు అధిపతిని చేసెను, తన రాజ్యమునకు అంతటికిని పాలకుని గావించెను.
22. యోసేపు రాజోద్యోగులకు అధికారి అయ్యెను. రాజు సలహాదారులకు విజ్ఞానమును ఉపదేశించెను.
23. అంతట యాకోబు ఐగుప్తునకు వలసవెళ్ళి ఆ దేశమున స్థిరపడెను.
24. ప్రభువు అచట తన ప్రజలను తామరతంపరగా వృద్ధి చేసెను. వారిని తమ శత్రువులకంటెను బలవంతులను చేసెను.
25. ఆయన ఐగుప్తీయులు యిస్రాయేలీయులను ద్వేషించి వారిపట్ల కపటముగా వర్తించునట్లు చేసెను.
26. అంతట ప్రభువు తన సేవకుడైన మోషేను తాను ఎన్నుకొనిన అహరోనును పంపెను.
27. వారు అచట ప్రభువు మహాకార్యములను చేసి చూపిరి. ఆయన హాము దేశమందు అద్భుతకార్యములను ప్రదర్శించెను.
28. ప్రభువు అంధకారమును పంపగా చిమ్మచీకట్లు క్రమ్మెను. కాని ఐగుప్తీయులు ఆయన ఆజ్ఞను లెక్కచేయలేదు
29. ఆయన వారి జలములను నెత్తురుగా మార్చెను. వానిలోని చేపలనెల్ల చంపివేసెను.
30. వారి దేశము కప్పలకు ఆలవాలమయ్యెను. రాజప్రాసాదము కూడ కప్పలతో నిండిపోయెను.
31. ప్రభువు ఆజ్ఞాపించినదే తడవుగా , ఈగల గుంపును, దోమలును దేశమందెల్ల నిండిపోయెను.
32. ఆయన ఆ దేశమున వానకు బదులుగా వడగండ్ల వాన కురియించెను. తళతళలాడు మెరుపులు కలిగించెను.
33. వారి ద్రాక్షతోటలను, అత్తితోటలను ధ్వంసము చేసెను. దేశములోని చెట్లనెల్ల విరుగగొట్టెను.
34. ఆయన ఆజ్ఞ ఈయగా మిడుతలు వచ్చెను. లెక్కలకందని చీడపురుగులు వచ్చెను.
35. అవి దేశములోని మొక్కలనెల్ల తినివేసెను. నేల మీది పైరులనెల్ల మ్రింగివేసెను.
36. ఆయన ఆ దేశీయుల ప్రథమ సంతానమునెల్ల, వారికి పుట్టిన తొలిచూలు పిల్లలనెల్ల సంహరించెను
37. అటు తరువాత ఆయన తన ప్రజలను తోడ్కొనిపోయెను. ఈ వారు వెండిబంగారములతో వెడలిపోయిరి. వారి తెగలలో దుర్భలుడు ఒక్కడును లేడయ్యెను.
38. ఐగుప్తీయులు ఆ ప్రజలను చూచి భయపడిరి. వారు వెడలిపోయినందులకు సంతసించిరి.
39. ఆయన తన ప్రజలను మేఘముతో కప్పెను. రేయి వారికి వెలుగు నిచ్చుటకుగాను అగ్నిని కలిగించెను.
40. వారు అడుగగనే ఆయనపూరేడు పిట్టలను ఒసగెను ఆకాశమునుండి ఆహారముతో వారిని సంతృప్తి పరచెను.
41. ఆయన రాతిని బద్దలు చేయగా నీళ్ళు ఉబికివచ్చెను. అవి ఎడారిలో ఏరులైపారెను.
42. ఆయన తన దాసుడైన అబ్రహామునకు చేసిన పవిత్ర వాగ్దానమును జ్ఞప్తికి తెచ్చుకొనెను.
43. తాను ఎన్నుకొనిన ప్రజలను వెలుపలికి తోడ్కొని వచ్చెను. వారు సంతసముతో పాడుచు కేరింతలు కొట్టిరి.
44. ఆయన వారికి అన్యజాతుల భూములను ఇచ్చెను. అన్యుల శ్రమ ఫలము వారికి దక్కెను.
45. ఆ జనులు మాత్రము తన కట్టడలను గైకొని, తన ధర్మశాస్త్రమును పాటింపవలెనని ఆయన నియమము చేసెను.