ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

Psalms 102

1. ప్రభూ! నాప్రార్ధనను ఆలింపుము. నా మొర నీ సన్నిధిని చేరునుగాక!
2. నేను ఆపదలో చిక్కుకోగా నీ మొగమును నానుండి మరుగు చేయకుము. నీ చెవియొగ్గి నా వేడుకోలును ఆలింపుము. నా మొరను సత్వరమే వినుము.
3. నా ఆయుస్సు పొగవలె గతించుచున్నది. నా ఒడలు పొయ్యివలె వేడిగానున్నది.
4. నా హృదయము ఎండినగడ్డివలె వాడిపోయినది. నేను తినుటయే మరచితిని.
5. నేను పెద్దగా నిట్టూర్పులు విడుచు శబ్దమువలన నా ఎముకలు బయటికి కన్పించుచున్నవి.
6. నేను ఎడారిలోని ఉష్ణపక్షివలెను, ఆ పాడుబడిన ఇంటిలోని గుడ్లగూబవలెనున్నాను.
7. నాకు నిద్దుర పట్టుటలేదు. . నేను ఇంటి కప్పుమీద వాలియున్న ఒంటి పక్షివలెనున్నాను. 
8. దినమెల్ల శత్రువులు నన్ను నిందించుచున్నారు. నన్ను గేలిచేయుచు శపించుచున్నారు.
9. నేను ఆహారముగ బూడిద తినుచున్నాను. పానీయములో నా కన్నీళ్ళు కలుపుకొని త్రాగుచున్నాను.
10. నీ ఉగ్రకోపమువలన నాకు ఈ గతి పట్టినది. నీవు నన్ను పైకెత్తి క్రిందపడవేసితివి.
11. నా జీవితము సాయంకాలపు నీడవలెనున్నది. నేను ఎండబారిన గడ్డివంటి వాడనైతిని.
12. కాని ప్రభూ! నీవు శాశ్వతముగా జీవించువాడవు. ఎల్లతరములవారును నిన్ను స్మరించుకొందురు.
13. లెమ్ము, సియోనును కనికరింపుము. ఆ నగరముమీద దయ జూపవలసిన సమయము వచ్చినది.  నిర్ణీతకాలము ఆసన్నమైనది.
14. నీ దాసులు ఆ శిథిలనగర శిలలను ఆదరముతో చూతురు. దాని ధూళిని కనికరముతో చూతురు.
15. జాతులు ప్రభువు నామమునకు భయపడును. నేలమీది రాజులు ఆయన మహిమనుజూచి గడగడలాడుదురు.
16. ప్రభువు సియోనును పునర్నిర్మించినపుడు ఆయన మాహాత్మ్యము వెల్లడియగును.
17. ఆయన పరిత్యక్తులైన తన ప్రజల మన మొరలు అలించును. వారీ వేడికోలును చెవినిబెట్టును.
18. భావితరముల వారికొరకు ఈ అంశమును లిఖించి ఉంచుడు. రానున్న తరములవారు అతనిని ప్రశంసింతురు.
19. ప్రభువు ఉన్నతమైన తన పవిత్ర స్థలమునుండి క్రిందకి పారజూచెను. ఆకసమునుండి భువికి దృష్టిని మరల్చెను.
20. ఆయన బందీల నిట్టూర్పులు వినెను. మృత్యువువాత పడనున్నవారిని చెరనుండి విడిపించెను.
21-22. కావున జాతులును, రాజ్యములును ఏకమై వచ్చి ప్రభువును పూజించును. సియోనున అతని నామమును సన్నుతింతురు. యెరూషలేమున అతనిని కీర్తింతురు.
23. వార్ధక్యము రాకమునుపే ప్రభువు నన్ను బలహీనుని చేసెను. నా ఆయుష్కాలమును తగ్గించెను.
24. "ప్రభూ! నేను వృద్దుడను కాకమునుపే నీవు నన్ను కొనిపోవలదు. నీవు కలకాలము మనెడివాడవుకదా” అని నేను విన్నవించితిని.
25. పురాతన కాలముననే నీవు భూమికి పునాదులెత్తితివి.  నీ చేతులతోనే ఆకాశమును సృజించితివి.
26. భూమ్యాకాశములు గతించునుగాని నీవు నిల్చియుందువు. అవియెల్ల వస్త్రములవలె చినిగిపోవును. నీవు వానిని జీర్ణవస్త్రములవలె విడనాడుదువు. అవి గతించును.
27. కాని నీవు ఎల్లవేళల ఏకరీతిగా నుందువు. నీ ఆయుస్సునకు అంతము లేదు.
28. నీ దాసుల బిడ్డలు సురక్షితముగా నివసింతురు ఆ బిడ్డల బిడ్డలును నీ ప్రాపున భద్రముగా నిలుచుదురు