ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

Psalms 8

1. మా దేవుడైన ప్రభూ! నీ మాహాత్మ్యము భూమి యందంతట ఘనమైనది. ఆకాశము చూపట్టుచున్నది, కీర్తింపబడుచున్నది.
2. చంటిబిడ్డలు పసికందులు నిన్ను స్తుతింతురు.విరోధులను ఎదిరించుటకు నీవొక రక్షణ దుర్గమును నిర్మించితివి. దాని నుండి నీ శత్రువులను, నీ మీద తిరుగుబాటు చేయువారిని అణచివేయుదువు.
3. నీ చేతి పనితనముతో కలిగించిన ఆకాశమును, నీవు సృజించిన చంద్రతారకలను కాంచినేను విస్మయమొందితిని.
4. నీవు నరుని జ్ఞప్తికి తెచ్చుకొనుటకు అతడేపాటి వాడు? అల్పమానవుని పరామర్శించుటకు అతడు ఎంతటివాడు?
5. ఐనను నీవు నరుని నీ కంటెను కొంచెము తక్కువ వానిగా మాత్రమే చేసితివి. కీర్తి, మహిమలనే కిరీటముతో అతనిని అలంకరించితివి.
6-8. గొర్రెలు, ఎడ్లు, వన్యమృగములు, ఆకాశమందలి పక్షులు, సముద్రమందలి చేపలు, సాగరమందలి జలచరములు మొదలుకొని నీవు చేసిన సృష్టికంతటికిని అతనిని అధిపతిని గావించితివి. సమస్తమును అతని పాదముల క్రింద ఉంచితివి.
9. మా దేవుడెవైన ప్రభూ! నీ మాహాత్మ్యము భూమి యందంతట చూపట్టుచున్నది.