1. దేవా! నీవు మమ్ము శాశ్వతముగా విడనాడనేల? నీవు మేపెడి గొఱ్ఱెలపై నీ కోపము రగుల్కోనేల?
2. నీవు ప్రాచీనకాలముననే ఎన్నుకొనిన నీ ప్రజలను, నీవు స్వయముగా విమోచించి, నీ జాతినిగా చేసికొనినవారిని, నీవు వసించిన ఈ సియోను కొండను జ్ఞప్తికి తెచ్చుకొనుము.
3. పూర్తిగా ధ్వంసమైన ఈ శిథిలములమీద నీ కాళ్ళు మోపి నడువుము. శత్రువులు దేవాలయములోని వస్తువులనెల్ల నాశనము చేసిరి.
4. నీ భక్తులు గుమిగూడిన చోటుననే విరోధులు విజయనాదము చేసిరి, తమ జెండాలను నెలకొల్పిరి.
5. వారు గొడ్డళ్ళతో చెట్లు నరకు వడ్రంగులవలె కనబడిరి.
6. గొడ్డళ్ళతోను, సమ్మెటలతోను బొమ్మలు చెక్కిన కొయ్యపలకలను ధ్వంసము చేసిరి.
7. నీ నామమందిరమును అపవిత్రము చేసిరి. దేవాలయమును తగులబెట్టిరి.
8. మమ్ము సర్వనాశనము చేయు తలంపుతో “దేశములోని పవిత్రమందిరములనెల్ల కూల్చివేసెదము” అనుకొనిరి.
9. నేడు సూచకక్రియలు కరువు అయినవి. - ప్రవక్తలు లేరైరి, ఈ విపత్తు ఎంతకాలము కొనసాగునో తెలియదు.
10. దేవా! మా విరోధులు మమ్మెంతకాలము గేలిచేయవలయును? వారు నీ దివ్యనామమును సదా దూషింపవలసినదేనా?
11. నీవు మమ్మాదుకొనెడి నీ చేతిని వెనుకకు ముడుచుకొంటివేల? నీ వక్షము మీది కుడిచేతిని చాపి పన వారిని నాశనము చేయవేల?
12. దేవా! మొదటినుండియు నీవు మాకు రాజువు. భూమియందంతట రక్షణ కార్యములు నిర్వహించినవాడవు.
13. నీ మహాబలముతో నీవు సముద్రమును విభజించితివి. జలభుజంగముల తలలు చితుకకొట్టితివి.
14. రాకాసి మకరము శిరస్సులను చితుకగొట్టితివి. దాని శవమును వన్యమృగములకు ఆహారము కావించితివి.
15. నీవు నీటిబుగ్గను, ఏరులను పుట్టించితివి. జీవనదులు వట్టిపోవునట్లు చేసితివి.
16. పగలునీదే, రాత్రియునీదే సూర్యచంద్రులను నెలకొల్పితివి.
17. భూమికి సరిహద్దులేర్పరచితివి. వేసవిని, చలికాలమును సృజించితివి.
18. ప్రభూ! నీ శత్రువులు నిన్ను దూషించుటను, మూర్ఖులు నిన్ను అవమానించుటను జ్ఞప్తికి తెచ్చుకొనుము.
19. నీ పావురమును డేగపాలు చేయకుము. పీడితులైన నీ ప్రజలను శాశ్వతముగా విస్మరింపకుము.
20. నీ నిబంధనమును స్మరించుకొనుము. దేశములోని చీకటి చోటులెల్ల హింసకు ఆటపట్టులైనవి.
21. బాధితులు అవమానముతో వెనుదిరుగునట్లు చేయకుము. దీనులును, ఆర్తులునైన ప్రజలు నిన్ను స్తుతించునట్లు చేయుము.
22. దేవా! లెమ్ము! నీ పక్షమున నీవే వాదింపుము. మూర్ఖులు దినమెల్ల నిన్ను నిందించుచున్నారని విస్మరింపకుము.
23. నీ శత్రువుల ఘోషణను మరచిపోకుము. నీ విరోధుల నిరంతర గర్జనలు విస్మరింపకుము.