1. ప్రభూ! నేను నిన్ను ఆశ్రయించితిని. నేను ఏనాడును అవమానము చెందకుందునుగాక!
2. నీవు న్యాయవంతుడవు కనుక నన్ను ఆదుకొని రక్షింపుము. చెవియొగ్గి నా మొరవిని నన్ను కాపాడుము.
3. నీవు నాకు రక్షణదుర్గము అగుము. నాకు సురక్షితమైన కోటవై నన్ను రక్షింపుము. నాకు ఆశ్రయస్థానమును రక్షణశైలమును నీవే.
4. దేవా! దుష్టులబారినుండి నన్ను కాపాడుము. క్రూరులైన దుర్మార్గుల బెడదనుండి , నన్ను రక్షింపుము.
5. దేవా! నీవే నాకు దిక్కు నా నమ్మిక. యవ్వనము నుండియు నేను నిన్నే ఆశ్రయించితిని
6. నేను పుట్టిన నాటి నుండియు నిన్నే నమ్ముకొంటిని. తల్లి గర్భమునుండి నన్ను ఉద్భవింపజేసినవాడవు నీవే. నేను నిన్ను సదా కీర్తింతును.
7. నా జీవితముపలువురికి వింతగా కన్పించుచున్నది కాని నీవు నాకు బలమైన ఆశ్రయము.
8. దినమెల్ల నేను నిన్ను నోరార వినుతింతును, నీ మహిమను ఉగ్గడింతును.
9. నా ముసలితనమున నీవు నన్ను పరిత్యజింపకుము. నా బలము ఉడిగిన తరుణమున నీవు నన్ను చేయి విడువకుము.
10. నా విరోధులు నన్ను గూర్చి చెప్పుకొనుచున్నారు. నా ప్రాణములు తీయగోరి కుట్రలు చేయుచున్నారు.
11. “దేవుడు అతనిని విడనాడెను గనుక అతనిని వెన్నంటి పట్టుకొనుడు. అతనిని రక్షించువాడు ఇక ఎవడును లేడు" అని పలుకుచున్నారు.
12. దేవా! నీవు నాకు దూరముగా నుండవలదు. నా దేవా! నన్ను రక్షించుటకు శీఘ్రమే రమ్ము.
13. నా మీదికి ఎత్తి వచ్చువారు పరాభవము చెంది, నాశనమగుదురుగాక! నాకు కీడు తలపెట్టువారు నిందావమానములకు గురియగుదురుగాక!
14. నా ఆశాభావము ఎడతెగనిది. నిన్ను అధికాధికముగా స్తుతించెదను.
15. నేను నీ నీతిని ఉగ్గడింతును. దినమెల్ల నీ రక్షణమును ప్రకటింతును. ఆ రక్షణ కార్యములను నేను సరిగా అర్థము చేసికోజాలను.
16. ప్రభూ! నేను నీ మహాకార్యములనుగూర్చి ముచ్చటింతును. నీ నీతిని మాత్రమే ప్రకటింతును.
17. దేవా! బాల్యమునుండియు నీవు నాకు బోధచేసితివి నేను నేటివరకు నీ అద్భుతకార్యములను ప్రకటించుచునేయున్నాను.
18. దేవా! ఇప్పుడు నేను తలనెరసిన ముదుసలినైయుండగా, నీవు నన్ను విడనాడవలదు నేను భావితరముల వారికి నీ శక్తిని నీ బలమును తెలియజేయుటకుగాను నీవు నన్ను జీవించియుండనిమ్ము.
19. దేవా! నీ న్యాయము ఆకాశమును అంటుచున్నది. నీవు మహాకార్యములు చేసితివి, నీకు సాటివాడెవడును లేడు.
20. నీవు నన్ను పెక్కుశ్రమలకు కీడులకు గురిచేసితివి కాని నీవు నేను మరల కోలుకొనునట్లు చేయుదువు. పాతాళమునుండి నన్ను మరల వెలుపలికి కొనివత్తువు.
21. నీవు నన్ను పూర్వముకంటె అధికుని చేయుదువు. నా కష్టములలో నన్ను ఓదార్తువు.
22. దేవా! తంత్రీవాద్యముతో నేను నిన్ను సన్నుతింతును. నీ విశ్వసనీయతను కొనియాడెదను. పవిత్రుడవైన యిస్రాయేలు దేవా! సితారాతో నేను నీమీద పాటలుపాడెదను.
23. ఆనందనాదముతో నిన్ను కీర్తించెదను. నీవు నన్ను రక్షించితివి కనుక నిండుమనస్సుతో నీమీద కీర్తనలు పాడెదను.
24. నాకు కీడు తలపెట్టినవారు అవమానమున మునిగి తలవంపులు తెచ్చుకొనిరి. కనుక దినమెల్ల నేను నీ న్యాయమును ప్రకటించెదను.