1. ప్రభూ! నేను నిన్ను శరణు వేడుచున్నాను. నన్ను వెన్నాడు శత్రువుల నుండి నన్ను రక్షింపుము.
2. లేదేని వారు నన్ను సింగమువలె ఎత్తుకొని పోవుదురు, అప్పుడు నన్ను ఎవరును రక్షింపజాలరు. ఆ విరోధులు నన్ను ముక్కలు ముక్కలుగా చీల్చి వేయుదురు.
3. ప్రభూ! నేను దుష్కార్యములు చేసినచో,
4. ఉపకారము చేసిన నా మిత్రునికి అపకారము చేసినచో, నా విరోధిని నిష్కారణముగా దోచుకొని కీడు చేసినచో
5. నా శత్రువులు నన్ను తరిమి పట్టుకొందురు గాక! నన్ను క్రిందపడవేసి చంపి, నా ప్రాణ మును మట్టిపాలు చేయుదురు గాక! నన్ను నిర్జీవునిగా నేల మీద వదలివేయుదురు గాక!
6. ప్రభూ! నీవు కోపము తెచ్చుకొని పైకి లెమ్ము నాపై ఆగ్రహము చెందిన శత్రువుల మీదికి ఎత్తిరమ్ము. నన్నాదుకొనుటకై శీఘ్రమే మేల్కొనుము, వారికి తీర్పునిమ్ము. నీవు న్యాయమును అభిలషించువాడవు
7. జాతులనెల్ల నీ చుట్టు ప్రోగుచేయుము. పరము నుండి వారి మీద పరిపాలనము చేయుము.
8. ప్రభూ! నీవు సకల జాతులకు తీర్పుతీర్తువు. నా నీతికి, మంచితనముకు తగినట్లుగా నాకు తీర్పుచెప్పుము.
9. హృదయాలను పరిశీలించు నీతిగల దేవా! దుష్టుల దౌష్ట్యమును తుదిముట్టింపుము. నీతిమంతులను బహూకరింపుము. నీవు నీతిమంతుడవైన దేవుడవు, నరుల అలోచనలను కోర్కెలను పరిశీలించు వాడవు.
10. దేవుడు నన్ను డాలువలె కాపాడును. అతడు సజ్జనులను రక్షించును.
11. దేవుడు నీతిమంతుడైన న్యాయాధిపతిఅతడు పాపులనెల్లవేళల శిక్షించును.
12. నరుడు తన పాపములకు పశ్చాత్తాపపడదేని దేవుడు తన ఖడ్గమునకు పదును పెటును.
13. వింటిని మంచి ఎక్కుపెట్టును,మారణాయుధములను చేపట్టును,అగ్ని బాణములను రువ్వును.
14. దుష్టుడు దుష్టాలోచనలతో నిండియుండును. వాడు కుతంత్రములు పన్ని వంచనకు పాల్పడును.
15. అతడు పెద్ద గోతిని త్రవ్వును,కాని తాను త్రవ్విన గోతిలో తానే కూలును.
16. అతని దుష్టత్వము అతని నెత్తి మీదికే వచ్చును. అతడు చేయు హింస అతనినే బాధించును.
17. ప్రభుని నీతికిగాను నేను అతనికి వందనములు అర్పింతును. మహోన్నతుడైన దేవుని కీర్తనలతో నుతింతును.