1. దేవా! ప్రజలు సియోనున నిన్ను స్తుతింపవలెను. జనులు తమ మ్రొక్కులను నీకు చెల్లించుకోవలెను.
2-3. నీవు నరుల ప్రార్థనలను ఆలింతువు. ప్రజలెల్లరును తమ పాపములతో నీ చెంతకు రావలసినదే. మా పాపములు మమ్ము క్రుంగదీయునపుడు, నీవు వానిని తుడిచివేయుదువు.
4. నీ దేవాలయమున వసించుటకుగాను నీవే ఎన్నుకొని ఆహ్వానించిన నరుడు ధన్యుడు. నీ వాసస్థలమైన పవిత్రమందిరమునందలి మేలివస్తువులతో మేము సంతృప్తి చెందుదుము.
5. మాకు రక్షకుడవైన దేవా! నీవు నా మొరను ఆలింతువు. నీ అద్భుతకార్యములతో మమ్ము రక్షింతువు. నేల నాలుగుచెరగుల వసించువారును, సాగరముల కావల జీవించువారును నిన్నే నమ్ముదురు.
6. నీవు శక్తితో పర్వతములను నెలకొల్పుదువు. బలమును నడికట్టుగా ధరింతువు.
7. నీవు కడలిహోరును అణచివేయుదువు. సాగరతరంగముల ఘోషను ఆపివేయుదువు. జాతుల తిరుగుబాటును అణగదొక్కుదువు.
8. నీ అద్భుతక్రియలను చూచి భూమిమీద నరులెల్లరును భీతిల్లుదురు. తూర్పునుండి పడమరవరకున్న జనులెల్లరు నీ క్రియలనుగాంచి సంతోషనాదము చేయుదురు.
9. నీవు భూమిని సందర్శించి దానిపై వాన కురియింతువు. దానిని మహా ఐశ్వర్యముతో నింపుదువు. నీ నది నీటితో నిండియుండును. అవి ధాన్యమును ఒసగును, నీవు చేసిన కార్యమిది.
10. నీవు కుండపోతగా వాన కురియించి నేల దుక్కులు తడుపుదువు. మట్టి పెళ్ళలను కరిగించి చదునుచేయుదువు. జల్లులతో మట్టిని నానింతువు. ఆ మట్టినుండి మొలచిన మొలకలకు పెంపును ఒసగుదువు.
11. సంవత్సరమును సమృద్ధి ' అను కిరీటముతో అలంకరించితివి. నీవు నడచిన తావులందెల్ల సమృద్ధి నెలకొనెను.
12. ఎడారి పొలములు పచ్చబడినవి. కొండనేలలలో ఆనందము నెలకొనినది.
13. పచ్చిక పట్టులలో గొఱ్ఱెలమందలు వస్త్రము కప్పినట్లుగా ఉన్నవి. లోయలలో గోధుమపైరు కంబళ్ళు పరచినట్లుగా ఉన్నది. ఆ పొలములెల్ల ఆనందముతో పాటలు పాడుచున్నవి.