ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

Psalms 6

1. ప్రభూ! నా మీద కోపించి, నన్ను చీవాట్లు పెట్టకుము. నా మీద ఆగ్రహము చెంది, నన్ను దండింపకుము.
2. ప్రభూ! నేను దుర్బలుడనైతిని. నన్ను కరుణింపుము. ప్రభూ! నా యెముకలు వణుకుచున్నవి.
3. నేను మిగుల వ్యాకులము చెందితిని, ప్రభూ! ఈ వేదన ఎన్నాళ్లు?
4. దేవా! నీవు శీఘ్రమే విచ్చేసి నన్ను కాపాడుము. నీవు కృప కలవాడవు కనుక నన్ను రక్షింపుము.
5. మృతులు నిన్ను స్మరింపరు. పాతాళ లోకమున నిన్ను ఎవరు స్తుతింతురు?
6. నేను విచారము వలన కృశించితిని. ప్రతిరేయి నా పడుక కన్నీటితో తడియుచున్నది, నా తలదిండు అశ్రుజలమున నానుచున్నది.
7. ఏడ్పుల వలన నా కళ్లు గుంటలు పడినవి. శత్రువుల పీడనము వలన,కంటి చూపు కూడ మందగించినది.
8. దుష్టులారా! మీరు నా చెంత నుండి తొలగి పొండు. ప్రభువు నా రోదనమును ఆలకించెను.
9. ప్రభువు నా మనవి వినెను. ఆయన నా ప్రార్ధనమును అంగీకరించి తీరును.
10. నా విరోధులెల్లరు అపజయము పొంది భయబ్రాంతులగుదురు గాక! సిగ్గుపడి శీఘ్రమే వెనుదిరిగి పోవుదురు గాక!