ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

Psalms 5

1. ప్రభూ! నా పలుకులు ఆలకింపుము,నా నిట్టూర్పులు వినుము.
2. నా రాజా! నా దేవా! నీ సహాయము కొరకు నేను పెట్టు మొరను ఆలకింపుము.
3. ప్రభూ! వేకువన నీవు నా ప్రార్ధన ఆలకించుము. ప్రాతఃకాలమున నేను నీకు ప్రార్థనలు అర్పించి వేచియుందును.
4. నీవు దుష్టత్వమున ఆనందించు దేవుడవు కావు.చెడుతనమునకు నీ యొద్ద చోటు లేదు.
5. గొప్పలు చెప్పు కొను వారిని సహింపవు. దుర్మార్గులను అసహ్యించుకొందువు.
6. అబద్ధములాడు వారిని నాశము చేయుదువు. మోసగాండ్రును, నరహత్య చేయు వారిని నీవు అసహ్యించుకొందువు.
7. నేను మాత్రము నీ కృపాతిశయము వలననీ ఆలయమున ప్రవేశింతును, నీ పట్ల భయభక్తులు చూపుచు,నీ పవిత్ర మందిరమున నీకు మొక్కు కొందును.
8. ప్రభూ! శత్రువులు నా కొరకు కాచుకొని యున్నారు. న్యాయవంతుడవైన నీవు నన్ను నడిపింపుము. నా మార్గమును సుకరము చేయుము 
9. నా విరోధులను నమ్మరాదు. నన్ను నాశము చేయవలె ననియే వారి కోరిక. వారి నోరు, తెరచిన సమాధి వంటిది. వారి మాటలు, బయటికి తీయగా నుండును.
10. దేవా! నీవు వారిని అపరాధులనుగా చేయుము. వారు తాము త్రవ్విన గోతిలో, తామే కూలునట్లు చేయుము. వారు బహుపాపములు చేసిరి కనుక, నీ మీద తిరుగబడిరి కనుక, నీ యెదుటి నుండి వారిని గెంటివేయుము.
11. కాని నిన్ను ఆశ్రయించిన వారందరు ఆనందింతురు. నిరతము సంతసముతో గానము చేయుదురు. నిన్నుప్రేమించు వారిని నీవు సంరక్షింతువు. వారు నిన్ను తలంచుకొని ప్రమోదము చెందుదురు.
12. ప్రభూ! నీవు నీతిమంతులను దీవింతువు. నీ కృప వారిని డాలు వలె కాపాడును.